Uncategorized

నిజానికి స్టాక్ మార్కెట్ లో డబ్బు సంపాదించడం చాలా పెద్ద కళ అని చెప్పుకోవాలి. ఇది ఒక పెద్ద మైండ్ గేమ్ లాంటిది. చాలా రీసెర్చ్ చేసిన తరువాత కానీ స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ గా డబ్బులు పెట్టకూడదు.

రహస్యాలు కాదు కానీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ కి ఒక ప్రాసెస్/ పద్దతి ఉంటుంది. అది కొన్నిసార్లు ఎవరికి వారు అనుభవం ద్వారా తెలుసుకోవలసి ఉంటుంది. నాకు తెలిసిన కొన్ని విషయాలు.

  • తక్కువ పెట్టుబడి తో, తక్కువ కాలం లో ఎక్కువ సంపాదిద్దామని అనుకోకండి. అలా అనుకుంటే అదే ఫెయిల్యూర్ కి మొదటి మెట్టు. స్టాక్ మార్కెట్ లో లాభాలు దీర్ఘకాలంలో (లాంగ్ టర్మ్ లో) సగటున 15–20% రావచ్చు.
  • స్టాక్ మార్కెట్ లో రిటర్న్స్ ఏవీ గ్యారంటీ కాదు. ఒక సంవత్సరం 40% లాభం రావచ్చు, ఒకసారి 20% లాభమే రావచ్చు ఒక్కోసారి 20% నష్టం రావచ్చు. అన్నింటికి సిధ్ధపడి 6–8 సంవత్సరాలు పెట్టుబడి పెట్టేటట్టయితేనే స్టాక్ మార్కెట్ లో అడుగుపెట్టాలి.
  • ఆ పెట్టుబడి పెట్టే డబ్బు సగానికి నష్టం వచ్చినా (అంటే లక్ష పెడితే 50 వేలు పోయినా) మీరు నిశ్చింతగా ఉండగలరనుకునేంత డబ్బు మాత్రమే పెట్టండి. అంత నష్టం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తరువాత పాయింట్స్ లో చెబుతాను.
  • ఎక్కువ రిటర్న్స్ వచ్చే సలహాలు/ టిప్స్ ఇస్తామనే వారి మాటలు నమ్మకండి. మీరు వారికి కట్టే ఫీజు కంటే కనీసం 10 రెట్లు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ లో మీకు మంచి లాభం, లేదా ఖరీదైన అనుభవం వస్తుంది.
  • సెబీ ద్వారా సర్టిఫై అయిన మంచి స్టాక్ అడ్వైసర్ ద్వారానే ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ చిక్కు ఏంటంటే అందరు అడ్వైసర్లూ సెబీ రిజిస్టర్డ్ అయినవాళ్లే. కానీ అందులో ఎవరు మంచి స్కిల్ ఉన్న అడ్వైసర్ అనేది తెలియడం కష్టం.
  • మీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ క్వాలిటీ ఉన్న కంపెనీలలో మాత్రమే చేయాలి. ఈ క్వాలిటీ నిరూపించడం,కనిపెట్టడం అనేది చాలా కష్టమైన విషయం. దీని గురించి మళ్ళీ ఇంకెప్పుడైనా పెద్ద ఆన్సర్/ వ్యాసం రాసుకోవచ్చు.
