Stock Market

బోనస్ షేర్స్ జారీ చేయడం అంటే ఏమిటి?

ఒక సంస్థ తమ లాభాలను మదుపర్లతో రెండు విధాలుగా పంచుకుంటుంది:

నగదు డివిడెండ్ – ఒక షేరుకు ఇంత నగదు అని పంచటం.

షేర్ల డివిడెండ్ – ఒక షేరుకు ఇన్ని షేర్లు అని పంచటం (ఇదే బోనస్ ఇష్యూ).

డివిడెండ్‌పై DDT(డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్) ఉంటుంది, బోనస్ షేర్లపై ఎటువంటి పన్నూ ఉండదు.

బోనస్ షేర్లు జారీ చేసేందుకు పలు కారణాలు:

సంస్థ ప్రమోటర్లు వారి వోటింగ్ హక్కును పెంచుకోవటం.

షేర్ల ద్రవ్యత్వాన్ని పెంచటం. ఒక షేరు వెల బాగా ఎక్కువగా ఉంటే చిన్న మదుపర్లు కొనరు. ఇందువల్ల ద్రవ్యత్వం తగ్గి పెద్ద సంస్థ ఏదైనా ఆ సంస్థను స్వాయత్తం చేసుకోవటం చాలా సులభం. ఉదా: MRF షేరు ధర 60,000/-.

మదుపర్లలో సంస్థపై నమ్మకం, దీర్ఘకాలిక పనితనంపై విశ్వాసం కలిగించటం.

బోనస్ షేర్ల వల్ల మదుపర్లకు కలిగే ప్రయోజనాలు:

ఉచితంగా సంస్థలో మరింత భాగం దక్కటం.

ఉచితంగా వచ్చిన షేర్లపై ఎటువంటి పన్ను లేకపోవటం.

ఇకపై నగదు డివిడెండు ప్రకటించినప్పుడు ఎక్కువ నగదు వచ్చే అవకాశం.

ఒక ఉదాహరణ:

ఒకవేళ ఎవరైనా 1980 సంవత్సరంలో 10,000 రూపాయలు కనుక (Wipro)విప్రో కంపెనీ లో పెట్టుబడిగా పెట్టి 34 సంవత్సరాల పాటు కొనసాగించి ఉంటె 2014 సంవత్సరంలో వాటి విలువ అక్షరాలా 535 కోట్ల రూపాయలు. నమ్మశక్యంగా లేదు కదా.అదెలాగో ఇప్పుడు చూద్దాం

1980 సంవత్సరంలో విప్రో కంపెనీ షేర్ ధర 100 రూపాయలాగా ఉండేది. ఆ సమయంలో మనం 10000 రూపాయలతో విప్రో కంపెనీకి చెందిన 100 షేర్లు కొన్నాం అనుకుందాం.

1981 లో విప్రో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. అంటే మన దగ్గర 1 షేర్ కనుక ఉంటె విప్రో కంపెనీ మరొక షేర్ ని బోనస్ గా మన ఖాతాలో వేస్తుంది. కాబట్టి మనం 100 షేర్లు కొన్నాం కాబట్టి ఇప్పుడు మన దగ్గర 200 విప్రో షేర్లు ఉన్నట్టు.

1985 సంవత్సరంలో కంపెనీ మరలా 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. దాంతో మన దగ్గర ఉండే 200షేర్లు కాస్త 400 షేర్లు అయ్యాయి

1986 లో కంపెనీ తన షేర్ ధరను 10 రూపాయలుగా విభజించింది. దీనినే స్టాక్ స్ప్లిట్ (Stock Split) అంటారు. దీని గురించి రాబోయే భాగాలలో వివరంగా తెలుసుకుందాం. ఇలా షేర్ విభజన జరగడంతో మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 400 నుండి 4000 చేరుకుంది.

1987 లో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. మన దగ్గర ఉండే 4000 షేర్లకి కంపెనీ బోనస్ గా 4000 షేర్లు ఇవ్వడంతో ఇప్పుడు మన దగ్గర షేర్ల సంఖ్య 8000 కి చేరుకుంది.

1989 లో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. ఇప్పుడు మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 16,000 కు చేరుకుంది.

1992 లో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది.ఇప్పుడు మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 32,000 కు చేరుకుంది.

1995 లో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది.ఇప్పుడు మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 64,000 కు చేరుకుంది.

1997 లో కంపెనీ ఈ సారి 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. అంటే మన దగ్గర ఉన్న ఒక్కొక్క షేర్ కి రెండు షేర్లను బోనస్ గా ఇస్తుంది. దాంతో మన దగ్గర ఉండే 64,000 షేర్లు 1,92,000 షేర్లు అయ్యాయి.

1999 లో కంపెనీ మరలా తన షేర్ ధరను 2 రూపాయలుగా విభజించింది (Stock Split). ఇలా Stock Split జరగడంతో మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 1,92,000 నుండి 9,60,000 చేరుకుంది.

2004 లో కంపెనీ 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. ఇప్పుడు షేర్ల సంఖ్య 28,80,000 కు చేరుకుంది.

2005 లో కంపెనీ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. ఇప్పుడు మన దగ్గర ఉండే షేర్ల సంఖ్య 57,60,000 కు చేరుకుంది.

2010 లో కంపెనీ 2:3 నిష్పత్తిలో బోనస్ షేర్లు ప్రకటించింది. అంటే మన దగ్గర 3 షేర్లు ఉంటె కంపెనీ బోనస్ గా 2 షేర్లను ఇస్తుంది. దాంతో మన దగ్గర ఉన్న షేర్ల సంఖ్య 96,00,000.

అంటే మనం 1980 లో 10000 రూపాయలతో కొన్న 100 షేర్లు కాస్త Stock Split, బోనస్ కారణంగా 2010 నాటికి 96,00,000 షేర్లగా మారాయి. ఈ 96 లక్షల షేర్లను 2014 వరకు అమ్మలేదు అనుకుందాం. 7 April, 2014 నాటికి విప్రో కంపెనీ షేర్ ధర 557 రూపాయలుగా ఉంది.

అంటే ఒక్క షేర్ ధర 557 రూపాయలు. మన దగ్గర ఉన్న షేర్ల సంఖ్య 96,00,000. ఇప్పుడు వీటి విలువను లెక్కగడితే

557 × 96,00,000 = Rs.534,72,00,000/- . సుమారుగా 535 కోట్ల రూపాయలు. అంతేకాదు ఈ 535 కోట్ల రూపాయల లాభానికి ఒక్క రూపాయి కూడా టాక్స్(TAX) కట్టవలసిన అవసరం లేదు.

కేవలం Wipro కంపెనీ ఒక్కటే కాదు. Cipla , Reliance, Titan, Dr. Reddy Labs ఇలా ఎన్నో కంపెనీలు ఇటువంటి లాభాలనే అందించాయి.

10000 రూపాయలు ఎక్కడ , 535 కోట్ల రూపాయలు ఎక్కడ. బ్యాంకు , రియల్ ఎస్టేట్, బంగారం ఇలా రంగంలో అయిన ఇంత రాబడి రాదు. అయితే 1980 లో పెట్టుబడి పెట్టి 34 సంవత్సరాల పాటు ఆ పెట్టుబడి ని కొనసాగించిన వారు మాత్రమే అంత లాభం పొందారు. చాలా తక్కువ మందికి మాత్రమే అంతటి ఓపిక ఉంటుంది. చాల మంది ఈరోజు పెట్టుబడి పెట్టి రేపటికి అది రెట్టింపు అయిపోవాలని ఆతృతతో స్టాక్ మార్కెట్ లోకి వచ్చి చేతులు కాల్చుకుంటారు. కాబట్టి Stock Market మీద కొద్దీ పాటి జ్ఞానం, అవగాహన, ఓపికతో పెట్టుబడి పెడితే తప్పకుండ దీర్ఘకాలం లో మంచి లాభాలు పొందవచ్చు.

ఇది వాస్తవం, ఊహా లెక్క కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *