Investment

ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా తెలుసుకోవలసిన ఆర్థిక సూత్రాలు ఏమిటి?

నేను ఆర్థికాంశాలు నేర్చుకోవటం మొదలు పెట్టిన రోజుల్లో వ్యక్తిగత ఆర్థికంలో ఒక సూత్రం బాగా బుర్రకెక్కింది. అదే 50-30-20 సూత్రం:

జీతంలో: 50% – ఖర్చులు, 30% – మదుపు, 20% – పొదుపు

అవగాహన, అనుభవం పెరిగాక ఇది ఉపయుక్తం కాదని తెలిసింది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులకు జీతంలో సారూప్యత ఉండవచ్చేమో కానీ జీవితంలో ఉండదు. పైగా లోకం పోకడలో మార్పు మునుపటి కంటే ఎంతో వేగవంతం అయింది. మన తాతల కాలం పద్ధతులు ప్రాణాళికలేమిటి, మన తల్లిదండ్రులు ఎదురీదిన పరిస్థితులు కూడా నేడు అన్యమే. అందుకే వారి ఆర్థిక అనుభవాల నుండి విన్నవి, నేర్చుకున్నవి నేడు ఉపయోగ పడకపోగా సంపద సృష్టికి అవరోధాలవ్వచ్చు.

మరీ సుత్తి కొట్టకుండా విషయం ఏమిటంటే ఇదివరకు జీతగాళ్ళకు ముఖ్య లక్ష్యం రిటైర్మెంట్ కొరకు దీర్ఘకాల సంపద వృద్ధి, ఆ ప్రయాణంలో పెళ్ళి, ఇల్లు, కారు వంటి కొన్ని ఖర్చులు. అందుకు కింది సూత్రాలు పాటిస్తే సరిపోయేది (కొందరికి నేటికీ సరిపోతుంది):

  1. జీతంలో 40% పెట్టుబడులు, ఆరోగ్య, జీవిత బీమా.
  2. మిగిలిన జీతంలో 10% మరో బ్యాంకు ఖాతాకు బదిలీ చేసి అత్యవసరమయితే తప్ప ఆ ఖాతాను కదిలించకూడదు.
  3. ఆపై మిగిలిన జీతంలో 30% మించకుండా పిల్లల స్కూల్ ఫీజులు, కిరాణా, వగైరా ఖర్చులకు.
  4. మిగతా 20% ఇల్లు, బైకు/కారు కిస్తులకు.

అయితే నేడు ఉపేక్షించకూడని మరొక అంశం ప్రత్యామ్నాయ ఆదాయం. అందుకు జీతంలో కొంత భాగం కొత్త నైపుణ్యం నేర్చుకోటానికి వాడినా తప్పు లేదు, తప్పదు. ఓ రంగంలోని నిపుణుల్లో అత్యుత్తమ 1%లో ఉంటే తప్ప ఏ ఉద్యోగమైనా కోతకు అతీతం కాదు.

లోకంలో చాంచల్యం ఎక్కువయింది. నేడు భద్రం అనిపించే ఉద్యోగం/రంగం ఏడాదిలో ప్రాచీనం, నిరుపయోగకరం అయిపోవచ్చు. అందుకే ఒక్క ఆదాయంపై ఆధారపడుతూ భవిష్యత్ ప్రణాళిక రచించుకోవటం వృధా ప్రయాస.

కొసమెరుపు: నెలవారీ బడ్జెట్ ఖర్చులకు అనుగుణంగా కాక, పెట్టుబడులకు అనుగుణంగా వేసుకోవాలి.

మన ఉద్యోగం శాశ్వతం కాదు, మనకొచ్చిన దానికంటే తక్కువలో ఉండాలి. కార్, ఇల్లు అప్పు లేకుండా కొనటం మంచిది. రెండవ ఆదయ వనరు చూసుకోవాలి, రేపు మనకి ఉద్యోగం లేకపోతె ఎలా అని అలోచించి మన ఏరియా లో linkedin లేదా స్వంత వెబ్సైటు పెట్టుకొని సెలవు రోజుల్లో డబ్బులు వచ్చే మార్గం చూసుకోవాలి.

ఒక ఉద్యోగికి ఉన్న ముఖ్యమైన వనరు స్థిరంగా వచ్చే ఆదాయం. కాబట్టి కుదిరేది స్థిరంగా పెట్టుబడి పెట్టడం. చిన్న సుత్రమైనా దీర్ఘ కాలంలో ఎంతో డబ్బు కూడబెట్టడానికి నాంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *