Investment

నేను ఆర్థికాంశాలు నేర్చుకోవటం మొదలు పెట్టిన రోజుల్లో వ్యక్తిగత ఆర్థికంలో ఒక సూత్రం బాగా బుర్రకెక్కింది. అదే 50-30-20 సూత్రం:

జీతంలో: 50% – ఖర్చులు, 30% – మదుపు, 20% – పొదుపు

అవగాహన, అనుభవం పెరిగాక ఇది ఉపయుక్తం కాదని తెలిసింది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులకు జీతంలో సారూప్యత ఉండవచ్చేమో కానీ జీవితంలో ఉండదు. పైగా లోకం పోకడలో మార్పు మునుపటి కంటే ఎంతో వేగవంతం అయింది. మన తాతల కాలం పద్ధతులు ప్రాణాళికలేమిటి, మన తల్లిదండ్రులు ఎదురీదిన పరిస్థితులు కూడా నేడు అన్యమే. అందుకే వారి ఆర్థిక అనుభవాల నుండి విన్నవి, నేర్చుకున్నవి నేడు ఉపయోగ పడకపోగా సంపద సృష్టికి అవరోధాలవ్వచ్చు.

మరీ సుత్తి కొట్టకుండా విషయం ఏమిటంటే ఇదివరకు జీతగాళ్ళకు ముఖ్య లక్ష్యం రిటైర్మెంట్ కొరకు దీర్ఘకాల సంపద వృద్ధి, ఆ ప్రయాణంలో పెళ్ళి, ఇల్లు, కారు వంటి కొన్ని ఖర్చులు. అందుకు కింది సూత్రాలు పాటిస్తే సరిపోయేది (కొందరికి నేటికీ సరిపోతుంది):

  1. జీతంలో 40% పెట్టుబడులు, ఆరోగ్య, జీవిత బీమా.
  2. మిగిలిన జీతంలో 10% మరో బ్యాంకు ఖాతాకు బదిలీ చేసి అత్యవసరమయితే తప్ప ఆ ఖాతాను కదిలించకూడదు.
  3. ఆపై మిగిలిన జీతంలో 30% మించకుండా పిల్లల స్కూల్ ఫీజులు, కిరాణా, వగైరా ఖర్చులకు.
  4. మిగతా 20% ఇల్లు, బైకు/కారు కిస్తులకు.

అయితే నేడు ఉపేక్షించకూడని మరొక అంశం ప్రత్యామ్నాయ ఆదాయం. అందుకు జీతంలో కొంత భాగం కొత్త నైపుణ్యం నేర్చుకోటానికి వాడినా తప్పు లేదు, తప్పదు. ఓ రంగంలోని నిపుణుల్లో అత్యుత్తమ 1%లో ఉంటే తప్ప ఏ ఉద్యోగమైనా కోతకు అతీతం కాదు.

లోకంలో చాంచల్యం ఎక్కువయింది. నేడు భద్రం అనిపించే ఉద్యోగం/రంగం ఏడాదిలో ప్రాచీనం, నిరుపయోగకరం అయిపోవచ్చు. అందుకే ఒక్క ఆదాయంపై ఆధారపడుతూ భవిష్యత్ ప్రణాళిక రచించుకోవటం వృధా ప్రయాస.

కొసమెరుపు: నెలవారీ బడ్జెట్ ఖర్చులకు అనుగుణంగా కాక, పెట్టుబడులకు అనుగుణంగా వేసుకోవాలి.

మన ఉద్యోగం శాశ్వతం కాదు, మనకొచ్చిన దానికంటే తక్కువలో ఉండాలి. కార్, ఇల్లు అప్పు లేకుండా కొనటం మంచిది. రెండవ ఆదయ వనరు చూసుకోవాలి, రేపు మనకి ఉద్యోగం లేకపోతె ఎలా అని అలోచించి మన ఏరియా లో linkedin లేదా స్వంత వెబ్సైటు పెట్టుకొని సెలవు రోజుల్లో డబ్బులు వచ్చే మార్గం చూసుకోవాలి.

ఒక ఉద్యోగికి ఉన్న ముఖ్యమైన వనరు స్థిరంగా వచ్చే ఆదాయం. కాబట్టి కుదిరేది స్థిరంగా పెట్టుబడి పెట్టడం. చిన్న సుత్రమైనా దీర్ఘ కాలంలో ఎంతో డబ్బు కూడబెట్టడానికి నాంది.

Uncategorized

రాము, రాజు కలిసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుంటారు. అందులో పదేళ్ళ అనుభవంతో సాలీనా 20–24% లాభాలు సంపాదిస్తున్నారు. ఆ విషయం తెలిసిన స్నేహితులు, బంధువులు తమ తరఫున పెట్టుబడి పెట్టమని వీరికి డబ్బిచ్చారు.

ఎక్కువ మూలధనం రావటంతో పెట్టుబడి ప్రణాళికను మరింత పటిష్టంగా తయారు చేసుకునే పనిలో పడ్డారు రాము, రాజు. ఒక హెడ్జ్ ఫండ్ మొదలుపెట్టారు.

రానున్న మూడేళ్ళలో ఇనుము, సిమెంట్, నిర్మాణ రంగాలలో నాణ్యమైన షేర్లు రాణించవచ్చని వారి విశ్లేషణలో తెలిసింది. అలా Tata Steel, JSW Steel, Ultratech Cement, Ramco Cement, L&T, Dilip Buildcon, KNR Constructions షేర్లు పెద్ద మొత్తంలో కొన్నారు. ఇంతవరకూ హెడ్జ్ ఫండ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కార్యాచరణ ఒకేలా ఉంటుంది.

అయితే ఇక్కడో చిక్కు. పెట్టుబడి మూలధనం ఎక్కువయ్యే కొద్దీ ఒక స్టాక్ యొక్క స్వకీయ రిస్క్ కంటే పోర్ట్‌ఫోలియో సమిష్టి రిస్క్ ఎక్కువవుతుంది. ఆ రిస్క్‌ను వీలైనంత తగ్గించే విధానంలోనే మ్యూచువల్ ఫండ్‌కు, హెడ్జ్ ఫండ్‌కు ముఖ్యమైన తేడా.

ఒకవేళ 2008, కరోనా వంటి సంక్షోభం వచ్చి మార్కెట్లు కుదేలైతే మదుపర్లు భయపడి రాము, రాజులను తమ డబ్బు వెనక్కు అడిగే అవకాశమెక్కువ. అప్పుడు ఎక్కువ నష్టాలకు షేర్లను అమ్మివేయవలసి వస్తుంది.

అందుకే కాస్త ముందు చూపుతో రాము, రాజు వారు కొన్న షేర్ల ఫ్యూచర్లు షార్ట్ చెయ్యటం, ఫ్యూచర్లు లేని షేర్లకు ప్రతిరక్షగా నిఫ్టీ కాల్ ఆప్షన్లు షార్ట్ చెయ్యటం చేశారు. ఇదంతా షేర్ మార్కెట్లు పతనమయ్యే పరిస్థితికి పరిగణిత రక్షణను కొనటం అనుకోవచ్చు. ఇకపై మార్కెట్లు పతనమైనా ఆ ఫ్యూచర్లు, కాల్ ఆప్షన్లలో వచ్చే లాభం షేర్లలో వచ్చే నష్టాన్ని భర్తీ చెయ్యగలవు.

రాము, రాజు నడుపుతున్నది ఒక సరళమైన హెడ్జ్ ఫండ్.

