Stock Market

ఒక అంకుర సంస్థలో వివిధ దశల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. అతి కొద్ది మొత్తం వ్యవస్థాపక దశలో పెట్టి కొన్ని లక్షల రెట్లు రాబడి పొందే అవకాశం ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక ఉత్పత్తి ఒక రూపు సంతరించుకుని కొంచెం నమ్మకం కుదిరాక పెట్టుబడి పెట్టవచ్చు. లేదంటే ఊపందుకున్నాక రెండో, మూడో అంచెలో ఒక మోస్తరు మొత్తానికి సంస్థలో మంచి వాటా తీసుకోవచ్చు. ఆపై ఐ. పి. ఓ ఉండనే ఉంది.

మీరు ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత ధన నష్ట ముప్పు పరిమితి మీద ఆధారపడి ఉంటుంది. ముప్పుకి పెట్టుబడికి ఏమిటి సంబంధం అంటే ఒక ప్రతీకాత్మక చిత్రం ఇది.

సంస్థ మనుగడ సాగుతున్న కొద్దీ నష్ట భయం తగ్గుతూ వస్తుంది. అంటే ప్రతి సంస్థా IPO దశకు చేరుతుంది అని మాత్రం చెప్పలేము. IPO కి ముందు పెట్టిన పెట్టుబడులు ఎన్నో వందల రెట్ల లాభం ఇవ్వగలవు. అసలు మూలధనం పూర్తిగా తుడిచి పెట్టగలవు కూడా.

ఈ నష్ట భయాన్ని ఎలా చూడాలి అంటే ఇదిగో ఇలా. ప్రస్తుతం చుస్తే భవిష్యత్తులో అల్లంత దూరాన ఆదిగో లాభం నష్టం మధ్య ఏమైనా జరగవచ్చు.

ఒక్కో అడుగు ముందుకు వేసినా కొద్దీ నష్ట భయం కొంత తగ్గుతుంది. అందుకే సంస్థ విలువ పెరుగుతుంది.

ఇదే సూత్రం IPO కి కూడా వర్తిస్తుంది. IPO తో పోలిస్తే లిస్టింగ్ తరువాత అసలు విలువ తెలిసే అవకాశం ఎక్కువ. అంటే నష్ట భయం తక్కువ. కానీ దానివల్ల ఒకవేళ లాభంలో ఉంటే మన చేతికి వచ్చే లాభం తక్కువ.

IPO లో కొనాలా తరువాతనా అనేదానికి మీ వ్యక్తిగత నష్ట భయ సమర్థ్యం ఒక్కటే ముఖ్య పరిగణ. మీరు డబ్బు కోల్పోవడం భరించ గలిగితే, సంస్థ గురించిన సమాచారం మీద నమ్మకం ఉంటే IPO లో ప్రయత్నించవచ్చు. లేదంటే మార్కెట్లో ధర స్థిరీకరణ జరిగాక మామూలుగా ఎలాగూ కోనేయవచ్చు.

ఇంకో విషయం – సంస్థ పునాది బలంగా ఉంటే IPO లో కొన్నా తరువాత కొన్నా దీర్ఘకాలిక లాభాల్లో IPO లిస్టింగ్ లాభాలు చాలా చిన్నవి. సంస్థ బాగాలేక పొతే IPO లో పెట్టిన మూలధనం సైతం కోల్పోవచ్చు.

ఇక మిగిలింది సంస్థ పని తీరుతో సంబంధం లేకుండా, అప్పటి మార్కెట్ గతిని బట్టి, ట్రెండ్ లో ఉన్న రంగాన్ని బట్టి, మదుపరులలో ఉన్న ఆసక్తి వల్ల రాగలిగే లిస్టింగ్ గైన్స్. దానికోసమే అయితే సరైన విశ్లేషణ చేసి IPO లో పెట్టుబడి పెడితే కానీ తెలియదు.

కొన్ని ఆసక్తికర విశ్లేషణలు :

లిస్టింగ్ లాభాలు:

లిస్టింగ్ రోజు లాభం లో ముగిసినవి నీలి రంగు, తతిమా బూడిద రంగులో ఉన్నవి నష్టం చవి చూసినవి. ఇదే ముందు చెప్పిన నష్ట భయం. ఏది జరిగేది ముందు అంచనా వేయడమే తప్ప పూర్తిగా తెలుసుకోలేము.

మూలం: https://www.nasdaq.com/articles/trends-in-ipo-pops-2021-03-04?amp

దీర్ఘ కాలిక కదలిక: ( భారతీయ షేర్లు)

2013 లో తప్ప సంవత్సరం తిరిగే సరికి పెద్ద లాభం ఏమి లేదు. త్రైమాసిక ఫలితాలు వస్తూ ఉంటే అసలు సమాచారం తెలిసి ధర అందుకు తగ్గట్టు సర్దుబాటు అవడం వల్ల.

NASDAQ లో ఒక అధ్యయనం ప్రకారం IPO తరువాత ఇలా

మూలం: https://www.nasdaq.com/articles/what-happens-to-ipos-over-the-long-run-2021-04-15?amp

మొత్తంగా చెప్పేది ఏంటంటే IPO లో అధిక నష్ట భయం, అన్నీ బాగుంటే అధిక రాబడి లేదా మూల ధన నష్టం.

అదే మములు స్టాక్ కొంటే ఒక మోస్తరు నష్ట భయం, ఒక మోస్తరు రాబడి. మూల ధన నష్టం అవకాశం బాగా తక్కువ.

ఏది మంచిది అనేదానికి మన ఆర్థిక పరిస్థితి, విశ్లేషణ సామర్థ్యం, అప్పటి సూచీ పని తీరు ఆధారంగా సమాధానం మారుతుంది.

 ఐపీవో అంటే అంత వరకూ ప్రైవేటుగా ఉన్న సంస్థ పబ్లిక్ మార్కెట్లలో లిస్టు అవడం.

పబ్లిక్ సంస్థగా లిస్టు అవ్వాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. వాటికి లోబడి స్టాకును లిస్టు చెయ్యవచ్చు.

స్టాకు ప్రాథమికంగా మంచి ఫండమెంటల్స్ కలిగి ఉందా లేదా అనేది డీ ఆర్ హెచ్ పీ ద్వారా తెలుసుకోవచ్చు.

స్టాకు మంచిదా కాదా అనేది ఉన్న సమాచారం ద్వారా పరీక్షించవచ్చు.

ఇందులో ఐపీవో కి ప్రత్యేకమైంది ప్రైస్ డిస్కవరీ. అంటే ఏ ధర సరైనది అని మార్కెట్టు నిర్ణయిస్తుంది. ఆ తతంగం అంతా మొదటిసారి జరుగుతుంది. అది వివిధ కారణాల వల్ల సంస్థ విక్రయించిన ధర కంటే ఎక్కువగా ఉండవచ్చు లేదా తక్కువగా.

అన్నీ సమకూరితే మంచి లిస్టింగు లాభాలు వస్తాయి. ఇంతకు ముందు లేని ప్రత్యేకమయిన సంస్థలో భాగమవడానికి ఇది మీకో అవకాశం.

Stock Market

Stop loss అంటే ఎక్కువ లాస్ నుండి మనల్ని మనం సేవ్ చేసుకోవడం అనుకోవచ్చు.
ఒక స్టాక్ నష్టాల్లో కూరుకున్నప్పుడు, కొన్ని సార్లు సరైన నిర్ణయం అమ్మెయ్యటం. అయితే, మన భావోద్వేగాలు నష్టాన్ని భరించలేవు. మళ్ళీ పుంజుకుంటుందేమో అన్న ఆశతో అమ్మకుండా ఉంచి మరింత నష్టాల పాలవుతాము.

లేదా, మీరు ఒక స్టాక్ కొని, అంతర్జాలం లేని ప్రదేశాలకు విహార యాత్రకు వెళ్లొచ్చు. మీరు యాత్రలో ఉండగా, ఆ కంపెనీ స్టాక్ పడిపోవచ్చు.

ఇటువంటి ప్రమాదాలను అరికట్టటానికి ‘స్టాప్ లాస్’ వాడొచ్చు. మీరు 100/- కి స్టాక్ కొంటే, 20/- కన్నా ఎక్కువ నష్టం రాకూడదు అనుకుంటే, 80/- ‘స్టాప్ లాస్’ ఆర్డర్ పెట్టొచ్చు. ఇప్పుడు, ఆ స్టాక్ విలువ 80/- తాకినా, అంతకన్నా కిందకు వెళ్లినా, మీ ప్రమేయం లేకుండా మీ స్టాక్ మొత్తం అమ్మివేయబడుతుంది.

మీరు వంద రూపాయలకి ఒక స్టాక్ కొన్నారని అనుకుందాం. మీరు మీ ట్రేడ్ లో పది రూపాయల కంటే ఎక్కువ లాస్ తీసుకోదల్చుకోలేదు, అప్పుడు 90 కి స్టాప్ లాస్ పెట్టుకుంటారు ఒకవేళ స్టాక్ 90 కన్నా కింద పడితే మీరు ఆ స్టాక్ నుండి ఎగ్జిట్ అవుతారు.
రాజు రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుందని నలుగురూ అంటుంటే లాభానికి అమ్మేద్దామని 50 లక్షలకు ఒక ఫ్లాట్ కొన్నాడు. డీమానెటైజేషన్ అనీ, కోవిడ్ అనీ ఏళ్ళ తరబడి ఫ్లాట్ విలువ పెరక్కపోగా తగ్గి 45 లక్షలయింది. మళ్ళీ పెరుగుతుందని ఎవరో చెబితే అట్టే పెట్టుకున్నాడు. ఇప్పుడదే 40 లక్షలు పలుకుతోంది. 45 లక్షలు స్టాప్-లాస్ అనుకుని 5 లక్షల నష్టానికి అమ్మివేసి ఆ వచ్చిన డబ్బు వేరే పెట్టుబడి పెడితే బాగుండేది.

స్టాప్-లాస్ అంటే పెట్టుబడిలో మనం తట్టుకోగల గరిష్ట నష్ట పరిమితి.

స్టాక్ మార్కెట్ పరిభాషలో ఉదాహరణ:
రాము 2019లో లక్ష రుపాయలతో 370 ఐటీసీ షేర్లు 270 రుపాయల వద్ద కొన్నాడు. ఆ లక్షలో 15 వేలు మాత్రమే రిస్క్ చెయ్యగలను అనుకుని తదనుగుణంగా షేరు ధర 230కి పడిపోతే మొత్తం అమ్మేయాలనుకున్నాడు. 2020 జనవరిలో అమ్మేశాడు. ఇక్కడ 230 స్టాప్-లాస్.

తరువాత మార్చిలో మార్కెట్లు పతనమైనప్పుడు ఆ వచ్చిన 85,000 రుపాయలకు 77 రిలయన్స్ షేర్లు 1100 వద్ద కొన్నాడు. ఈసారి పదివేలు మాత్రమే గరిష్ట నష్టం అనుకుని షేరు 970కి పడితే (స్టాప్-లాస్) అమ్మేయాలనుకున్నాడు. అంతదాకా రాలేదు, ఆపై ఏడాదిలో 100% లాభానికి అమ్మేశాడు.

రాము, రాజు కథలు నిజమే, పేర్లు కల్పితం.

అయితే ఈ స్టాప్-లాస్ ఎక్కడ పెట్టుకోవాలన్న విషయంలో మూడు పద్ధతులున్నాయి.

పైన చెప్పిన మూలధన ప్రకారం అనుకునేది ఒక రకం.

ఫండమెంటల్ విశ్లేషణతో వచ్చేది ఒక రకమయితే, సాంకేతిక విశ్లేషణతో మూడవ రకం.

ఫండమెంటల్ విశ్లేషణ:

ఇందులో “సంస్థ వ్యాపార వ్యూహం మారినప్పుడు (మంచికి కాదు)” అన్నది ఒక విధమైన స్టాప్-లాస్.

ఉదాహరణకు ఐటీసీ సంస్థ తమ మూలవ్యాపారమైన పొగాకు ఉత్పత్తులపై ఆధారపడకూడదని వేరే రంగాల్లోకి అడుగుపెట్టాలనుకోవటం మంచిదే అనుకున్నారంతా. అయితే ఆ అడుగు పెట్టే రంగాలు లెక్కకు మించి, అనుభవం లేనివి కావటంతో పొగాకు ఉత్పత్తులపై వచ్చే లాభాల్లో సింహభాగం మిగతా ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ కొరకు ఖర్చు చెయ్యవలసి వస్తోంది. తత్ఫలితంగా ఏళ్ళ తరబడి షేరు ధర పెరగనా తరగనా అంటూ అక్కడే తారాడుతోంది.

సంస్థ యాజమాన్యం చట్టవిరుద్ధ చర్యలు చేసినట్టు తెలియటం మరొక విధమైన స్టాప్-లాస్. సత్యం, ఫోర్టిస్ యజమానుల చేష్టలు ఇందుకు తార్కాణాలు.

సంస్థ ఆడిటర్ మారటం మరొక స్టాప్-లాస్ సంకేతం. ఉదాహరణకు మన్పసంద్ బెవరేజస్.

సాంకేతిక విశ్లేషణ:

ఇందులో కేవలం చార్ట్ చూసి మునుపు గిరాకీ-సరఫరా స్థాయిలను గుర్తించి తదనుగుణంగా స్టాప్-లాస్ నిర్ధారించుకోవచ్చు.

అయితే stop loss అనేది loss లో కాకుండా ప్రాఫిట్ లో కూడా పెట్టుకోవచ్చు దాన్ని trailing స్టాప్ లాస్ అంటారు.

ఉదాహరణకి మీ ₹100 స్టాక్ 110 రూపాయలు వెళ్తే 105 రూపాయలు దగ్గర మీరు trailing stoploss పెట్టుకుంటారు. 105 కన్నా కింద పడితే మీరు ఆ stock అమ్మేస్తారు.

ముఖ్య గమనిక: ‘స్టాప్ లాస్’ 80/- కి పెట్టినంత మాత్రాన 80/- కి అమ్మబడుతుందని చెప్పలేము. పెద్ద దుర్వార్త వెలువడితే, స్టాక్ ఉన్నపళంగా 60/- కి పడిపోవచ్చు… అప్పుడు ‘స్టాప్ లాస్’ ఆర్డర్, మీ స్టాక్స్ అన్నిటిని 60/- కి అమ్మేస్తుంది. ఇలా జరిగే అవకాశం చాలా తక్కువ.

మరో గమనిక: ‘స్టాప్ లాస్’ మీరు కొన్న ధరకి మరీ దగ్గరగా పెట్టకూడదు. స్టాక్స్ సహజంగా హెచ్చు తగ్గులకు గురవుతాయి. మరీ దగ్గరగా పెడితే, అనవసరంగా నష్టాలకు గురవుతారు.

Stock Market

హర్షద్ మెహతా స్కాం అనేది చాల పాతది ఇంకా అప్పటికి స్టాక్ మార్కెట్ పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి రాలేదు.

అప్పటికి స్టాక్ ఎక్స్చేంజి లో సంస్కరణలు ప్రారంభము కాలేదు.

మెహతా చేసినది ఏమంటే, షేర్లను తాకట్టు పెట్టి బ్యాంకులలో డబ్బు తీసుకున్నాడు.

అప్పటికి షేర్లు కేవలం పేపర్ల పైన ఉండేవి ఇప్పటి మాదిరి డిజిటల్ ఫార్మ్ లో లేవు. అందువల్ల అయన కొన్ని రకాల షేర్లను వేల సంఖ్యంలో కొని వాటిని బ్యాంకులలో కుదువ పెట్టాడు.

అదే సమయంలో వాటికీ విలువ పెరగటానికి వాటి రేటు కృత్రిమంగా పెంచాడు.

మీకు ఉదాహరణగా చెప్తాను.

శ్రీనివాస్ లాప్టాప్ అనే కంపెనీ ఉందనుకోండి.

మెహతా దాని షేర్లను ప్రతి రోజు ఎక్కువ రేటుకు కొంటాడు.

ఒక వెయ్యి షేర్లు 10 రూపాయలకు, మర్నాడు వాటినే 20 రూపాయాలకు ఆలా.

ఒక నెలలో వాటిని 50 రూపాయల దాక తీసుకుని పోతాడు. అప్పటికి అయన దగ్గర శ్రీనివాస్ లాప్టాప్ అనే కంపెనీ షేర్లు ఒక 10000 ఉంటాయి.

వాటి విలువ 10000 X 50 = 5 ,౦౦,౦౦౦, అవుతుంది. ఇప్పుడు వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి 400000 తీసుకుని మరో షేర్లను ఇలాజె పరుగులు పెట్టిస్తాడు. ఇలాకొన్ని రోజులకు బ్యాంకులనుండి అయన తీసుకున్న అప్పు లక్షల్లో చేరి అయన మార్కెట్ లో నుండి విరామంచుకున్నప్పుడల్లా మార్కెట్ పడిపోవటం మొదలు పెట్టింది.

ఈ ఫిజికల్ షేర్లు కొన్ని డూప్లికేట్ అయ్యి బ్యాంకులో వున్నవి వున్నట్టే వుండి అవ్వే షేర్లు మెహతా ద్వారా అమ్మబడ్డాయి.

ఈ విషయాలు బయట పడేటప్పటికి చాల ఆలస్యం అయ్యి ఎప్పుడు కూలదామా అని వుండే మార్కెట్ ఒక్క సరిగా కుప్ప కూలి పోయింది.

నకిలీ షేర్ల కారణంగా బ్యాంకులు, ఇతర కొనుగోలుదారులు నష్ట పడ్డారు.

చాలా షేర్లు అసలు చలామణిలో లేవని తెలిసింది. అంటే శ్రీనివాస్ లాప్టాప్ అని కంపెనీనే లేదు వున్నా మూత పడింది. ఒక వేళా బతికే వున్నా దాని షేరు విలువ అర్థ రూపాయి కూడా ఉండదు. అటువంటి షేరులు 50 రూపాయలకు కొంటె కొన్న వాడి పరిస్థితి ఏమిటి, తాకట్టు పెట్టుకున్న బ్యాంకు పరిస్థితి ఏమిటి.

ఈ కుంభ కోణం తరువాత,

స్టాక్ ఎక్స్చేంజి,

కొన్ని షరతులు పెట్టింది.

ఏ షేరు కూడా ఒక రోజులో 20 % కంటే ఎక్కువ పెరగ కూడదు.

అన్ని షేర్లు డీమ్యాట్ అకౌంట్ ద్వారా నే లావాదేవీలు జరగాలి. అన్ని షేర్లను కాగితాల రూపంలో నుండి ఎలెక్ట్రానిక్ రూపంలోకి మార్చుకోవాలి.

బ్యాంకులు కూడా ఇటువంటి తాకట్టు విషయాలలో జాగ్రత్త పడాలి.

దీని తరువాత మార్కెట్ లో స్కాం లు తగ్గినాయి.

Stock Market

(Dividend)డివిడెండ్: ఏదైనా ఒక కంపెనీ తనకు వచ్చిన లాభల్లో కొంత భాగాన్ని ఆ కంపెనీ లో షేర్లు కలిగినటువంటి షేర్ హోల్డర్స్ (Share Holders) కి పంచుతుంది. వాటిని డివిడెండ్ (Dividend) అని అంటారు.

సాధారణంగా ఈ డివిడెండ్స్ ని సంవత్సరానికి ఒకసారి గాని లేదా ఆరు లేదా మూడు నెలలకు ఒకసారి గాని ప్రకటిస్తాయి . ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్ని కంపెనీ లు తమ త్రైమాసిక ఫలితాలను(Quarterly Results) ప్రకటిస్తూ ఉంటాయి. ఆ సమయంలోనే డివిడెండ్ ఇస్తున్నాయా లేదా ఇస్తే ఎంత శాతం డివిడెండ్ ఇస్తున్నాయి వంటి వివరాలు ప్రకటిస్తాయి.

అలాగే ప్రతిసారి ఒకే విధంగా డివిడెండ్ ఇవ్వాలని లేదు. ఆ కంపెనీ కి వచ్చిన లాభాలను బట్టి ఈ డివిడెండ్ (Dividend) ని ఇస్తాయి ఒక్కొక్కసారి ఈ డివిడెండ్ ఇవ్వడం కూడా మానేస్తాయి.

అయితే అన్ని కంపెనీ లు కూడా ఈ డివిడెండ్ లు ఇవ్వవు కేవలం కొన్ని కంపెనీ లు మాత్రమే డివిడెండ్ ని ఇస్తాయి.

బాగా పేరు పొందిన పెద్ద పెద్ద కంపెనీలు తమకు వచ్చిన లాభాలలో కొంత భాగాన్ని డివిడెండ్ గా ఇచ్చి మిగిలిన భాగాన్ని కంపెనీని మరింత విస్తరించడానికి ఖర్చుచేస్తాయి. కానీ కొత్తగా ఏర్పడిన కంపెనీలు, చిన్న కంపెనీ లు మాత్రం ఈ డివిడెండ్ ని ప్రకటించకుండా పూర్తి లాభాలను కంపెనీని మరింత అభివృద్ధి చెయ్యడానికి ఖర్చు చేస్తాయి.

చాలా మంది ఏ కంపెనీ అయితే ఎక్కువగా డివిడెండ్ ని ఇస్తాయో అటువంటి కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తారు. దాని వల్ల షేర్ ధర (Share Price) ఇంకా పెరుగుతుంది. కాబట్టి కంపెనీ లు ఇన్వెస్టర్స్ ని ఆకర్షించడానికి డివిడెండ్ లు ప్రకటిస్తాయి. ఎంత శాతం డివిడెండ్ ఇవ్వాలి అనేది ఆ కంపెనీ బోర్డు అఫ్ డైరెక్టర్స్ (Board of Directors) నిర్ణయిస్తారు.

డివిడెండ్స్ ని డబ్బు రూపంలో గాని లేదా షేర్ల రూపంలో గాని ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా డబ్బు రూపంలోనే డివిడెండ్స్ ని ప్రకటిస్తారు. ఒకవేళ కంపెనీలు డివిడెండ్ ని ప్రకటిస్తే ఆ డబ్బు డైరెక్ట్ గా మన బ్యాంకు అకౌంట్లో క్రెడిట్ అయ్యిపోతుంది.

ఇలా డివిడెండ్స్ (Dividends) ఇచ్చే కంపెనీలలో పెట్టుబడి పెట్టడం వలన షేర్ ధర పెరగడం వలన వచ్చే లాభాలతో పాటుగా ఈ డివిడెండ్ ను కూడా అదనంగా పొందవచ్చు.

దేశంలో అత్యధిక డివిడెండ్ యీల్డ్ ఉన్న షేర్లు:

ఇక్కడ “Div Yld” అని ఉన్నదే డివిడెండ్ యీల్డ్.

వీటిలో చిన్నాచితకా సంస్థలు తీసేస్తే:

ఈ జాబితాలో సగం ప్రభుత్వ రంగ సంస్థలే. వీటి విలువ పెంచటానికో, వ్యాపారం వృద్ధి చెయ్యటానికో కాక కేవలం డివిడెండ్లు పిండుకోటానికే అన్నట్టు నడుపుతున్నారు.

డివిడెండ్ పే చేసే స్టాక్స్ సంవత్సరంలో ఎన్నిసార్లు పే చేస్తారు?

సాధారణంగా ఆర్థిక ఫలితాలు ప్రకటించేప్పుడు డివిడెండ్లు ప్రకటిస్తారు – త్రైమాసిక ఫలితాలు కావచ్చు, వార్షిక ఫలితాలు కావచ్చు. అయితే మన దేశంలో ఏడాదికొక సారి, మధ్యలో ఒకటి-రెండు సార్లు డివిడెండ్లు ప్రకటించటం పరిపాటి.

డివిడెండ్ అనేది డబ్బు రూపంలోనే ఇస్తారా? లేదా స్టాక్స్ రూపంలో కూడా ఇస్తారా?

డివిడెండ్ నగదు రూపంలోనే ఇస్తారు – అలా ఇచ్చే దాన్నే డివిడెండ్ అంటారు. స్టాక్స్ రూపంలో ఇచ్చేవి బోనస్ అంటారు.

Stock Market

ఒక సంస్థ తమ లాభాలను మదుపర్లతో రెండు విధాలుగా పంచుకుంటుంది:

నగదు డివిడెండ్ – ఒక షేరుకు ఇంత నగదు అని పంచటం.

షేర్ల డివిడెండ్ – ఒక షేరుకు ఇన్ని షేర్లు అని పంచటం (ఇదే బోనస్ ఇష్యూ).

డివిడెండ్‌పై DDT(డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్) ఉంటుంది, బోనస్ షేర్లపై ఎటువంటి పన్నూ ఉండదు.

బోనస్ షేర్లు జారీ చేసేందుకు పలు కారణాలు:

సంస్థ ప్రమోటర్లు వారి వోటింగ్ హక్కును పెంచుకోవటం.

షేర్ల ద్రవ్యత్వాన్ని పెంచటం. ఒక షేరు వెల బాగా ఎక్కువగా ఉంటే చిన్న మదుపర్లు కొనరు. ఇందువల్ల ద్రవ్యత్వం తగ్గి పెద్ద సంస్థ ఏదైనా ఆ సంస్థను స్వాయత్తం చేసుకోవటం చాలా సులభం. ఉదా: MRF షేరు ధర 60,000/-.

మదుపర్లలో సంస్థపై నమ్మకం, దీర్ఘకాలిక పనితనంపై విశ్వాసం కలిగించటం.

బోనస్ షేర్ల వల్ల మదుపర్లకు కలిగే ప్రయోజనాలు:

ఉచితంగా సంస్థలో మరింత భాగం దక్కటం.

ఉచితంగా వచ్చిన షేర్లపై ఎటువంటి పన్ను లేకపోవటం.

ఇకపై నగదు డివిడెండు ప్రకటించినప్పుడు ఎక్కువ నగదు వచ్చే అవకాశం.

ఒక ఉదాహరణ:

ఒకవేళ ఎవరైనా 1980 సంవత్సరంలో 10,000 రూపాయలు కనుక (Wipro)విప్రో కంపెనీ లో పెట్టుబడిగా పెట్టి 34 సంవత్సరాల పాటు కొనసాగించి ఉంటె 2014 సంవత్సరంలో వాటి విలువ అక్షరాలా 535 కోట్ల రూపాయలు. నమ్మశక్యంగా లేదు కదా.అదెలాగో ఇప్పుడు చూద్దాం

1980 సంవత్సరంలో విప్రో కంపెనీ షేర్ ధర 100 రూపాయలాగా ఉండేది. ఆ సమయంలో మనం 10000 రూపాయలతో విప్రో కంపెనీకి చెందిన 100 షేర్లు కొన్నాం అనుకుందాం.

1981 లో విప్రో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. అంటే మన దగ్గర 1 షేర్ కనుక ఉంటె విప్రో కంపెనీ మరొక షేర్ ని బోనస్ గా మన ఖాతాలో వేస్తుంది. కాబట్టి మనం 100 షేర్లు కొన్నాం కాబట్టి ఇప్పుడు మన దగ్గర 200 విప్రో షేర్లు ఉన్నట్టు.

1985 సంవత్సరంలో కంపెనీ మరలా 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. దాంతో మన దగ్గర ఉండే 200షేర్లు కాస్త 400 షేర్లు అయ్యాయి

1986 లో కంపెనీ తన షేర్ ధరను 10 రూపాయలుగా విభజించింది. దీనినే స్టాక్ స్ప్లిట్ (Stock Split) అంటారు. దీని గురించి రాబోయే భాగాలలో వివరంగా తెలుసుకుందాం. ఇలా షేర్ విభజన జరగడంతో మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 400 నుండి 4000 చేరుకుంది.

1987 లో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. మన దగ్గర ఉండే 4000 షేర్లకి కంపెనీ బోనస్ గా 4000 షేర్లు ఇవ్వడంతో ఇప్పుడు మన దగ్గర షేర్ల సంఖ్య 8000 కి చేరుకుంది.

1989 లో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. ఇప్పుడు మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 16,000 కు చేరుకుంది.

1992 లో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది.ఇప్పుడు మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 32,000 కు చేరుకుంది.

1995 లో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది.ఇప్పుడు మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 64,000 కు చేరుకుంది.

1997 లో కంపెనీ ఈ సారి 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. అంటే మన దగ్గర ఉన్న ఒక్కొక్క షేర్ కి రెండు షేర్లను బోనస్ గా ఇస్తుంది. దాంతో మన దగ్గర ఉండే 64,000 షేర్లు 1,92,000 షేర్లు అయ్యాయి.

1999 లో కంపెనీ మరలా తన షేర్ ధరను 2 రూపాయలుగా విభజించింది (Stock Split). ఇలా Stock Split జరగడంతో మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 1,92,000 నుండి 9,60,000 చేరుకుంది.

2004 లో కంపెనీ 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. ఇప్పుడు షేర్ల సంఖ్య 28,80,000 కు చేరుకుంది.

2005 లో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. ఇప్పుడు మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 57,60,000 కు చేరుకుంది.

2010 లో కంపెనీ 2:3 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. అంటే మన దగ్గర 3 షేర్లు ఉంటె కంపెనీ బోనస్ గా 2 షేర్లను ఇస్తుంది. దాంతో మన దగ్గర ఉన్న షేర్ల సంఖ్య 96,00,000.

అంటే మనం 1980 లో 10000 రూపాయలతో కొన్న 100 షేర్లు కాస్త Stock Split, బోనస్ కారణంగా 2010 నాటికి 96,00,000 షేర్లగా మారాయి. ఈ 96 లక్షల షేర్లను 2014 వరకు అమ్మలేదు అనుకుందాం. 7 April, 2014 నాటికి విప్రో కంపెనీ షేర్ ధర 557 రూపాయలుగా ఉంది.

అంటే ఒక్క షేర్ ధర 557 రూపాయలు. మన దగ్గర ఉన్న షేర్ల సంఖ్య 96,00,000. ఇప్పుడు వీటి విలువను లెక్కగడితే

557 × 96,00,000 = Rs.534,72,00,000/- . సుమారుగా 535 కోట్ల రూపాయలు. అంతేకాదు ఈ 535 కోట్ల రూపాయల లాభానికి ఒక్క రూపాయి కూడా టాక్స్(TAX) కట్టవలసిన అవసరం లేదు.

కేవలం Wipro కంపెనీ ఒక్కటే కాదు. Cipla , Reliance, Titan, Dr. Reddy Labs ఇలా ఎన్నో కంపెనీలు ఇటువంటి లాభాలనే అందించాయి.

10000 రూపాయలు ఎక్కడ , 535 కోట్ల రూపాయలు ఎక్కడ. బ్యాంకు , రియల్ ఎస్టేట్, బంగారం ఇలా రంగంలో అయిన ఇంత రాబడి రాదు. అయితే 1980 లో పెట్టుబడి పెట్టి 34 సంవత్సరాల పాటు ఆ పెట్టుబడి ని కొనసాగించిన వారు మాత్రమే అంత లాభం పొందారు. చాలా తక్కువ మందికి మాత్రమే అంతటి ఓపిక ఉంటుంది. చాల మంది ఈరోజు పెట్టుబడి పెట్టి రేపటికి అది రెట్టింపు అయిపోవాలని ఆతృతతో స్టాక్ మార్కెట్ లోకి వచ్చి చేతులు కాల్చుకుంటారు. కాబట్టి Stock Market మీద కొద్దీ పాటి జ్ఞానం, అవగాహన, ఓపికతో పెట్టుబడి పెడితే తప్పకుండ దీర్ఘకాలం లో మంచి లాభాలు పొందవచ్చు.

ఇది వాస్తవం, ఊహా లెక్క కాదు.

Stock Market

ఆప్షన్స్ కొనటం అంటే నష్టపోయే ట్రేడింగ్ అని ఎందుకంటారు?

ఇది తెలుసుకునేందుకు ముందు కొన్ని పదాలు తెలుసుకోవాలి:

చాంచల్యం (volatility): మార్కెట్లో పెద్ద కదలికలు (పైకో, కిందకో) వేగంగా రావటం

స్థిరత్వం (stability): మార్కెట్లు నెమ్మదిగా కదలటం (పైకో, కిందకో)

మార్కెట్లు ఎంత చంచలంగా కదలాడితే ఆప్షన్స్ కొని, అమ్మేవారికి అంత లాభం; అమ్మి, కొనేవారికి (షార్ట్ చేసేవారు) అంత నష్టం.

మార్కెట్లు ఎంత స్థిరంగా ఉంటే ఆప్షన్స్ కొని, అమ్మేవారికి అంత నష్టం; అమ్మి, కొనేవారికి అంత లాభం.

దీనికి కారణం ఆప్షన్స్‌కు ఉన్న కాలక్షీణత (Time Decay) లక్షణం.

ఏమిటీ కాలక్షీణత?

జనవరి 29న నిఫ్టీ 13650, నిఫ్టీ ఫిబ్రవరి 14500 CE ఆప్షన్ ధర 95.

ఫిబ్రవరి నెలాఖరుకు నిఫ్టీ 14500కు కిందే ఉంటుందనుకుందాం. అప్పుడు 14500 CE ఆప్షన్ ధర 0. నెలరోజుల్లో మార్కెట్ 14500 కంటే పైకి వెళ్ళలేదు కాబట్టి 14500, ఆపై స్ట్రైక్ ఉన్న కాల్ ఆప్షన్స్ అన్నీ 0 అయిపోతాయి. 14500, ఆకింద ఉన్న స్ట్రైక్ పుట్ ఆప్షన్స్ కూడా 0 అయిపోతాయి. ఇదే కాలక్షీణత.

ఈ కాలక్షీణత ఆప్షన్స్ షార్ట్ చేసేవారి ఆప్తమిత్రుడయితే ఆప్షన్స్ కొనేవారి బద్ధ శత్రువు.

ఉదాహరణ:

29 జనవరిన మార్కెట్లు మూతపడే సమయానికి నిఫ్టీ 13650 వద్ద ఉంటే నిఫ్టీ ఫిబ్రవరి 14500 CE ఆప్షన్ ధర 95 చొప్పున ఒక లాట్ కొనటానికి 7,125 రుపాయలు (95*75).

నిన్న ఫిబ్రవరి 5న మార్కెట్ మూతపడే సమయానికి నిఫ్టీ 14950 అయితే 14500 CE ఆప్షన్ ధర 580. చాంచల్యం ఎక్కువై కేవలం 5 రోజుల్లో నిఫ్టీ 1300 పాయింట్లు (దాదాపు 9%) పెరిగింది.

14500 CE ఆప్షన్ కొన్నవారి లాభం (580-95)*75 = 36,375 రుపాయలు. ఒకవేళ మార్కెట్ ఇంతగా పెరగకపోయుంటే గరిష్టంగా ఆ 7,125 రుపాయలే నష్టం. పరిమిత నష్టం, అపరిమిత లాభం.

ఇందుకే ఆప్షన్స్ కొనేవారికి కొదవ లేదు. 7,125 రుపాయలతో 36,375 రుపాయల లాభం ఎవరికి చేదు?

