భయపడకపోవటం, అతిగా ఆశ పడకపోవటం.
ఏ స్టాక్ మార్కెట్ క్రాష్ నుండి అయినా లాభం పొందడానికి ఉత్తమ మార్గాలు ఇవే.
భయపడకపోవటం
ఇదే క్రాష్ అని ఖచ్చితంగా ఎప్పుడూ ఎవరూ చెప్పలేరు. ఒకవేళ మీ విశ్లేషణలో అలా అనిపిస్తే పడ్డాక ఇంకా పడుతుందేమో అన్న భయంతో పెట్టుబడికి జంకకూడదు.
సాధారణంగా మార్కెట్ 10%, అంతకన్నా ఎక్కువ పడితే నెలసరి మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడి మొత్తానికంటే కాస్త ఎక్కువే మదుపు చెయ్యవచ్చు, వెనుకాడకూడదు. దీర్ఘకాల మదుపుకు ఇది ఎంతో మేలు చేస్తుంది. లేదు, ఇంకా పడుతుందని ఎవరో చెప్పినందున ఎదురు చూస్తూ ఉంటే ఆ ఎదురు చూపు ఎప్పటికీ ఫలించకపోవచ్చు. ఏకమొత్తం పెట్టుబడికి సైతం ఈ సూత్రం వర్తిస్తుంది.
సోముకు ఆఫీసులో బోనస్ లక్ష ఇచ్చారు. సహోద్యోగులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మంచిదన్నారు. మొన్న మార్చిలో నిఫ్టీ 12300 నుండి 11000కు పడింది, వెంటనే లక్ష పెట్టేశాడు. 10000కు పడింది, భయం మొదలైంది. 8000కు పడింది, భయం ఎక్కువై నష్టానికి మొత్తం అమ్మేసి, ఇంకా క్రాష్ అయినప్పుడు తిరిగి మదుపు చేద్దామనుకున్నాడు. ఇంకా వేచి చూస్తూనే ఉన్నాడు.
రాజుకు వసూలు కావనుకున్న లక్ష రుపాయలు అనుకోకుండా వచ్చాయి. తాను పత్రికల్లో చదివింది, తెలుసుకున్నదాని దృష్ట్యా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి మంచిదనుకున్నాడు. నిఫ్టీ 12,300 నుంచి 10,000కు వచ్చినప్పుడు భయపడక 50 వేలు మదుపు చేశాడు. 8,000 వద్ద మిగతా 50 వేలు మదుపు చేశాడు. నిఫ్టీ 7,500కు పడినా బెదరక పెట్టుబడి అలాగే ఉంచాడు. నేడు నిఫ్టీ 13,400. మొదటి పెట్టుబడిపై 34%, రెండవ పెట్టుబడిపై 67%, సగటు 50% లాభం తొమ్మిది నెలల్లో.
సరే మరీ అంత క్రియాశీల మదుపరి కాకపోయినా, మార్కెట్ 12300 నుంచి 7500కు పడినప్పుడు భయపడక నెలసరి పెట్టుబడులను అలాగే కొనసాగించి ఉంటే నేటికి 2020కి గాను లాభం అధమపక్షం 11%. భయపడకపోవటం వల్ల (అందునా పెట్టుబడులు ఉపసంహరించుకోకపోవటం వల్ల) సాలీనా లాభం 11%.
అతిగా ఆశ పడకపోవటం
రాజు పెట్టుబడికి 50% లాభం వచ్చింది. ఇంతకు మించి 9 నెలల్లో మంచి రాబడి అత్యాశ అనుకుని మొత్తం అమ్మివేసి వేరు మదుపు సాధనాల్లో (బంగారం, ప్రభుత్వ బాండ్లు, ఇత్యాది) పెట్టాడు. ఇప్పుడు మార్కెట్ పడినా, మరింత పెరిగినా నిబ్బరంగా ఉండగలడు, ఎందుకంటే తన మూలధనాన్ని గౌరవించి తనకు చాలిన లాభాన్ని స్వీకరించాడు.
9 నెలల్లో 50% రాబడి వచ్చింది, మళ్ళీ వస్తుందని, ఇప్పుడు మార్కెట్ పెరుగుతూనే ఉందని, సోము మొండి ధైర్యంతో మళ్ళీ పెట్టుబడి పెట్టేశాడు. ఇప్పుడు అతని ఆశ తీరాలంటే నిఫ్టీ తొమ్మిది నెలల్లో 20,000కు చేరాలి. ఏదోక మహాద్భుతం జరిగితే తప్ప ఇది అసాధ్యమని వివేకంతో ఆలోచించే ప్రతి వ్యక్తికి అర్థమయ్యే విషయం.
అతిగా ఆశపడటం మంచిది కాదని సూపర్‌స్టార్ రజినీ అంత స్టైలిష్‌గా చెప్పనే చెప్పారు కదా!
ఇటువంటి మరిన్ని విషయాల కొరకు సృష్టించిన వేదిక పెట్టుబడుల బడి. ఆసక్తి ఉన్నవారు అటో చూపు విసరండి.