సాధారణంగా పలు దేశాల రియల్ ఎస్టేట్, ప్రభుత్వ బాండ్లు, బంగారం, చమురు, పసుపు, కాఫీ, మార్కెట్లో లిస్ట్ అవ్వని సంస్థల్లో వాటాలు వంటి పలు సెక్యూరిటీలతో లాభాలను పెంచుకునే ప్రణాళికలు రచించుకుంటాయి హెడ్జ్ ఫండ్లు. ఇదంతా కూడా అభిజ్ఞ ఊహ మాత్రమే.

అయితే మ్యూచువల్ ఫండ్లతో పోల్చితే హెడ్జ్ ఫండ్లలో కొన్ని ముఖ్య వ్యత్యాసాలు:

  • పెట్టుబడి అవకాశం కొందరికే.
  • కనీస పెట్టుబడి మొత్తం చాలా ఎక్కువ (అమెరికాలో కొన్ని హెడ్జ్ ఫండ్లలో కనీసం వంద మిలియన్ డాలర్లు).
  • నిర్వాహణ రుసుము ఎక్కువ. ఉదాహరణకు ఏటా మూలధనంలో 2% + 20 శాతాన్ని మించిన లాభాల్లో 15%.
  • ప్రభుత్వ ఆర్థిక విధివిధానాల పరిధిలోకి రావు.
  • పెట్టుబడుల వివరాలు బహు గోప్యం.
  • నాణ్యమైన హెడ్జ్ ఫండ్లు నిలకడగా ఏటా 50 శాతాన్ని మించిన లాభాలు సంపాదించిన దాఖాలాలున్నాయి.

నిజానికి కొన్ని హెడ్జ్ ఫండ్లు కొన్నేళ్ళకు వారి ప్రణాళికతో వచ్చిన లాభాలతో మొదట పెట్టుబడి పెట్టిన వారికి లాభాలతో సహా వారి మూలధనం తిరిగిచ్చేసి ఆపై సొంతంగా మాత్రమే ఫండ్ నడుపుతారు.

ఉదాహరణకు ప్రపంచంలోని అత్యుత్తమ హెడ్జ్ ఫండ్ సంస్థ అయిన  రినైసాన్స్ టెక్నాలజీస్ తమ మెడాలియన్ ఫండ్‌ను కేవలం తమ ఉద్యోగులకు మాత్రమే నడుపుతున్నారు. ఈ మెడాలియన్ ఫండ్ గత ముప్పై ఏళ్ళుగా ఏటా 66% లాభాలార్జిస్తోంది. ఈ సంస్థకు చెందిన విషయాలన్నీ ఎంతో గోప్యం. ప్రపంచంలోని అత్యంత కఠినమైన ఇంటర్వ్యూ ప్రక్రియ వీరిది అని ఫైనాన్స్ వర్గాల్లో నానుడి.

మన దేశంలో హెడ్జ్ ఫండ్ల ప్రణాళికల గురించి మరింత వివరణకు (ఆర్థిక అంశాలపై బాగా అవగాహన ఉన్నవారికి మాత్రమే!)

మన దేశంలో హెడ్జ్ ఫండ్లకు SEBI 2012లో అనుమతిచ్చింది. వాటిని ఇక్కడ Alternate Investment Funds(AIF) అంటారు. మన దేశంలో ఇప్పటి వరకూ రెజిస్టర్ అయిన హెడ్జ్ ఫండ్ల వివరాలు SEBI వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

టూకీగా హెడ్జ్ ఫండ్ అంటే ధనవంతుల సంపదను మరింత వేగంగా పెంచే ఒక ప్రీమియం ఉత్పత్తి అనుకోవచ్చు.

గ్లోబల్ మాక్రో ఇన్వెస్టింగ్ స్ట్రాటజీని ఉపయోగించి హెడ్జ్ ఫండ్స్..,

1.రిస్క్-సర్దుబాటు రాబడిని సంపాదించడానికి గ్లోబల్ స్థూల ఆర్థిక మేనేజ్ మెంట్

2. షేర్డ్ లేదా కరెన్సీ మార్కెట్లలో గణనీయమైన పెట్టుబడులు తీసుకుంటారు

3. స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కదలికల నుండి లాభం పొందే పెట్టుబడికి అవకాశాలను గుర్తించడానికి గ్లోబల్ మాక్రో ఫండ్ నిర్వాహకులు ప్రపంచ మార్కెట్ సంఘటనలు మరియు పోకడల ఆధారంగా స్థూల ఆర్థిక విధానాల ఉపయోగిస్తారు

4. మార్కెట్లలో విభిన్న పెట్టుబడులలో పెద్ద స్థానాలను తీసుకోవటానికి పరపతి ఉపయోగించగల సామర్థ్యం ఆకర్షణీయమైన, రిస్క్-సర్దుబాటు చేసిన రాబడిని సంపాదించడానికి వ్యూహాలు చేస్తార

Investment

క్రిప్టోకరెన్సీ అంటే బ్లాక్‌చెయిన్‌పై పనిచేసే డిజిటల్ కరెన్సీ.

కృష్ణాష్టమి అంటే కృష్ణుని బర్త్‌డే అనేసినట్టున్నా అంత సులువుగా అర్థం కాని విషయమిది.

ముందుగా మనకు అలవాటైన డబ్బు అంటే అసలేమిటి?

RBI ముద్రించే నోట్లపై RBI గవర్నర్ సంతకం చేసినందున ఆ నోట్లకు విలువ వస్తుంది. అంటే ప్రతి నోటు ఒక నిర్ణీత విలువకు కోశాగారం అనుకోవచ్చు. వాటిని చట్టపర లావాదేవీలకు వాడుకోవచ్చు. దీన్ని ఆర్థిక మాండలికంలో ఫియట్ కరెన్సీ అంటారు. మన రుపాయి కూడా ఫియట్ కరెన్సీయే.

ఇది డిజిటల్ రూపంలోనూ వాడవచ్చు – క్రెడిట్ కార్డులు, UPI, వగైరా. అయితే డిజిటల్ లావాదేవీల వెనుక కూడా కరెన్సీ బదలాయింపు ఉంటుంది. ఫియట్ కరెన్సీ లావాదేవీల మూలం, ఆనవాలు, జాడలను కనిపెట్టటం RBI వంటి సంస్థలకు సాధ్యం. ఉగ్రవాదం, కుంభకోణాలు వంటివాటిని అరికట్టేందుంకు ప్రపంచవ్యాప్తంగా ఫియట్ కరెన్సీ జాడలను కనిపెట్టటం సాధారణంగా జరిగేదే.

ఫియట్ కరెన్సీ చెలామణీ, విలువ, దానికి తగిన విదేశీ మారకద్రవ్యం వంటి అంశాలన్నీ RBI ఆధీనంలో ఉంటాయి. ఈ డబ్బు భద్రతకు, లావాదేవీలకు ఒక మధ్యవర్తి ఉండాలి. ఉదాహరణ బ్యాంకులు.

ఫియట్ కరెన్సీ యొక్క ముఖ్యలక్షణం అపరిమిత సరఫరా. ఎంత ముద్రించాలి అన్న పరిమితులున్నా సెంట్రల్ బ్యాంకు ముద్రిస్తూనే ఉంటుంది.

క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి?

క్రిప్టో కరెన్సీ కూడా డిజిటల్ కరెన్సీనే. ఇది వర్చువల్ కరెన్సీ. అయితే డిజిటల్ కరెన్సీపై కేంద్రం లేదా ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల నియత్రణ ఉంటుంది. డిజిటల్ కరెన్సీ నిర్వహణ బాధ్యతను ఇవి చూసుకుంటాయి. అయితే ఇక్కడ క్రిప్టోకరెన్సీల విషయానికి వస్తే.. వీటిపై ఎవరి నియంత్రణ ఉండదు. డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి. క్రిప్టోకరెన్సీల విలువ డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది. బ్లాక్‌యెయిన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టోకరెన్సీలు పనిచేస్తాయి.

