mutual fundsmutual funds

మ్యూచువల్ ఫండ్లలో (ఆ మాటకొస్తే స్టాక్ మార్కెట్లో) పెట్టుబడి అంటే ఒక వ్యాపారంలో పెట్టుబడితో సమానం. ఊరికే డబ్బు పోగొట్టుకోవాలని అయితే ఎవరూ ఎందులోనూ పెట్టుబడి పెట్టరు (సాధారణంగా).

నాకు తెలిసిన ఒకాయన పాల వ్యాపారం గురించి బాగా వివరాలు సేకరించి అందులోకి దిగారు కానీ మూడేళ్ళలో నష్టాలకు మూసివేసారు. పాల వ్యాపారమే అప్పటికి మూడేళ్ళుగా నష్టాల్లో నడుపుతున్న ఇంకొకాయనపై నమ్మకంతో నా స్నేహితుడు 5 లక్షలు అందులో పెట్టుబడి పెట్టాడు. మరో మూడేళ్ళలకు లాభాలు మొదలై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారం బాగా విస్తరించిన బ్రాండ్ అయిందది. ఆ 5 లక్షల వాటా ఇప్పుడు దాదాపు కోటి రుపాయలు విలువ చేస్తుంది. మరి పాలవ్యాపారం అది చేసేవారందర్నీ ధనవంతులను చేస్తుందా?

డ్యూ డిలిజెన్స్ (వ్యాపారం గురించి వివరాలు, విశేషాలు అన్నీ తెలుసుకుని, లాభం వచ్చే అవకాశం మెండుగా ఉందా అని తెలుసుకోవటం) – వ్యాపారం మొదలుపెట్టాలనుకునే ప్రతిఒక్కరు చేసేదే. అయినప్పటికీ అందరూ వ్యాపారంలో లాభాలార్జించలేరు. దీనికి కారణం అదృష్టం కాదు – నిరంతర శ్రమ, మార్పుకు సంకోచించని తత్వం. వ్యాపారం మొదలెట్టేశాం కదా అని గుఱ్ఱాల కళ్ళకు కట్టే బ్లింకర్స్ వంటివి పెట్టేసుకుని మూసధోరణిలో వెళ్తే కష్టం.

ఏ పెట్టుబడి అయినా అది అమలు చేసే విధానాన్ని బట్టి ఫలితం ఉంటుంది.

మనం చేరాల్సిన గమ్యం ధనవంతులం అవడం అయితే మనల్ని అక్కడికి తీసుకువెళ్ళే వాహనాలలో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. ఆ వాహనం నడిపే విధానాన్ని బట్టి మనం గమ్యం చేరుకుంటామా లేదా అనేది ఆధారపడి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్స్ మిమ్మల్ని ధనవంతులుగా చేయగలవా?

ఖచ్చితంగా చెయ్యగలవు. ఒక క్రమబద్ధమైన పద్ధతిలో పెట్టుబడి పెడితే మ్యూచువల్ ఫండ్ల ద్వారా ధనం సంపాదించడం సాధ్యమే.

అయితే పెట్టుబడి పెట్టేశాం, ఇక ధనవంతులైపోవటమే తరువాయి అని బిందాస్‌గా గుడ్లను చూసి కోడిపిల్లలను లెక్కపెట్టేసుకునే ధోరణి ఉంటే సత్ఫలితం దాదాపు అసంభవం.

  1. ఎంత కాలానికి, ఎందుకు పెట్టుబడి పెడుతున్నదీ స్పష్టంగా నిర్ణయించుకోవాలి.
  2. తదనుగుణంగా నాణ్యమైన మ్యూచువల్ ఫండ్లు ఎంచుకోవాలి.
  3. పెట్టుబడి దీర్ఘకాలానికైతే డైరెక్ట్ ఫండ్లనే ఎంచుకోవాలి.
  4. దీర్ఘకాలానికైతే (అంటే ఆరేళ్ళకు మించి) ఏడాదికోసారి, స్వల్పకాలానికైతే (అంటే రెండు-మూడేళ్ళకు) ఆరు నెలలకోసారి ఫండ్ పనితీరును సమీక్షించాలి.
  5. పనితీరు సంతృప్తికరంగా లేకపోతే నిర్మొహమాటంగా డబ్బును నాణ్యమైన ఫుండ్‌కు తరలించాలి.
  6. మార్కెట్లో వచ్చే కుదుపులకు (ఉదాహరణకు 2008, కోవిడ్) భయాందోళనలకు లోనవ్వకుండా, అటువంటి కుదుపులను అవకాశాలుగా ఉపయోగించుకోగల వెరవని ధైర్యముండాలి.

పైవన్నీ పాటించే ఎవరినైనా మ్యూచువల్ ఫండ్లు ధనవంతులను చేస్తాయి.

గమనిక: మ్యూచువల్ ఫండ్లు అంటే ఈక్విటీ ఫండ్లు అన్న అర్థంతోనే ఈ సమాధానం రాయటం జరిగింది. ఎందుకంటే నాణ్యమైన ఈక్విటీ ఫండ్లు మాత్రమే మదుపర్లను ధనవంతులను చెయ్యగలవు, వాటి ఉద్దేశ్యమూ అదే. డెట్, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లలో మదుపు ముఖ్యంగా ఎఫ్‌డీలను మించిన రాబడి పొందేందుకే.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *