Stop loss అంటే ఎక్కువ లాస్ నుండి మనల్ని మనం సేవ్ చేసుకోవడం అనుకోవచ్చు.
ఒక స్టాక్ నష్టాల్లో కూరుకున్నప్పుడు, కొన్ని సార్లు సరైన నిర్ణయం అమ్మెయ్యటం. అయితే, మన భావోద్వేగాలు నష్టాన్ని భరించలేవు. మళ్ళీ పుంజుకుంటుందేమో అన్న ఆశతో అమ్మకుండా ఉంచి మరింత నష్టాల పాలవుతాము.
లేదా, మీరు ఒక స్టాక్ కొని, అంతర్జాలం లేని ప్రదేశాలకు విహార యాత్రకు వెళ్లొచ్చు. మీరు యాత్రలో ఉండగా, ఆ కంపెనీ స్టాక్ పడిపోవచ్చు.
ఇటువంటి ప్రమాదాలను అరికట్టటానికి ‘స్టాప్ లాస్’ వాడొచ్చు. మీరు 100/- కి స్టాక్ కొంటే, 20/- కన్నా ఎక్కువ నష్టం రాకూడదు అనుకుంటే, 80/- ‘స్టాప్ లాస్’ ఆర్డర్ పెట్టొచ్చు. ఇప్పుడు, ఆ స్టాక్ విలువ 80/- తాకినా, అంతకన్నా కిందకు వెళ్లినా, మీ ప్రమేయం లేకుండా మీ స్టాక్ మొత్తం అమ్మివేయబడుతుంది.
మీరు వంద రూపాయలకి ఒక స్టాక్ కొన్నారని అనుకుందాం. మీరు మీ ట్రేడ్ లో పది రూపాయల కంటే ఎక్కువ లాస్ తీసుకోదల్చుకోలేదు, అప్పుడు 90 కి స్టాప్ లాస్ పెట్టుకుంటారు ఒకవేళ స్టాక్ 90 కన్నా కింద పడితే మీరు ఆ స్టాక్ నుండి ఎగ్జిట్ అవుతారు.
రాజు రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుందని నలుగురూ అంటుంటే లాభానికి అమ్మేద్దామని 50 లక్షలకు ఒక ఫ్లాట్ కొన్నాడు. డీమానెటైజేషన్ అనీ, కోవిడ్ అనీ ఏళ్ళ తరబడి ఫ్లాట్ విలువ పెరక్కపోగా తగ్గి 45 లక్షలయింది. మళ్ళీ పెరుగుతుందని ఎవరో చెబితే అట్టే పెట్టుకున్నాడు. ఇప్పుడదే 40 లక్షలు పలుకుతోంది. 45 లక్షలు స్టాప్-లాస్ అనుకుని 5 లక్షల నష్టానికి అమ్మివేసి ఆ వచ్చిన డబ్బు వేరే పెట్టుబడి పెడితే బాగుండేది.
స్టాప్-లాస్ అంటే పెట్టుబడిలో మనం తట్టుకోగల గరిష్ట నష్ట పరిమితి.
స్టాక్ మార్కెట్ పరిభాషలో ఉదాహరణ:
రాము 2019లో లక్ష రుపాయలతో 370 ఐటీసీ షేర్లు 270 రుపాయల వద్ద కొన్నాడు. ఆ లక్షలో 15 వేలు మాత్రమే రిస్క్ చెయ్యగలను అనుకుని తదనుగుణంగా షేరు ధర 230కి పడిపోతే మొత్తం అమ్మేయాలనుకున్నాడు. 2020 జనవరిలో అమ్మేశాడు. ఇక్కడ 230 స్టాప్-లాస్.
తరువాత మార్చిలో మార్కెట్లు పతనమైనప్పుడు ఆ వచ్చిన 85,000 రుపాయలకు 77 రిలయన్స్ షేర్లు 1100 వద్ద కొన్నాడు. ఈసారి పదివేలు మాత్రమే గరిష్ట నష్టం అనుకుని షేరు 970కి పడితే (స్టాప్-లాస్) అమ్మేయాలనుకున్నాడు. అంతదాకా రాలేదు, ఆపై ఏడాదిలో 100% లాభానికి అమ్మేశాడు.