అదే నిఫ్టీ 14500 CE ఆప్షన్ 95 వద్ద షార్ట్ చేసి ఉంటే (అలా షార్ట్ చెయ్యటానికి అవసరమైన మూలధనం సుమారు 1,65,000 రుపాయలు) ఒక లాట్‌పై ఇప్పటికి 36,375 రుపాయల నష్టం.

అయినా సరే ధైర్యంగా నెలాఖరు వరకు అట్టిపెట్టుకుని, అప్పటికి నిఫ్టీ 14500కు కిందే ఉంటే 95*75 = 7,125 రుపాయల లాభం, ఎందుకంటే మార్కెట్ల స్థిరత్వం, చాంచల్య లేమి వల్ల 14500 CE విలువ 0 అవుతుంది. అపరిమిత నష్టం, పరిమిత లాభం.

మరి ఇటువంటి ఆప్షన్స్ ట్రేడింగ్ ఎవరు చెయ్యాలి?

ఇక్కడ షిప్ మెకానిక్ కథ తెలిసినదే అయినా మరొకసారి చెప్పుకుందాం.

ఒకానొక రోజు ఒక నౌకకు ఏదో సమస్య వచ్చి ఇంజను మొరాయించింది. నౌకా సిబ్బంది ఎన్నివిధాల ప్రయత్నించినా సమస్య ఏమిటో తెలియలేదు. అప్పుడు నౌక యజమాని ఒక ప్రసిద్ధ మెకానిక్‌ను పిలిపించారు.

ఆయన వచ్చి రెండు గంటలపాటు ఇంజనును పరిశీలించి, దానిపై ఒక చోట చిన్న సుత్తితో తట్టాడు. అంతే, ఇంజను పనిచెయ్యసాగింది.

మరుసటి రోజు మెకానిక్ 10,000 రుపాయలకు బిల్లు పంపాడు. చిన్న సుత్తితో తట్టినందుకు అంత బిల్లా అని కోపంతో వివరాలు రాసి పంపమని బిల్లు తిప్పి పంపాడు యజమాని. అప్పుడు మెకానిక్ రాసి పంపిన వివరం:

సుత్తితో తట్టినందుకు: 100 రుపాయలు

ఎక్కడ తట్టాలో తెలిసినందుకు: 9,900 రుపాయలు

ఆప్షన్స్ ట్రేడింగ్ సరళమే కానీ ఎప్పుడు, ఎక్కడ, ఏది ట్రేడ్ చెయ్యాలో తెలుసుకోవటం ముఖ్యం. అది తెలుసుకోకుండా ట్రేడ్ చేసేవారు చివరకు డబ్బు పోగొట్టుకుని, ట్రేడింగ్ అంటే జూదమే అని టముకేస్తూ నేర్చుకోవాలన్న కుతూహలం ఉన్నవారినీ హడలగొడతారు.

ఏ విద్య అయినా అభ్యసించనిదే ఆచరించకూడదన్నది ఇంగితజ్ఞానం.

ఆప్షన్స్ ని సాధారణంగా రిటైల్ ఇన్వెస్టర్లు/ట్రేడర్స్ కొనుగోలు చేస్తారు.

ఎక్కువ మంది నష్టపోతున్నా ఎందుకు కొంటారు? అనేది మీ ప్రశ్న…

ఫ్యూచర్స్ లో రిలయన్స్ ఒక కాంట్రాక్ట్ తీసుకోవాలని అనుకొంటే,సుమారుగా 2,60,000 రూపాయలు కావాలి.

అదే కాంట్రాక్ట్ 2000 కాల్ ఆప్షన్ కి 32000, పుట్ ఆప్షన్స్ కి 30000,నిన్నటి ధరల ప్రకారం, అవసరం అవుతాయి.

అందరూ అంత మొత్తం పెట్టి ఫ్యూచర్స్ పొజిషన్ తీసుకోలేరు కాబట్టి ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ తీసుకొంటారు.

ఇంకో ప్రయోజనం ఆప్షన్స్ లో ఏంటంటే, మనం చెల్లించిన ప్రీమియం కంటే 1 రూపాయ కూడా ఎక్కువ నష్టపోము.

అదే ఫ్యూచర్స్ లో అయితే ట్రెండ్ మనకు వ్యతిరేకంగా ఉన్నంత కాలం మనం మార్జిన్ మొత్తం maintain చేయడానికి మళ్ళీ డబ్బులు పెడుతూ ఉండాలి!

ఆప్షన్స్ ఖరీదు చేసే వారికి పైన ఉదహరించిన ప్రీమియం ఒక్కటే అడ్వాంటేజ్,మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ వారికి వ్యతిరేకంగా పని చేస్తాయి…ఉదాహరణకు గ్రీక్స్ అంటే వొలాటిలిటీ, theta లాంటివి.

గ్రీక్స్ వల్ల మనం అనుకొన్న దిశ లో మన షేర్ వెళ్లినా మనం నష్ట పోయే అవకాశాలు ఎక్కువ.

కానీ మనం అనుకొన్న దిశలో మూవ్మెంట్ త్వరగా వస్తే మాత్రం theta వల్ల జరిగిన నష్టం పోగా మనకి ఎన్నో రెట్లు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

లాటరి లానే ప్రాబబిలిటీ తక్కువే కానీ తక్కువ పెట్టుబడి పైన చాలా ఎక్కువ రిటర్న్స్ ,అదీ కొద్దీ సమయంలోనే అవకాశం చాలా మందిని ఆకర్శిస్తుంది.

Stock Market

స్టాక్ మార్కెట్ ‘జీరో సం గేం’ గా పిలవబడుతుంది.

మార్కెట్లు మూసివున్న డబ్బా వంటివి అయితే అలా అనుకోవచ్చేమో, కానీ అలా కాదు. ఫ్రెష్ క్యాష్ మార్కెట్లలోకి వస్తూనే ఉంటుంది.

అంటే ఒకరికి డబ్బులు వస్తే వేరే వారికి అవి పోవాలి. లేకపోతే అవి కేవలం కాగితం మీద కనబడే లాభమే తప్ప మన జేబులోకి వచ్చినది కాదు. మనం షేర్లు కొన్నప్పుడు వేరొకరు (లేకపోతే కంపెనీ వారు) అమ్మితేనే కొనగలం. ఆ షేర్ల సంఖ్య ఫిక్సెడ్ గా ఉంటుంది. కొత్త షేర్లు ఇష్యూ చెయ్యాలంటే సెబీ వారి అనుమతి కావాలి.

మనం ₹10 లో కొన్న షేరు ₹20 లో అమ్మితే వేరే వారెవరో అది కొన్నారనే అర్ధం. కొన్ని కంపెనీల షేర్లు కొనడానికి ఎవరూ ముందుకు రారు. అప్పుడవి పతనం అయ్యి లోవర్ సీలింగు వేసుకుంటూ సున్నా కి దగ్గరగా వెళ్ళిపోతాయి. మనం ₹20 లొ కొన్న షేరు ₹10 లో అమ్ముకుంటే మనకి పోయిన పది వేరెప్పుడో ఎవరో ₹10 లొ కొని ₹20 లో అమ్మేరు గా, వారి లాభం మన నష్టం రెండూ కంపెనీకి చెందవు (ఆ కంపెనీ ఏ మన షేర్లు కొంటే తప్ప); రెండు లావాదేవీలు బ్యాలెన్స్ అయిపోయాయి రిపోర్టులో.

కంపెనీ కి కేవలం ఈ షేర్ల రూపం లో కనబడే విలువ మార్కెట్ క్యాపిటలైజేషన్ గా చూపించుకొని అదనపు నిధులు పెట్టుబడి సంస్థల నుంచీ రాబెట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఆ విలువని పెరుగుతూ ఉండేలాగ వారు చర్యలు తీసుకుంటారు. వారి కంపెనీ అమ్మాలి అనుకున్నప్పుడు ఈ క్యాపిటలయిజేషన్ ఆధారంగా అమ్ముతారు కాబట్టీ ఆప్పుడు వారి జేబులోకి లాభం వచ్చి చేరుతుంది. అంతవరకూ అది కూడా కాగితానికే పరిమితం.

అందుకే దీర్ఘ కాలిక మదుపరులెవరయినా చూసేది లాభాలలో ఉన్న కంపెనీలలో మదుపు పెట్టడానికి. ప్రతీ త్రైమాసిక ఫలితాల తరువాత ఆ కంపెనీ అర్జించిన లాభాలను మొత్తం ఇష్యూ చెయ్యబడిన షేర్ల తో హెచ్చించి డివిడెండు రూపం లో ప్రతీ షేరు హోల్డరుకీ పంచుతారు.