  • ప్రారంభం లో పెద్ద కంపెనీలలో పెట్టుబడి పెట్టడం మంచిది. ఉదా: ఆసియన్ పెయింట్స్, HDFC బ్యాంక్, హిందూస్తాన్ యూనీలీవర్ లాంటివి. వీటిలో రిస్క్ తక్కువ. సాధారణంగా మీరు ఎంత చిన్న కంపెనీలో పెడితే అంత ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలాగని కంపెనీ పెద్దగా ఉంటే పెట్టుబడి/మీ డబ్బు సేఫ్ అని కాదు. ఉదా: కింగ్ ఫిషర్, జెట్ ఎయిర్వేస్ కంపెనీలు ఇన్వెస్టర్లని ఆకాశపుటంచులకి తీసుకెళ్లి వదిలేశాయి. చూశారా ఎంత కష్టంగా ఉందో. అందుకే లోతు తెలియకుండా, రీసెర్చ్ లేకుండా ఇన్వెస్ట్ చేయవద్దు.
  • మీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ని మంచి క్వాలిటీ ఉన్న వివిధ పెద్ద, చిన్న కంపెనీల్లో మరియు వివిధ రంగాల్లో (బ్యాంకులు, ఆయిల్ కంపెనీలు, ఆటోమొబైల్, సాఫ్ట్వేర్, సిమెంట్, కన్స్ట్రక్షన్, టెక్నాలజీ …..) పెట్టుబడి పెట్టడం మంచిది. దీనివల్ల రిస్క్ తగ్గుతుంది. దీనినే డైవర్సిఫికేషన్ అంటారు.
  • అలాగని మీ ఇన్వెస్ట్మెంట్ ని ఓ 108 కంపెనీల్లో పెట్టద్దు. మీకు మార్కెట్ ని దాటి రిటర్న్స్ రావు. ఇవ్వన్నీ రూల్స్ పాటిస్తూ స్టాక్ మార్కెట్ పండితులు 12- 15 కంపెనీల్లో పెట్టుబడి పెట్టమంటారు. అప్పుడు మీ రీసెర్చ్, ఎంట్రీ, ఎగ్జిట్ కరెక్ట్ గా ఉండి ,మీరు ఎక్కువకాలం మార్కెట్ లో ఉంటే మాంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువ. స్టాక్ మార్కెట్లో దాదాపు 6000కి పైగా కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. అందులో మీరు 12–15 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
  • మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీలకు సంబంధించిన వార్తలు, కంపెనీ స్టేట్మెంట్స్, లాభనష్టాలు అన్నీ ఫాలో అవుతూ ఉండాలి. 100 కంపెనీల్లో పెడితే అన్నింటినీ చదవలేం కదా. తప్పు చేసే అవకాశం ఉంది, అందుకే పైన పాయింట్ వచ్చింది.
  • మీరు పెట్టుబడి పెట్టిన స్టాక్స్ తో ఎప్పుడూ ప్రేమ పెంచుకోకూడదనేది స్టాక్ మార్కెట్ లో నానుడి. ఒకవేళ అనుకోకుండా కొంత నష్టం వచ్చి మీ రీసెర్చ్ సరి అయినది కాకపోతే వెంటనే ఆ స్టాక్ ని అమ్మి బయటకు వచ్చేయాలని సూచిస్తారు. ఈ విషయంపై బిహేవియరల్ ఫైనాన్స్ అని ఒక పెద్ద సబ్జెక్టు ఉంది.
  • మీరు కనుక స్టాక్ మార్కెట్ కి కొత్త అయితే ముందుగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టండి.

ఇన్ని విషయాలు నెగటివ్ గా చెప్పానా. నాకు స్టాక్ మార్కెట్ అంటే చాలా ఇష్టం. నేను చాలా నష్టపోయా కానీ నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకుంటున్నా. 5 ఏళ్ల రోలర్ కోస్టర్ రైడ్ మరి.

Stock Market

భయపడకపోవటం, అతిగా ఆశ పడకపోవటం.

ఏ స్టాక్ మార్కెట్ క్రాష్ నుండి అయినా లాభం పొందడానికి ఉత్తమ మార్గాలు ఇవే.

భయపడకపోవటం

ఇదే క్రాష్ అని ఖచ్చితంగా ఎప్పుడూ ఎవరూ చెప్పలేరు. ఒకవేళ మీ విశ్లేషణలో అలా అనిపిస్తే పడ్డాక ఇంకా పడుతుందేమో అన్న భయంతో పెట్టుబడికి జంకకూడదు.

సాధారణంగా మార్కెట్ 10%, అంతకన్నా ఎక్కువ పడితే నెలసరి మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడి మొత్తానికంటే కాస్త ఎక్కువే మదుపు చెయ్యవచ్చు, వెనుకాడకూడదు. దీర్ఘకాల మదుపుకు ఇది ఎంతో మేలు చేస్తుంది. లేదు, ఇంకా పడుతుందని ఎవరో చెప్పినందున ఎదురు చూస్తూ ఉంటే ఆ ఎదురు చూపు ఎప్పటికీ ఫలించకపోవచ్చు. ఏకమొత్తం పెట్టుబడికి సైతం ఈ సూత్రం వర్తిస్తుంది.

సోముకు ఆఫీసులో బోనస్ లక్ష ఇచ్చారు. సహోద్యోగులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మంచిదన్నారు. మొన్న మార్చిలో నిఫ్టీ 12300 నుండి 11000కు పడింది, వెంటనే లక్ష పెట్టేశాడు. 10000కు పడింది, భయం మొదలైంది. 8000కు పడింది, భయం ఎక్కువై నష్టానికి మొత్తం అమ్మేసి, ఇంకా క్రాష్ అయినప్పుడు తిరిగి మదుపు చేద్దామనుకున్నాడు. ఇంకా వేచి చూస్తూనే ఉన్నాడు.

రాజుకు వసూలు కావనుకున్న లక్ష రుపాయలు అనుకోకుండా వచ్చాయి. తాను పత్రికల్లో చదివింది, తెలుసుకున్నదాని దృష్ట్యా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మంచిదనుకున్నాడు. నిఫ్టీ 12,300 నుంచి 10,000కు వచ్చినప్పుడు భయపడక 50 వేలు మదుపు చేశాడు. 8,000 వద్ద మిగతా 50 వేలు మదుపు చేశాడు. నిఫ్టీ 7,500కు పడినా బెదరక పెట్టుబడి అలాగే ఉంచాడు. నేడు నిఫ్టీ 13,400. మొదటి పెట్టుబడిపై 34%, రెండవ పెట్టుబడిపై 67%, సగటు 50% లాభం తొమ్మిది నెలల్లో.

సరే మరీ అంత క్రియాశీల మదుపరి కాకపోయినా, మార్కెట్ 12300 నుంచి 7500కు పడినప్పుడు భయపడక నెలసరి పెట్టుబడులను అలాగే కొనసాగించి ఉంటే నేటికి 2020కి గాను లాభం అధమపక్షం 11%. భయపడకపోవటం వల్ల (అందునా పెట్టుబడులు ఉపసంహరించుకోకపోవటం వల్ల) సాలీనా లాభం 11%.

అతిగా ఆశ పడకపోవటం

రాజు పెట్టుబడికి 50% లాభం వచ్చింది. ఇంతకు మించి 9 నెలల్లో మంచి రాబడి అత్యాశ అనుకుని మొత్తం అమ్మివేసి వేరు మదుపు సాధనాల్లో (బంగారం, ప్రభుత్వ బాండ్లు, ఇత్యాది) పెట్టాడు. ఇప్పుడు మార్కెట్ పడినా, మరింత పెరిగినా నిబ్బరంగా ఉండగలడు, ఎందుకంటే తన మూలధనాన్ని గౌరవించి తనకు చాలిన లాభాన్ని స్వీకరించాడు.

9 నెలల్లో 50% రాబడి వచ్చింది, మళ్ళీ వస్తుందని, ఇప్పుడు మార్కెట్ పెరుగుతూనే ఉందని, సోము మొండి ధైర్యంతో మళ్ళీ పెట్టుబడి పెట్టేశాడు. ఇప్పుడు అతని ఆశ తీరాలంటే నిఫ్టీ తొమ్మిది నెలల్లో 20,000కు చేరాలి. ఏదోక మహాద్భుతం జరిగితే తప్ప ఇది అసాధ్యమని వివేకంతో ఆలోచించే ప్రతి వ్యక్తికి అర్థమయ్యే విషయం.

అతిగా ఆశపడటం మంచిది కాదని సూపర్‌స్టార్ రజినీ అంత స్టైలిష్‌గా చెప్పనే చెప్పారు కదా!

ఇటువంటి మరిన్ని విషయాల కొరకు సృష్టించిన వేదిక పెట్టుబడుల బడి. ఆసక్తి ఉన్నవారు అటో చూపు విసరండి.