stock market downstock market down

స్టాక్ మార్కెట్ లు ఎప్పుడు ఎలా ఎందుకు పతనమవుతాయి అన్నది బ్రహ్మరహస్యం కన్నా సూక్ష్మమైన రహస్యం లాంటిది. మహమహా మేధావులు తమ బుర్ర చించుకున్నా కూడా ఈ రహస్యాన్ని అర్థం చేసుకోలేకున్నారు. కొన్ని కారణాలు ఎంతో కష్టం మీద ఊహించాలి. నా ఊహలు ఇవి. (నేను స్టాక్ మార్కెట్ నిపుణున్ని కాదు కానీ స్టాక్ మార్కెట్ లలో కొన్ని తన్నులు తిన్న మదుపరిని.)

బటర్‌ఫ్లై ఎఫెక్ట్ గురించి వినే ఉంటారు. సుకుమార్ గారు “నాన్నకు ప్రేమతో” చిత్రంలో వివరించారు.

ప్రపంచంలో ఒక మూలన సీతాకోకచిలుక రెక్కలాడిస్తే, ఆ పిల్లగాలి ప్రపంచంలో మరో మూలకు వెళ్ళేసరికి తుఫానులా పరిణమిస్తుందంటారు. అలాంటిది కొరోనా వంటి తుఫానే ఒక మూల బయలుదేరితే మరి ప్రపంచం మొత్తం ప్రకంపనలు ఉంటాయి.

స్టాక్ మార్కెట్లకు ఈ సిద్ధాంతం భేషుగ్గా సరిపోతుంది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎన్నో దేశాల సమాగమం కాబట్టి.

కరోనా వల్ల దేశంలో ఆఫీసులకు, ఫాక్టరీలకు పోయే జనాభా తగ్గింది. దరిమిలా ఆ ఫాక్టరీల ఉత్పత్తులు తగ్గాయి. అలాంటి ఫాక్టరీలకు మూల పదార్థాలు (Raw Material) సప్లై చేసే కంపెనీలు గనక ఇండియాలో ఉంటే అవీ లాసు. దరిమిలా ఈ కంపెనీల షేర్లు లాస్.

ఈ రా మెటీరియల్ సప్లై చేసే కంపెనీ వేటి మీద ఆధారపడిందో ఆ కంపెనీలన్నీ లాస్.

దేశంలో కరోనా వల్ల నాన్ వెజ్ వాడకం తగ్గింది. దరిమిలా అనుబంధమైన అనేక సంస్థలు, వ్యాపారాలకు దెబ్బ. కోళ్ళ ఫారాలు, ఆ కోళ్ల ఫారాలలో ఉత్పత్తి అయ్యే కోడిగుడ్ల పైన ఆధారపడిన ఇతర వ్యాపారాలు, కోళ్ళ ఫారాలలో కోళ్ళకు సప్లై చేసే ఫుడ్, ఆ ఫుడ్ సప్లై చేసే సంస్థలు వగైరా వగైరా.

కరోనా వల్ల జనాలు ట్రావెల్ చెయ్యడం మానేశారు. దరిమిలా ట్రావెల్ మీద ఆధారపడిన ఐర్ లైన్ సంస్థలకు భారీ నష్టం. జనాలు ట్రావెల్ చెయ్యట్లేదు గనక. తద్వారా ఎయిర్ పోర్ట్ లకు నష్టం. ఎయిరోప్లేన్ లలో ఫుడ్ సప్లై చేసే సంస్థలకు నష్టం. ఎయిర్ ప్లేన్ ల ద్వారా బట్వాడా అయ్యే సరంజామా, కొరియర్ కంపెనీలు వీటికి నష్టం. కొరియర్ కంపెనీల మీద ప్రపంచం మొత్తం ఆధారపడింది కాబట్టి అంతలక్కా నష్టం.

అలాగే దేశంలో నెట్ వర్కింగ్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో నిపుణులు ఇంటికాడ పడుకుంటే నెట్ వర్కింగ్ లో వచ్చే రోజువారీ సమస్యలను ఫిక్స్ చెయ్యడం కష్టం అవుతుంది. ఆ సమస్యలు త్వరగా తెమలకపోతే వాటిపై ఆధారపడిన డిజిటల్ కంష్యూమర్ సంస్థలకు దెబ్బ.

ఉదాహరణ:

చైనాలో కార్ల భాగాలు తయారు చేసే కర్మాగారం కొరోనా వల్ల తాత్కాలికంగా మూతపడిందనుకోండి.

మన దేశంలో ఆ భాగాలతో కార్లు తయారు చేసే సంస్థలు ఇప్పుడేం చెయ్యాలి? అవీ మూతపడితే ఎంత నష్టం?

అక్కడ పని చేసే కూలీలకు ఏది దిక్కు? వారికి భృతి లేకుండా ఏం తింటారు? వారు సరుకులు కొనకపోతే కిరాణా కొట్లు ఏమైపోవాలి? కిరాణా కొట్లు కూడా సరుకులు కొనటం ఆపేస్తే అవి తయారు చేసే సంస్థలు ఉత్పత్తి ఆపేస్తాయి కదా? వీరు ముడిసరుకు కొనకపోతే రైతులకు ఏది దిక్కు?

వ్యాపారము, వర్తకము, వ్యవసాయము, ఇలా అన్నీ అంతస్సంబంధాలు కలిగి ఉంటాయి. కాస్త ఉల్లేఖించి చెప్పినా టూకీగా విషయం ఇదే.

వ్యాపారాలను దెబ్బతీసేది లేదా అటకాయించేది (తాత్కలికమే కావచ్చు) ఏదైనా సరే స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష బింబం స్టాక్ మార్కెట్లు.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే – స్టాక్ మార్కెట్లు విపరీత మూల్యాంకనం వద్దకు చేరిన ప్రతి సారీ దిద్దుబాటుకు గురౌతాయి. సరిగా ఆ సమయానికి దిద్దుబాటుకు ఏదో ఒక కారకం సిద్ధిస్తుంది. ఇలాంటప్పుడు పెట్టుబడికి వెనుకాడితే స్టాక్ మార్కెట్లలో ఉండటం లాభదాయకమే కాదు.

ఇట్లా ఎన్నో ఉన్నాయి. మనం చెయ్యగలిగిందల్లా, పతనం అవుతున్నాయని గ్రహించి తెలివిగా మసులుకోవటమే.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *