Home

Telangana Budget 2021 Highlights: తెలంగాణ పద్దు – రూ.2,30,825.96 కోట్లు.. ఏ రంగానికి ఎంత..?

వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2021-22) సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తనకు ఈ గురుతల భాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి హరీశ్‌రావు

⍟ పన్నుల ఆదాయం అంచనా రూ.92,910 కోట్లు, పన్నేతర ఆదాయం అంచనా రూ.30,557.35 కోట్లు, గ్రాంట్ల అంచనా రూ. 38,6669.46కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాలు రూ. 13,990.13కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం అంచనా రూ. 12,500 కోట్లు, ఎక్సై్జ్ ఆదాయం రూ.17వేల కోట్లు, అమ్మకం పన్ను ఆదాయం అంచనా రూ. 26,500కోట్లు, వాహనాల పన్ను ఆదాయం అంచనా రూ.5వేల కోట్లు,

Samsung Galaxy M12 ఎందుకు కొనాలో తెలుసుకోవాలంటే ఈ 12 పాయింట్లు చదవండి

⍟ ఐటీ శాఖకు రూ. 360 కోట్లు, ఆర్టీసీ రూ.3వేల కోట్లు, హోమ్ శాఖకు రూ.6,465కోట్లు, ఆర్ అండ్ బీ శాఖకు రూ. 8,778 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణకు రూ.750కోట్లు, సాంస్కృతిక, పర్యాటక రంగానికి రూ.726కోట్లు, కొత్త సచివాలయానికి రూ.610కోట్లు, మండల, జిల్లా పరిషత్‌కు రూ.500 కోట్లు కేటాయింపు.

⍟ విద్యుత్ శాఖకు రూ.11,046 కోట్లు, పరిశ్రమల రాయితీకి రూ.2,500 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.3,077కోట్లు

⍟ పాఠశాల విద్య కోసం రూ. 11,735 కోట్లు కేటాయింపు. విద్యారంగ అభివృద్ధి కోసం రెండేళ్లలో రూ.4వేల కోట్లతో నూతన పథకం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ మౌలిక వసతుల ఏర్పాటు. బృహత్తర విద్యా పథకం కోసం ఈ ఏడాది రూ.2వేల కోట్లు కేటాయింపు. ఉన్నత విద్య కోసం రూ.1,873 కోట్లు,

⍟ హైదరాబాద్ మెట్రో రైల్ కోసం రూ.1000 కోట్ల కేటాయింపులు, ఔటర్ రింగ్‌ రోడ్డు లోపల కొత్త కాలనీల కోసం తాగునీటి సరఫరాకు రూ.250కోట్లు. వరంగల్ కార్పోరేషన్‌కు రూ.250కోట్లు, ఖమ్మం కార్పోరేషన్‌కు రూ.150కోట్లు, వైద్య,ఆరోగ్య శాఖకు రూ.6,295కోట్లు

⍟ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి రూ.11వేల కోట్లు, సొంత స్థలం కలిగిన పేదలకు రెండు పడక గదుల ఇళ్ల హామీ అమలుకు త్వరలోనే విధి విధానాలు.

⍟ పట్టణాల్లో సమీకృత మార్కెట నిర్మాణం కోసం రూ.500 కోట్లు, వైకుంఠ ధామాల కోసం రూ.200కోట్లు, నాగార్జున సాగర్ సమీపంలోని సుంకిశాల ద్వారా హైదరాబాద్‌ తాగునీటి ప్రాజెక్టుకు రూ.725 కోట్లు. మూసీ నది పునరుజ్జీవం కోసం రూ.200కోట్లు

⍟ ఎంబీసీ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు రూ.5,522కోట్లు. మైనార్టీ సంక్షేమ శాఖకు రూ.1,606 కోట్లు, మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.3వేల కోట్లు. మహిళా, శిశు సంక్షేమ శాఖకు రూ.1,702 కోట్ల కేటాయింపు. బీసీలకు కళ్యాణలక్షి పథకంలో భాగంగా అదనంగా రూ.500కోట్లు. నేతన్నల సంక్షేమం కోసం రూ.338కోట్లు . ఎస్సీ ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 21,306.85కోట్లు కేటాయింపు

⍟ ఆసరా ఫించన్ల కోసం రూ.11,728 కోట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబాకర్ పథకాల కోసం రూ.2,750కోట్లు, రైతు భీమా పథకం కోసం రూ.1,200 కోట్లు, ఎస్టీ గృహాలకు విద్యుత్ రాయితీ కోసం రూ.18కోట్లు, 3లక్షల గొర్రె యూనిట్ల కోసం రూ.3వేల కోట్ల కేటాయింపు. వ్యవసాయ శాఖకు రూ.25వేల కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ.1,730కోట్లు, నీటి పారుదల శాఖకు 16,931కోట్లు, సమగ్ర భూ సర్వేకు రూ.400కోట్లు

⍟ సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్‌కు రూ. వెయ్యి కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.1500కోట్లు కేటాయింపు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ నిధుల కింద రూ.5కోట్ల చొప్పున మొత్తం రూ.800 కోట్ల కేటాయింపు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.29,271కోట్లు కేటాయింపు. రైతు బంధు పథకానికి 14,800 కోట్లు, రుణమాఫీ కోసం రూ.5,225కోట్లు కేటాయింపు. పురపాలక శాఖకు రూ.15,030కోట్లు

⍟ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ప్రభుత్వం తీసుకున్న ప్రగతి శీల చర్యల వల్లే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందని హరీశ్‌రావు తెలిపారు. 2014-15లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.41 కోట్ల ఎకరాలు కాగా.. 2020-21లో అది 2.10 కోట్ల ఎకరాలకు పెరిగిందన్నారు. సాగు విస్తీర్ణం 49 శాతానికిపైగా పెరిగిందన్నారు.