సరళంగా చెప్పాలంటే క్రిప్టోకరెన్సీ ఒక వ్యక్తిగత డిజిటల్ ఖాతాను అందించే కంప్యూటర్ ప్రోగ్రామ్. పైన చెప్పుకున్న అంశాలన్నిటికి అతీతంగా ఉండే కరెన్సీ క్రిప్టోకరెన్సీ.

  • నియంత్రణా వ్యవస్థ లేదు, ఉండదు.
  • తగిన పరికరాలు ఉన్నవారెవరైనా ముద్రించవచ్చు.
  • ఎవరైనా ప్రపంచంలో ఎవరితోనైనా లావాదేవీలు అనామకంగా జరపవచ్చు.
  • మధ్యవర్తులు అవసరం లేదు.
  • లావాదేవీలన్నీ డిజిటల్‌గా నమోదై ఉన్నా వేరెవరూ వాటిని చూడలేరు.
  • పరిమిత ముద్రణ (అదీ డిజిటల్‌గానే).

దానిలో పెట్టుబడి పెట్టడం ఎంతవరకూ సరైన చర్య?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై రకరకాల ఆంక్షలు, అపోహలు ఉన్నాయి. అసలిలాంటి అనియంత్రిత కరెన్సీని చట్టపరం చెయ్యటం అనర్థదాయకం అని వాదించే ప్రభుత్వాలూ ఉన్నాయి. మన దేశంలోనే క్రిప్టోకరెన్సీ చట్టవిరుద్ధమని, కాదు అలా నిషేధించటం తప్పనీ ఊగిసలాట ధోరణి కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే క్రిప్టోకరెన్సీని లావాదేవీలకు స్వీకరించే సంస్థలు పెరుగుతూనే ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీపై విధివిధానాలు ఏర్పడటానికి సమయం పట్టవచ్చు. ఎందుకంటే వాటిపై విధివిధానాలు ఎలా రూపొందించాలో స్పష్టమైన జ్ఞానం, అనుభవం చాలా అరుదు. అందువల్ల వాటిలో పెట్టుబడి ఎంతో రిస్క్‌తో కూడుకున్నదన్న విషయం విదితం.

ఇదిలా నడుస్తూనే ఉన్నా, క్రిప్టోకరెన్సీల విలువ వాటి నైసర్గిక లక్షణాల వల్ల పెరుగుతూనే ఉంటుంది (కుదుపులు సహజమే). మరే పెట్టుబడి మార్గంలాగానే ఇందులోనూ వ్యక్తిగత రిస్క్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి.

అన్ని సాంప్రదాయక పెట్టుబడి మార్గాల్లోనూ అత్యుత్తమ రాబడులను ఇచ్చేది స్టాక్ మార్కెట్ అన్నది చరిత్ర చూపిన వాస్తవమే అయినా మన దేశంలో కేవలం 14% జనాభా మాత్రమే వాటిలో పెట్టుబడి పెడుతున్నారు. ఎవరి వ్యక్తిగత లక్ష్యాలను అనుసరించి వారు పెట్టుబడి మార్గాలు ఎంచుకుంటారు సాధారణంగా. అలాగే ఇటువంటి రిస్క్ ఎక్కువైన పెట్టుబడి మార్గానికి వ్యక్తిగత ప్రణాళికలో ఎడం ఉంటే మొత్తం కోల్పోయే పరిస్థితి సాధ్యం అని సన్నద్ధమై మొదలుపెట్టవచ్చు.

Real Estate

కంప్యూటర్ స్టాంప్ డ్యూటీ లేని రోజుల్లో , ఫీజు స్టాంప్ పేపర్ విలువ బట్టి వసూలు చేసేవారు.