మిగితా దైనిక స్టాక్ మార్కెట్ లావాదేవీ ఆధారిత లాభనష్టాలన్నీ మదుపరులు, లేక ఆ షేర్లు కొనుగోలు చేసిన సంస్థలు, మ్యూచువల్ ఫండులు , అవి తనఖా పెట్టబడిన బ్యాంకులకే చెందుతాయి. ఎస్టీటీ, సర్చార్జి రూపం లో గవర్నమెంటు ప్రతీ లావాదేవీ మీద సుంకం విధిస్తుంది కాబట్టీ ఎప్పటికయినా నిజంగా లాభం అనేది కేవలం మన ప్రభుత్వం మాత్రమె పొందుతుందని చెప్పాలి .

కొన్ని ఉదాహరణలు:

మీరు ఒకానొక ప్రదేశంలో రాబోవు కాలంలో అభివృద్ధి బాగా జరిగి, భూమి విలువ పెరుగుతుందని తెలుసుకుని, కొంత భూమిని కొన్నారనుకోండి. అభివృద్ధి జరగకో, ఏదో వివాదంలో చిక్కుకునో, ఆ భూమి విలువ పడిపోయిందనుకోండి. అప్పుడు నష్టపోయిన డబ్బు ఎక్కడకు పోయినట్టు?

మీకు అనుకోకుండా కొంత డబ్బు చేతికొచ్చి, దాంతో బంగారం కొన్నారనుకోండి. కొంత కాలానికి స్టాక్ మార్కెట్లలో చాంచల్యం తగ్గటం వల్లనో, అంతర్జాతీయ పరిణామాల వల్లనో బంగారం ధర పడిపోయిందనుకోండి. మీ కొనుగోలు నష్టపూరితమైనదా?

ఓ సంస్థ IPOలో షేర్లు కొన్న మదుపరి వాటిని అలాగే అట్టిపెట్టుకుని బయ్ బ్యాక్[1]లో తిరిగి ఎక్కువ ధరకు కంపెనీకి అమ్మితే నష్టపోయింది ఎవరు?

ఓ సంస్థ షేర్లు ఒకరు 10 రూపాయలకు కొని, 9 రూపాయలకు అమ్మేసారు. అయితే, మధ్యలో డివిడెండ్ 2 రూపాయలు వచ్చుంటే ఇది నష్టపూరిత లావాదేవి కాదు.

కొందరు మదుపర్లు తమ పోర్ట్ ఫోలియో రక్షణకు హెడ్జింగ్ ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలో ఓ సంస్థకు చెందిన ఒక సాధనంలో ఎక్కువ లాభం కొరకు అదే సంస్థకు చెందిన మరో సాధనంలో కాస్త నష్టం నమోదు చేసుకుంటారు. అప్పుడు కూడా ఇది Zero Sum Game అవ్వదు.

Stock Market

స్టాక్ మార్కెట్ లు ఎప్పుడు ఎలా ఎందుకు పతనమవుతాయి అన్నది బ్రహ్మరహస్యం కన్నా సూక్ష్మమైన రహస్యం లాంటిది. మహమహా మేధావులు తమ బుర్ర చించుకున్నా కూడా ఈ రహస్యాన్ని అర్థం చేసుకోలేకున్నారు. కొన్ని కారణాలు ఎంతో కష్టం మీద ఊహించాలి. నా ఊహలు ఇవి. (నేను స్టాక్ మార్కెట్ నిపుణున్ని కాదు కానీ స్టాక్ మార్కెట్ లలో కొన్ని తన్నులు తిన్న మదుపరిని.)

బటర్‌ఫ్లై ఎఫెక్ట్ గురించి వినే ఉంటారు. సుకుమార్ గారు “నాన్నకు ప్రేమతో” చిత్రంలో వివరించారు.

ప్రపంచంలో ఒక మూలన సీతాకోకచిలుక రెక్కలాడిస్తే, ఆ పిల్లగాలి ప్రపంచంలో మరో మూలకు వెళ్ళేసరికి తుఫానులా పరిణమిస్తుందంటారు. అలాంటిది కొరోనా వంటి తుఫానే ఒక మూల బయలుదేరితే మరి ప్రపంచం మొత్తం ప్రకంపనలు ఉంటాయి.

స్టాక్ మార్కెట్లకు ఈ సిద్ధాంతం భేషుగ్గా సరిపోతుంది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎన్నో దేశాల సమాగమం కాబట్టి.

కరోనా వల్ల దేశంలో ఆఫీసులకు, ఫాక్టరీలకు పోయే జనాభా తగ్గింది. దరిమిలా ఆ ఫాక్టరీల ఉత్పత్తులు తగ్గాయి. అలాంటి ఫాక్టరీలకు మూల పదార్థాలు (Raw Material) సప్లై చేసే కంపెనీలు గనక ఇండియాలో ఉంటే అవీ లాసు. దరిమిలా ఈ కంపెనీల షేర్లు లాస్.

ఈ రా మెటీరియల్ సప్లై చేసే కంపెనీ వేటి మీద ఆధారపడిందో ఆ కంపెనీలన్నీ లాస్.

దేశంలో కరోనా వల్ల నాన్ వెజ్ వాడకం తగ్గింది. దరిమిలా అనుబంధమైన అనేక సంస్థలు, వ్యాపారాలకు దెబ్బ. కోళ్ళ ఫారాలు, ఆ కోళ్ల ఫారాలలో ఉత్పత్తి అయ్యే కోడిగుడ్ల పైన ఆధారపడిన ఇతర వ్యాపారాలు, కోళ్ళ ఫారాలలో కోళ్ళకు సప్లై చేసే ఫుడ్, ఆ ఫుడ్ సప్లై చేసే సంస్థలు వగైరా వగైరా.

కరోనా వల్ల జనాలు ట్రావెల్ చెయ్యడం మానేశారు. దరిమిలా ట్రావెల్ మీద ఆధారపడిన ఐర్ లైన్ సంస్థలకు భారీ నష్టం. జనాలు ట్రావెల్ చెయ్యట్లేదు గనక. తద్వారా ఎయిర్ పోర్ట్ లకు నష్టం. ఎయిరోప్లేన్ లలో ఫుడ్ సప్లై చేసే సంస్థలకు నష్టం. ఎయిర్ ప్లేన్ ల ద్వారా బట్వాడా అయ్యే సరంజామా, కొరియర్ కంపెనీలు వీటికి నష్టం. కొరియర్ కంపెనీల మీద ప్రపంచం మొత్తం ఆధారపడింది కాబట్టి అంతలక్కా నష్టం.

అలాగే దేశంలో నెట్ వర్కింగ్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో నిపుణులు ఇంటికాడ పడుకుంటే నెట్ వర్కింగ్ లో వచ్చే రోజువారీ సమస్యలను ఫిక్స్ చెయ్యడం కష్టం అవుతుంది. ఆ సమస్యలు త్వరగా తెమలకపోతే వాటిపై ఆధారపడిన డిజిటల్ కంష్యూమర్ సంస్థలకు దెబ్బ.

ఉదాహరణ:

చైనాలో కార్ల భాగాలు తయారు చేసే కర్మాగారం కొరోనా వల్ల తాత్కాలికంగా మూతపడిందనుకోండి.

మన దేశంలో ఆ భాగాలతో కార్లు తయారు చేసే సంస్థలు ఇప్పుడేం చెయ్యాలి? అవీ మూతపడితే ఎంత నష్టం?

అక్కడ పని చేసే కూలీలకు ఏది దిక్కు? వారికి భృతి లేకుండా ఏం తింటారు? వారు సరుకులు కొనకపోతే కిరాణా కొట్లు ఏమైపోవాలి? కిరాణా కొట్లు కూడా సరుకులు కొనటం ఆపేస్తే అవి తయారు చేసే సంస్థలు ఉత్పత్తి ఆపేస్తాయి కదా? వీరు ముడిసరుకు కొనకపోతే రైతులకు ఏది దిక్కు?

వ్యాపారము, వర్తకము, వ్యవసాయము, ఇలా అన్నీ అంతస్సంబంధాలు కలిగి ఉంటాయి. కాస్త ఉల్లేఖించి చెప్పినా టూకీగా విషయం ఇదే.

వ్యాపారాలను దెబ్బతీసేది లేదా అటకాయించేది (తాత్కలికమే కావచ్చు) ఏదైనా సరే స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష బింబం స్టాక్ మార్కెట్లు.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే – స్టాక్ మార్కెట్లు విపరీత మూల్యాంకనం వద్దకు చేరిన ప్రతి సారీ దిద్దుబాటుకు గురౌతాయి. సరిగా ఆ సమయానికి దిద్దుబాటుకు ఏదో ఒక కారకం సిద్ధిస్తుంది. ఇలాంటప్పుడు పెట్టుబడికి వెనుకాడితే స్టాక్ మార్కెట్లలో ఉండటం లాభదాయకమే కాదు.

ఇట్లా ఎన్నో ఉన్నాయి. మనం చెయ్యగలిగిందల్లా, పతనం అవుతున్నాయని గ్రహించి తెలివిగా మసులుకోవటమే.