⍟ ‘2019-20లో తెలంగాణలో 193 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. అందులో 111 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐ సేకరించింది. 2020 యాసంగిలో మన రాష్ట్రం ఎఫ్‌సీఐకి 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అందించింది. ఎఫ్‌సీఐ దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం ధాన్యంలో ఇది 56 శాతం’ అని హరీశ్‌రావు తెలిపారు.

⍟ ‘తెలంగాణ తలసరి ఆదాయం 2020-21కి గానూ రూ. 2 లక్షల 27 వేల 145గా ఉంటుందని కేంద్ర గణాంకాల శాఖ అంచనా. ఇది గత ఏడాది కంటే 0.6 శాతం ఎక్కువ. ఇదే సమయంలో దేశ తలసరి ఆదాయం రూ.1.27 లక్షలు మాత్రమే. ఇది గత ఏడాది కంటే 4.8 శాతం తగ్గింది. తెలంగాణ తలసరి ఆదాయం జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే రూ.99,377 అధికంగా ఉంది. దేశ తలసరి ఆదాయం తగ్గినా.. తెలంగాణ ఆదాయం పెరిగింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ తెలంగాణ పురోగతి మెరుగ్గా ఉంది. తెలంగాణ దేశంలో ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని అనడానికి ఇదో నిదర్శనం’ అని హరీశ్ రావు తెలిపారు.

⍟ వచ్చే ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ రూ.2,30,825,.96 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లు. ఆర్థిక లోటు అంచనా.. రూ.45,509.60 కోట్లు కాగా.. పెట్టుబడి వ్యయం రూ29,046.77 కోట్లు. రెవెన్యూ మిగులు రూ.6,743.5కోట్లు.

⍟ 2019లో 13.5 శాతం నుంచి 1.3 శాతానికి డీఎస్‌డీపీ వృద్ధి తగ్గింది. అయినా కేసీఆర్ ముందు చూపుతో చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల 2021లో ప్రాథమిక రంగం అంచనాలో 17.7 శాతం వృద్ధి నమోదు చేసింది. దేశ ఆదాయం తగ్గిన పరిస్థితుల్లోనూ తెలంగాణలో మంచి ఆదాయం ఉంది. తెలంగాణ ప్రబల శక్తిగా ఎదుగుతుందని చెప్పడానికి ఇది నిదర్శనం. గ్రామాల్లో పారిశుద్ధ్యం పెంపొందించేందుకు పల్లె ప్రగతి పేరుతో కార్యాచరణ ప్రకటించాం. ఇది గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చేసింది.

⍟ 2021లో స్థూల రాష్ట్రీయ దేశీయ ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం రూ.9 లక్షల 78 వేల 378 కోట్లు ఉంటుందని అంచనా. లాక్‌డౌన్ కారణంగా తెలంగాణ జీఎస్‌డీపీ 13.5 శాతం నుంచి 1.3 శాతానికి గణనీయంగా తగ్గింది. జాతీయ స్థాయితో పోలిస్తే.. రాష్ట్ర జీఎస్‌డీపీ మెరుగ్గా ఉంది. కరోనా సంక్షోభం తలెత్తినా.. మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తట్టుకొని నిలబడింది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల కారణంగా ప్రాథమిక రంగం 17.7 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది.

⍟ ఏడేళ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రం ఏడు పదుల వయసున్నరాష్ట్రాలతో పోటీపడి అభివృద్దిని పరుగులు పెడుతోందని హరీశ్‌రావు అన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తాము చేస్తున్న పాలనకు ప్రజలను నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ మద్దతు లభిస్తోందన్నారు. ప్రజల ఆకాంక్షలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. దేశంలో తెలంగాణ ప్రజల శక్తిగా ఎదుగుతోందన్నారు.

⍟ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. కరోనా సంక్షోభంతో విలవిలలాడుతున్న ప్రజలు ఈ బడ్జెట్‌పై చాలానే ఆశలు పెట్టుకున్నారు.

⍟ మంత్రి హరీశ్‌ రావు ఇవాళ ఉదయం 11.30 గంటలకు శాసన సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన జూబ్లీహిల్స్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో 2021-22 బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. ప్రజలందరికి మంచి జరగాలని, సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా పేదల సంక్షేమం కోసం, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేలా బడ్జెట్‌ను రూపొందించామని చెప్పారు.

⍟ వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2021-22) తెలంగాణ ప్రభుత్వం నేడు బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,914 కోట్ల పద్దును ప్రతిపాదించగా.. ఈ సారి 11 శాతం పైగా అంచనాలను పెంచుతూ సుమారు రూ.2.04 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నట్లు సమాచారం. రాష్ట్ర రాబడులపై పూర్తి విశ్వాసంతో ప్రభుత్వం ముందుకు వెళ్లనున్న ప్రభుత్వం సంక్షేమ రంగానికి భారీగా కేటాయింపులు చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ప్రగతి పద్దు 13 శాతం పైగా, నిర్వహణ పద్దు 10శాతం మేర పెరగనుంది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో ఉదయం 11.30 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు.

admin:
All Rights ReservedView Non-AMP Version