అంటే మీరు కట్టవలసిన రిజిస్ట్రేషన్ 516 రూపాయలు అనుకోండి. (ఈ రోజుల్లో ఇంత తక్కువ ఫీజు లేదనుకోండి) అప్పుడు 100 రూపాయల కాగితాలు ఐదు , 20 రూపాయల కాగితం 1 కొని అన్నిటి మీద కలిపి ఒప్పందం రాసుకునేవారు.

ఆ దరిద్రుడు అబ్దుల్ కరీం తెల్గీ స్కామ్ చేసిన తర్వాత ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు 40 వేలు రుసుం ఉందనుకోండి. అంతా ఒక్కసారి కట్టి ఆ స్టాంపు ఒప్పందం మీద ముద్ర వేసుకుంటారు.

ఒక యాభై అరవై ఏళ్ల కిందట ఒప్పందాలు చూస్తే మీకు 75 నయా పైసలు స్టాంప్ లు కూడా కనపడతాయి.

ఒక్కోసారి రు 10,20,లేదా50 స్టాంపు పేపర్లు సరిపోతాయి. .ఒక్కోసారి 100 రూపాయల స్టాంప్ పేపర్ కావాలి.అప్పుడు దానిని ఉపయోగిస్తారు.ఇలా సమయాన్ని బట్టి ఉపయోగించు కొనుటకు వీలుగా వేర్వేరు పేపర్లు ముద్రిస్తారు.

రూ.10, 20, 50, 100 విలువ చేసే స్టా౦పుల అవసరం భూముల, ఆస్తుల క్రయవిక్రయాలకు మాత్రమే కాకుండా పలు ఇతర అవసరాలకు కూడా అవసరమే. వీటి వినియోగం ఇలా వుంది..

రూ. 10 స్టాపు

ప్రధానంగా నోటరీ పనులకు ఎక్కువగా వినియోగిస్తుంటారు. అంటే పుట్టినతేదీ సరి చేసుకునేప్పుడు, చిరునామా నిర్ధారణకు, ఈ స్టాంపుపై రాసి, అర్జీదారు సంతకం చేసి, అర్హతపొందిన న్యాయవాది సంతకం ( కౌంటర్ సంతకం)తో సమర్పిస్తారు. ఇంకా అనేక అంశాలపై నోటరీకి దీన్ని వినియోగిస్తారు. సెల్ఫ్ అఫిడవిట్ కూ ఉపయోగిస్తారు. మిగిలిన స్తాంపుల కంటే, దీని వినియోగమే ఎక్కువ.

రూ. 20 స్టాపు

ఒక స్థలం, భూమి, భవనం కొనేప్పుడు అది ఎవరి పేరిట వుంది? దానిపై రుణాలు వున్నాయా, ఎంత విస్తీర్ణం వంటి విషయాలు అధికారికంగా తెలుసుకోవడానికి రిజిస్ట్రార్ కార్యాలయంలో నకలు తీసుకోవాలి. ఇందుకోసం రూ.20 స్టాంపు ను ఉపయోగిస్తారు. సరిఫైడ్ కాపీలు పొందాలన్నా ఇది అవసరమే. క్రయవిక్రయాల దస్తావేజులకు తగ్గినమేరకు కూడా వీటిని వినియోగించవచ్చు.

రూ.50–100

అన్ని రకాల క్రయవిక్రయాలకు వీటిని ఉపయోగిస్తారు. లావాదేవీల్లో పరస్పర ఒప్పందాలు, పార్తీకత్తులు, సెటిల్మెంటు దస్తావేజులు, కుటుంబ భాగ పరిష్కార పత్రాలు ( పార్టీషన్ ) కోసం ఇవి ఉపయోగపడతాయి.

భార్యాభర్తల మధ్య విడిపోయే పరిస్థితి వున్నపుడు, న్యాయ స్థానం వెలుపల పరిష్కారం కోసం పరస్పర అంగీకార పత్రాలు రూ.100 స్టాంపుపై రాసుకుంటారు.

లోక్ అదాలత్, సాల్వేన్సీ, ఎన్నికల నామినేషన్ పత్రాలకు అనుబంధంగా వినియోగిస్తారు.

ఇటీవల జరిగిన ఆంద్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలలో సర్పంచి అభ్యర్థి తాను గ్రామానికి చేయదలచిన పనులను రూ.10 స్టాంపుపై రాసి, సంతకాలు చేసి ఓటర్లకు పంపిణీ చేశారు.

Stock Market

ఒక అంకుర సంస్థలో వివిధ దశల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. అతి కొద్ది మొత్తం వ్యవస్థాపక దశలో పెట్టి కొన్ని లక్షల రెట్లు రాబడి పొందే అవకాశం ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక ఉత్పత్తి ఒక రూపు సంతరించుకుని కొంచెం నమ్మకం కుదిరాక పెట్టుబడి పెట్టవచ్చు. లేదంటే ఊపందుకున్నాక రెండో, మూడో అంచెలో ఒక మోస్తరు మొత్తానికి సంస్థలో మంచి వాటా తీసుకోవచ్చు. ఆపై ఐ. పి. ఓ ఉండనే ఉంది.

మీరు ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత ధన నష్ట ముప్పు పరిమితి మీద ఆధారపడి ఉంటుంది. ముప్పుకి పెట్టుబడికి ఏమిటి సంబంధం అంటే ఒక ప్రతీకాత్మక చిత్రం ఇది.

సంస్థ మనుగడ సాగుతున్న కొద్దీ నష్ట భయం తగ్గుతూ వస్తుంది. అంటే ప్రతి సంస్థా IPO దశకు చేరుతుంది అని మాత్రం చెప్పలేము. IPO కి ముందు పెట్టిన పెట్టుబడులు ఎన్నో వందల రెట్ల లాభం ఇవ్వగలవు. అసలు మూలధనం పూర్తిగా తుడిచి పెట్టగలవు కూడా.

ఈ నష్ట భయాన్ని ఎలా చూడాలి అంటే ఇదిగో ఇలా. ప్రస్తుతం చుస్తే భవిష్యత్తులో అల్లంత దూరాన ఆదిగో లాభం నష్టం మధ్య ఏమైనా జరగవచ్చు.

ఒక్కో అడుగు ముందుకు వేసినా కొద్దీ నష్ట భయం కొంత తగ్గుతుంది. అందుకే సంస్థ విలువ పెరుగుతుంది.

ఇదే సూత్రం IPO కి కూడా వర్తిస్తుంది. IPO తో పోలిస్తే లిస్టింగ్ తరువాత అసలు విలువ తెలిసే అవకాశం ఎక్కువ. అంటే నష్ట భయం తక్కువ. కానీ దానివల్ల ఒకవేళ లాభంలో ఉంటే మన చేతికి వచ్చే లాభం తక్కువ.

IPO లో కొనాలా తరువాతనా అనేదానికి మీ వ్యక్తిగత నష్ట భయ సమర్థ్యం ఒక్కటే ముఖ్య పరిగణ. మీరు డబ్బు కోల్పోవడం భరించ గలిగితే, సంస్థ గురించిన సమాచారం మీద నమ్మకం ఉంటే IPO లో ప్రయత్నించవచ్చు. లేదంటే మార్కెట్లో ధర స్థిరీకరణ జరిగాక మామూలుగా ఎలాగూ కోనేయవచ్చు.

ఇంకో విషయం – సంస్థ పునాది బలంగా ఉంటే IPO లో కొన్నా తరువాత కొన్నా దీర్ఘకాలిక లాభాల్లో IPO లిస్టింగ్ లాభాలు చాలా చిన్నవి. సంస్థ బాగాలేక పొతే IPO లో పెట్టిన మూలధనం సైతం కోల్పోవచ్చు.

ఇక మిగిలింది సంస్థ పని తీరుతో సంబంధం లేకుండా, అప్పటి మార్కెట్ గతిని బట్టి, ట్రెండ్ లో ఉన్న రంగాన్ని బట్టి, మదుపరులలో ఉన్న ఆసక్తి వల్ల రాగలిగే లిస్టింగ్ గైన్స్. దానికోసమే అయితే సరైన విశ్లేషణ చేసి IPO లో పెట్టుబడి పెడితే కానీ తెలియదు.

కొన్ని ఆసక్తికర విశ్లేషణలు :

లిస్టింగ్ లాభాలు:

లిస్టింగ్ రోజు లాభం లో ముగిసినవి నీలి రంగు, తతిమా బూడిద రంగులో ఉన్నవి నష్టం చవి చూసినవి. ఇదే ముందు చెప్పిన నష్ట భయం. ఏది జరిగేది ముందు అంచనా వేయడమే తప్ప పూర్తిగా తెలుసుకోలేము.

మూలం: https://www.nasdaq.com/articles/trends-in-ipo-pops-2021-03-04?amp

దీర్ఘ కాలిక కదలిక: ( భారతీయ షేర్లు)

2013 లో తప్ప సంవత్సరం తిరిగే సరికి పెద్ద లాభం ఏమి లేదు. త్రైమాసిక ఫలితాలు వస్తూ ఉంటే అసలు సమాచారం తెలిసి ధర అందుకు తగ్గట్టు సర్దుబాటు అవడం వల్ల.

NASDAQ లో ఒక అధ్యయనం ప్రకారం IPO తరువాత ఇలా

మూలం: https://www.nasdaq.com/articles/what-happens-to-ipos-over-the-long-run-2021-04-15?amp

మొత్తంగా చెప్పేది ఏంటంటే IPO లో అధిక నష్ట భయం, అన్నీ బాగుంటే అధిక రాబడి లేదా మూల ధన నష్టం.

అదే మములు స్టాక్ కొంటే ఒక మోస్తరు నష్ట భయం, ఒక మోస్తరు రాబడి. మూల ధన నష్టం అవకాశం బాగా తక్కువ.

ఏది మంచిది అనేదానికి మన ఆర్థిక పరిస్థితి, విశ్లేషణ సామర్థ్యం, అప్పటి సూచీ పని తీరు ఆధారంగా సమాధానం మారుతుంది.

 ఐపీవో అంటే అంత వరకూ ప్రైవేటుగా ఉన్న సంస్థ పబ్లిక్ మార్కెట్లలో లిస్టు అవడం.

పబ్లిక్ సంస్థగా లిస్టు అవ్వాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. వాటికి లోబడి స్టాకును లిస్టు చెయ్యవచ్చు.

స్టాకు ప్రాథమికంగా మంచి ఫండమెంటల్స్ కలిగి ఉందా లేదా అనేది డీ ఆర్ హెచ్ పీ ద్వారా తెలుసుకోవచ్చు.

స్టాకు మంచిదా కాదా అనేది ఉన్న సమాచారం ద్వారా పరీక్షించవచ్చు.

ఇందులో ఐపీవో కి ప్రత్యేకమైంది ప్రైస్ డిస్కవరీ. అంటే ఏ ధర సరైనది అని మార్కెట్టు నిర్ణయిస్తుంది. ఆ తతంగం అంతా మొదటిసారి జరుగుతుంది. అది వివిధ కారణాల వల్ల సంస్థ విక్రయించిన ధర కంటే ఎక్కువగా ఉండవచ్చు లేదా తక్కువగా.

అన్నీ సమకూరితే మంచి లిస్టింగు లాభాలు వస్తాయి. ఇంతకు ముందు లేని ప్రత్యేకమయిన సంస్థలో భాగమవడానికి ఇది మీకో అవకాశం.