Stock Market

స్టాక్ మార్కెట్ లో investing మొదలు పెట్టాలంటే ముందుగా మీరు చేయవల్సిన పని సెబి దగ్గర రిజిస్టర్ అయిన ఏదైనా ఒక బ్రోకరేజి సంస్థలో ఒక డిమాట్ అకౌంట్ ను తెరువాలి.
ఉదాహరణకు దేశంలో అతిపెద్ద డిస్కౌంట్ బ్రోకరేజి సంస్థ జెరోధా లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇక్కడే ఈ లింక్ మీద క్లిక్ చేయండి
ఇండియాలో అతిపెద్ద డిస్కౌంట్ బ్రోకర్ అయిన జెరోదాలో 2021 నాటికి 25 లక్షల పైన ట్రేడింగ్ అకౌంట్స్ ఉన్నాయి.వాటిలో కనీసం 15 లక్షల ట్రేడింగ్ అకౌంట్లు ఆక్టీవ్ గా ట్రేడ్ అవుతుంటాయి.
దేశం మొత్తంలో అందరి బ్రోకర్స్ లో దాదాపు 17% మార్కెట్ వాటను ఒక్క జెరోదానే కలిగి ఉన్నది.
జెరోదాకు డిస్కౌంట్ బ్రోకర్ అని ఎందుకు పేరు అంటే ఇది ఐ.సి.ఐ.సి.ఐ సెక్యురిటీస్ లిమిటెడ్, హెచ్.డి.ఎఫ్.సి. సెక్యురిటీస్ లిమిటెడ్, ఎస్.ఎం.సి గ్లోబల్ సెక్యురిటీస్ మాదరిగా ఫుల్ సర్వీస్ బ్రోకర్ కాదు.ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ లలో ఫిజికల్ ఆఫీసులతో పాటు మరికొన్ని ఇతర సర్వీసులు కూడా కలిసి ఉంటాయి.ఇవన్ని మేయింటేన్ చేయాలంటే కస్టమర్నుండి బ్రోకర్ ఎక్కువమొత్తంలో కమీషన్ చార్జిచేయాలి.అవేమి లేకుండా తక్కువ ఖర్చుతో మినిమం మేయింటేన్స్ లతో జెరోదా నడుస్తుంది.అందుకే వారికి ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది.స్టాక్స్ లో డెలివరి పొజిషన్ తీసుకుంటే మీకు జెరోదాలో 0% బ్రోకరేజి ఉంటుంది.ఇతర సర్వీస్ టాక్స్, జి.ఎస్.టి.సెబి టర్నోవర్ చార్జీలు మాత్రం స్వల్పంగా ఉంటాయి. కాబట్టి జెరోదాలో స్టాక్స్ డెలివరి బయ్ సెల్ చేసేవారికి బ్రోకరేజి చార్జీలు ఉండవు కాబట్టే ఇలాంటి బ్రోకరేజి సంస్థలను డిస్కౌంట్ బ్రోకర్స్ అంటారు.

జెరోధాలో లేదా ఇతర ఏ బ్రోకరేజి సంస్థలోనైనా ముందుగా డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాడానికి మీరు ఆన్ లైన్ లో కంప్యూటర్ మీద కాని మోబైల్ మీద కాని అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.అకౌంట్ ఓపెన్ చేయడానికి ముందే మీరు కొన్ని డాక్యుమెంట్స్ రెడిగా స్కాన్ చేసి కాని ఫోటో తీసికాని రెడిగా పెట్టుకోండి.అవి.

మీ ఆధార్ కార్డ్.
మీ పాన్ కార్డు
మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు (బ్యాంకులో మీ పేరు,మీ అకౌంట్ నెంబర్ , మీ బ్యాంక్ పూర్తి పేరు, బ్యాంక్ ఐ.ఎఫ్.ఎస్.సి. కోడ్ + ఎమ్.ఐ..సి.ఆర్ కోడ్(IFSC+MICR CODE)
మీకు ఏ బ్యాంకు లో ఖాతా ఉన్నదో ఆ బ్యాంక్ కేన్సిల్డ్ చెక్ .
గత 6నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్ మెంట్ లేదా గత ఏడాడి ఐ.టి. రిటర్న్.
మీ మోబైల్ నెంబర్
మీ ఈమేయిల్ ఐ.డి.
మీ పాస్ పోర్ట్ సైటు ఫోటో.

పై 8 మీ దగ్గర రెడిగా ఉన్న తరువాత జెరోధాలో కాని మరెక్కడైనా బ్రోకర్ దగ్గర ప్రొసీడ్ కండి. ఆన్ లైన్ లో ప్రొసీడ్ అయినప్పుడు ఫోటో అవసరం ఉండదు, ఆన్ లైన్ లోనే మీరు ఫోటో దిగే స్టెప్ వస్తుంది.
పై డాక్యుమెంట్స్ అన్ని అప్ లోడ్ చేసాకా లేదా ఆధార్ అథ్నికేషన్ పూర్తి అయ్యాకా డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ కు ఫీజు కట్టాలి.
ఒక్కో బ్రోకర్ దగ్గర ఒక్కో రకమైన ఫీజు ఉంటుంది. జెరోధాలో రూ.200 తో డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చును. కొన్ని బ్రోకర్స్ లలో ముందు ఫ్రీ అని ఉంటుంది.తరువాత ఆన్యువల్ మేయింటేన్స్ ఫీజులు హైగా ఉంటాయి.
జెరాధాలో ఈ ఫీజు ఏటా రూ.300 మాత్రమే. బ్రోకర్ ను బట్టి 1 లేదా 2,3 రోజుల్లో మీ డాక్యుమెంట్స్ వెరిఫై అయిన తరువాత మీకు డిమ్యాట్ అకౌంట్ + దాంతో పాటే ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.మీకు అకౌంట్ ఓపెన్ అయిన తరువాత మీ ట్రేడింగ్ అకౌంట్ లోకి మీ బ్యాంక్ నుండి ముందుగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి.మీకు డిమ్యాట్ అకౌంట్ దాంతో పాటే ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.మీ డిమ్యాట్ అకౌంట్ నెంబర్ మీ ఫ్రోఫైల్ లో కనపడుతుంటుంది.
మీ బ్యాంక్ అకౌంట్ నుండి ట్రేడింగ్ అకౌంట్ లోకి డబ్బులు ట్రాన్స ఫర్ చేయడం ఎలాగో తెలుసుకోవాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి.
ఒక్కసారి మీ ట్రేడింగ్ అకౌంట్ లోకి మీరు డబ్బులు ట్రాన్సఫర్ చేసుకున్న తరువాత ఇక మీరు స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టవచ్చును.

ముందుగా మీరు ఏయే స్టాక్స్ లో పెట్టుబడి పెట్టదలుచున్నారో అయా స్టాక్స్ అన్ని అక్కడ ముందుగా ఆడ్ చేసుకోండి.అయా స్టాక్ ల ప్రైస్ ఎంత ఉందో నోట్ చేసుకోండి.ఇక ఒక్కో స్టాక్ సెలక్ట్ చేసి మీరు ఆయా స్టాక్స్ లో ఎన్ని షేర్లు కొనదలచుకున్నారు నిర్ణయించుకోండి.

మీరు ఇంట్రాడే ట్రేడింగ్ అంటే అదే రోజు షేర్లు కొని అమ్మితే అవి మీ డిమ్యాట్ ఖాతాలోకి వెళ్ళవు.మీరు అక్కడ ఆర్డర్ క్లిక్ చేసేప్పుడే ఇంట్రాడేనా(INTRADAY) లేదా డెలివరి నా ( క్యాష్ అండ్ క్యారి CNC)అనే అప్షన్ కనపడుతుంది. ముందుగా మీరు మీకు నచ్చిన షేరు సెలక్టు చేసుకోవాలి. ఉదా .ఎస్.బి.ఐ. బ్యాంక్ షేరును డెలివరి తీసుకుంటే ఆ షేరకు ఇప్పుడున్న రేటు ప్రకారం రూ.200 మీ అకౌంట్ లో ఉంటే సరిపోతుంది.అలాగే 100 ఎస్.బి.ఐ. షేర్లు కొనాలంటే రూ.2000 ఉంటే సరిపోతుంది. అదే రిలయన్స్ షేరు కొనదలుచుకుంటే ఇప్పుడున్న రేట్లో రూ.2100 ఉంటే ఒక్క రిలయన్స్ షేరును కొనవచ్చును.అంటే రిలయన్స్ 10 షేర్లు కొనాలంటే రూ.20వేలు, రిలయన్స్ 100 షేర్లు కొనాలంటే రూ.2లక్షలు, అదె డా.రెడ్డి లాబ్స్ షేరు ను కొనాలాంటే ఇప్పడున్న రేట్లో 1 షేరుకు రూ.5000 ఉండాలి. అదే 10 షేర్లకు రూ.50వేలు, 100 షేర్లకు 5లక్షలు ఉండాలి.
మీ అకౌంట్ లో ఉన్న డబ్బుల మేరకే అదే విలువ కల షేర్లు మీరు కొనగలరని దీంతో సులభంగా అర్థం చేసుకోవచ్చు. అదే ఇంట్రా డే ట్రేడింగ్ లో బ్రోకర్ మార్జిన్ మని ఇస్తాడు .దాంతో 10,20 రెట్ల లెవల్లో కూడా మీరు షేర్లు కొనవచ్చును.ఉదా. ఇంట్రాడే లో డా.రెడ్డిస్ లాబ్స్ షేరు కొనాలంటే మీ దగ్గర రూ.5000 ఉండాల్సిన పనిలేదు.అంతకు 10 లేదా 20 రెట్ల తక్కువగా (ఇది షేరును బట్టి మారుతుంటుంది) అంటే రూ.500తో కూడా డా.రెడ్డిస్ లాబ్స్ 10షేరు కొనవచ్చును. కాని సాయంత్రం 3.10 కల్లా ఖచ్చితంగా తిరిగి లాభానికో లేదా నష్టానికో అమ్మాల్సిందే. అది ఒక వేళ 3.10 సమయానికి నష్టంతో నడుస్తుంటే దాన్ని డెలివరి పోజిషన్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. కాని మీ అకౌంట్ లో దాని 1 షేరు పూర్తి విలువ ఐన రూ.5000 ఉండాల్సిందే.