రాము, రాజు కథలు నిజమే, పేర్లు కల్పితం.
అయితే ఈ స్టాప్-లాస్ ఎక్కడ పెట్టుకోవాలన్న విషయంలో మూడు పద్ధతులున్నాయి.
పైన చెప్పిన మూలధన ప్రకారం అనుకునేది ఒక రకం.
ఫండమెంటల్ విశ్లేషణతో వచ్చేది ఒక రకమయితే, సాంకేతిక విశ్లేషణతో మూడవ రకం.
ఫండమెంటల్ విశ్లేషణ:
ఇందులో “సంస్థ వ్యాపార వ్యూహం మారినప్పుడు (మంచికి కాదు)” అన్నది ఒక విధమైన స్టాప్-లాస్.
ఉదాహరణకు ఐటీసీ సంస్థ తమ మూలవ్యాపారమైన పొగాకు ఉత్పత్తులపై ఆధారపడకూడదని వేరే రంగాల్లోకి అడుగుపెట్టాలనుకోవటం మంచిదే అనుకున్నారంతా. అయితే ఆ అడుగు పెట్టే రంగాలు లెక్కకు మించి, అనుభవం లేనివి కావటంతో పొగాకు ఉత్పత్తులపై వచ్చే లాభాల్లో సింహభాగం మిగతా ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ కొరకు ఖర్చు చెయ్యవలసి వస్తోంది. తత్ఫలితంగా ఏళ్ళ తరబడి షేరు ధర పెరగనా తరగనా అంటూ అక్కడే తారాడుతోంది.
సంస్థ యాజమాన్యం చట్టవిరుద్ధ చర్యలు చేసినట్టు తెలియటం మరొక విధమైన స్టాప్-లాస్. సత్యం, ఫోర్టిస్ యజమానుల చేష్టలు ఇందుకు తార్కాణాలు.
సంస్థ ఆడిటర్ మారటం మరొక స్టాప్-లాస్ సంకేతం. ఉదాహరణకు మన్పసంద్ బెవరేజస్.
సాంకేతిక విశ్లేషణ:
ఇందులో కేవలం చార్ట్ చూసి మునుపు గిరాకీ-సరఫరా స్థాయిలను గుర్తించి తదనుగుణంగా స్టాప్-లాస్ నిర్ధారించుకోవచ్చు.
అయితే stop loss అనేది loss లో కాకుండా ప్రాఫిట్ లో కూడా పెట్టుకోవచ్చు దాన్ని trailing స్టాప్ లాస్ అంటారు.
ఉదాహరణకి మీ ₹100 స్టాక్ 110 రూపాయలు వెళ్తే 105 రూపాయలు దగ్గర మీరు trailing stoploss పెట్టుకుంటారు. 105 కన్నా కింద పడితే మీరు ఆ stock అమ్మేస్తారు.
ముఖ్య గమనిక: ‘స్టాప్ లాస్’ 80/- కి పెట్టినంత మాత్రాన 80/- కి అమ్మబడుతుందని చెప్పలేము. పెద్ద దుర్వార్త వెలువడితే, స్టాక్ ఉన్నపళంగా 60/- కి పడిపోవచ్చు… అప్పుడు ‘స్టాప్ లాస్’ ఆర్డర్, మీ స్టాక్స్ అన్నిటిని 60/- కి అమ్మేస్తుంది. ఇలా జరిగే అవకాశం చాలా తక్కువ.
మరో గమనిక: ‘స్టాప్ లాస్’ మీరు కొన్న ధరకి మరీ దగ్గరగా పెట్టకూడదు. స్టాక్స్ సహజంగా హెచ్చు తగ్గులకు గురవుతాయి. మరీ దగ్గరగా పెడితే, అనవసరంగా నష్టాలకు గురవుతారు.