స్టాక్ మార్కెట్లో షేర్లలో నష్టపోయిన 90శాతం మంది డే ట్రేడర్స్ నే ఉంటారు. ఎక్కు వ లాభాలు వస్తాయని ఎక్కువ మొత్తం మార్జిన్ మని తో లేని డబ్బుతో ట్రేడింగ్ చేస్తే లాభం ఎంత ఎక్కువగా వస్తుందో నష్టం కూడా అంతే ఎక్కువగా వస్తుంది. కొత్తగా ఇన్వెస్ట్ మెంట్ మొదలుపెట్టిన ఎవరు కూడా కనీసం 1 ఏడాది పాటు డే ట్రేడింగ్ చేయకపోవడమే మంచిది. ఏడాది వరకు కేవలం డెలివరి పోజిషన్స్ మాత్రమే తీసుకోండి.

మీరు ఇంట్రా డే ట్రేడింగ్ కాకుండా డెలివరి పోజిషన్ ( క్యాష్ అండ్ క్యారి CNC)తీసుకుని బయ్ చేసిన షేర్లు 3వర్కిండ్ డేస్ లో మీ డిమాట్ అకౌంట్ లో కనపడుతాయి. దీన్నే T+2 Days వర్కింగ్ డేస్ లో మీ డిమాట్ అకౌంట్ అకౌంట్ లోకి షేర్లు జమ అవుతాయి అని చెపుతుంటారు. T+2 Days అంటే మరేం లేదు. ఈరోజు బయ్ చేసారంటే మధ్యలో వచ్చే సెలువులు కాకుండా మరో 2 రోజుల్లో మీ డిమాట్ అకౌంట్ లోకి షేర్లు వెళ్ళుతాయి.వాటిని ఇక మీరు ఎప్పుడైనా తిరిగి అమ్ముకోవచ్చు.మీ డిమ్యాట్ అకౌంట్ లోకి వెళ్ళడానికంటే ముందే అంటే మర్నాడు కూడా అమ్మవచ్చును.2 రోజులు ఆగి అమ్మవచ్చును. ఏడాది తరువాత అమ్మవచ్చు లేదా 10 ఏండ్లకో 30ఏండ్ల తరువాతో కూడా అమ్మవచ్చును.
మీరుషేర్లు కొన్న తరువాత ఈలోపు వాటివిలువ డౌన్ అయితే మీ అకౌంట్ లో మీపెట్టుబడుల విలువ లాస్ లో చూపిస్తుంటుంది. అదే లాభాల్లో ఉంటే ఫ్రాఫిట్ లో చూపిస్తుంటుంది.

Stock Market

భయపడకపోవటం, అతిగా ఆశ పడకపోవటం.

ఏ స్టాక్ మార్కెట్ క్రాష్ నుండి అయినా లాభం పొందడానికి ఉత్తమ మార్గాలు ఇవే.

భయపడకపోవటం

ఇదే క్రాష్ అని ఖచ్చితంగా ఎప్పుడూ ఎవరూ చెప్పలేరు. ఒకవేళ మీ విశ్లేషణలో అలా అనిపిస్తే పడ్డాక ఇంకా పడుతుందేమో అన్న భయంతో పెట్టుబడికి జంకకూడదు.

సాధారణంగా మార్కెట్ 10%, అంతకన్నా ఎక్కువ పడితే నెలసరి మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడి మొత్తానికంటే కాస్త ఎక్కువే మదుపు చెయ్యవచ్చు, వెనుకాడకూడదు. దీర్ఘకాల మదుపుకు ఇది ఎంతో మేలు చేస్తుంది. లేదు, ఇంకా పడుతుందని ఎవరో చెప్పినందున ఎదురు చూస్తూ ఉంటే ఆ ఎదురు చూపు ఎప్పటికీ ఫలించకపోవచ్చు. ఏకమొత్తం పెట్టుబడికి సైతం ఈ సూత్రం వర్తిస్తుంది.

సోముకు ఆఫీసులో బోనస్ లక్ష ఇచ్చారు. సహోద్యోగులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మంచిదన్నారు. మొన్న మార్చిలో నిఫ్టీ 12300 నుండి 11000కు పడింది, వెంటనే లక్ష పెట్టేశాడు. 10000కు పడింది, భయం మొదలైంది. 8000కు పడింది, భయం ఎక్కువై నష్టానికి మొత్తం అమ్మేసి, ఇంకా క్రాష్ అయినప్పుడు తిరిగి మదుపు చేద్దామనుకున్నాడు. ఇంకా వేచి చూస్తూనే ఉన్నాడు.

రాజుకు వసూలు కావనుకున్న లక్ష రుపాయలు అనుకోకుండా వచ్చాయి. తాను పత్రికల్లో చదివింది, తెలుసుకున్నదాని దృష్ట్యా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మంచిదనుకున్నాడు. నిఫ్టీ 12,300 నుంచి 10,000కు వచ్చినప్పుడు భయపడక 50 వేలు మదుపు చేశాడు. 8,000 వద్ద మిగతా 50 వేలు మదుపు చేశాడు. నిఫ్టీ 7,500కు పడినా బెదరక పెట్టుబడి అలాగే ఉంచాడు. నేడు నిఫ్టీ 13,400. మొదటి పెట్టుబడిపై 34%, రెండవ పెట్టుబడిపై 67%, సగటు 50% లాభం తొమ్మిది నెలల్లో.

సరే మరీ అంత క్రియాశీల మదుపరి కాకపోయినా, మార్కెట్ 12300 నుంచి 7500కు పడినప్పుడు భయపడక నెలసరి పెట్టుబడులను అలాగే కొనసాగించి ఉంటే నేటికి 2020కి గాను లాభం అధమపక్షం 11%. భయపడకపోవటం వల్ల (అందునా పెట్టుబడులు ఉపసంహరించుకోకపోవటం వల్ల) సాలీనా లాభం 11%.

అతిగా ఆశ పడకపోవటం

రాజు పెట్టుబడికి 50% లాభం వచ్చింది. ఇంతకు మించి 9 నెలల్లో మంచి రాబడి అత్యాశ అనుకుని మొత్తం అమ్మివేసి వేరు మదుపు సాధనాల్లో (బంగారం, ప్రభుత్వ బాండ్లు, ఇత్యాది) పెట్టాడు. ఇప్పుడు మార్కెట్ పడినా, మరింత పెరిగినా నిబ్బరంగా ఉండగలడు, ఎందుకంటే తన మూలధనాన్ని గౌరవించి తనకు చాలిన లాభాన్ని స్వీకరించాడు.

9 నెలల్లో 50% రాబడి వచ్చింది, మళ్ళీ వస్తుందని, ఇప్పుడు మార్కెట్ పెరుగుతూనే ఉందని, సోము మొండి ధైర్యంతో మళ్ళీ పెట్టుబడి పెట్టేశాడు. ఇప్పుడు అతని ఆశ తీరాలంటే నిఫ్టీ తొమ్మిది నెలల్లో 20,000కు చేరాలి. ఏదోక మహాద్భుతం జరిగితే తప్ప ఇది అసాధ్యమని వివేకంతో ఆలోచించే ప్రతి వ్యక్తికి అర్థమయ్యే విషయం.

అతిగా ఆశపడటం మంచిది కాదని సూపర్‌స్టార్ రజినీ అంత స్టైలిష్‌గా చెప్పనే చెప్పారు కదా!

ఇటువంటి మరిన్ని విషయాల కొరకు సృష్టించిన వేదిక పెట్టుబడుల బడి. ఆసక్తి ఉన్నవారు అటో చూపు విసరండి.