Home

ఒక ఆప్షన్ ను కొనడం అంటే నష్టపోయే ట్రేడింగ్ అని అందరూ చెబుతూ ఉంటే, ఎవరు ఆప్షన్స్ ను కొనుగోలు చేస్తారు?

Option trading

ఆప్షన్స్ కొనటం అంటే నష్టపోయే ట్రేడింగ్ అని ఎందుకంటారు?

ఇది తెలుసుకునేందుకు ముందు కొన్ని పదాలు తెలుసుకోవాలి:

చాంచల్యం (volatility): మార్కెట్లో పెద్ద కదలికలు (పైకో, కిందకో) వేగంగా రావటం

స్థిరత్వం (stability): మార్కెట్లు నెమ్మదిగా కదలటం (పైకో, కిందకో)

మార్కెట్లు ఎంత చంచలంగా కదలాడితే ఆప్షన్స్ కొని, అమ్మేవారికి అంత లాభం; అమ్మి, కొనేవారికి (షార్ట్ చేసేవారు) అంత నష్టం.

మార్కెట్లు ఎంత స్థిరంగా ఉంటే ఆప్షన్స్ కొని, అమ్మేవారికి అంత నష్టం; అమ్మి, కొనేవారికి అంత లాభం.

దీనికి కారణం ఆప్షన్స్‌కు ఉన్న కాలక్షీణత (Time Decay) లక్షణం.

ఏమిటీ కాలక్షీణత?

జనవరి 29న నిఫ్టీ 13650, నిఫ్టీ ఫిబ్రవరి 14500 CE ఆప్షన్ ధర 95.

ఫిబ్రవరి నెలాఖరుకు నిఫ్టీ 14500కు కిందే ఉంటుందనుకుందాం. అప్పుడు 14500 CE ఆప్షన్ ధర 0. నెలరోజుల్లో మార్కెట్ 14500 కంటే పైకి వెళ్ళలేదు కాబట్టి 14500, ఆపై స్ట్రైక్ ఉన్న కాల్ ఆప్షన్స్ అన్నీ 0 అయిపోతాయి. 14500, ఆకింద ఉన్న స్ట్రైక్ పుట్ ఆప్షన్స్ కూడా 0 అయిపోతాయి. ఇదే కాలక్షీణత.

ఈ కాలక్షీణత ఆప్షన్స్ షార్ట్ చేసేవారి ఆప్తమిత్రుడయితే ఆప్షన్స్ కొనేవారి బద్ధ శత్రువు.

ఉదాహరణ:

29 జనవరిన మార్కెట్లు మూతపడే సమయానికి నిఫ్టీ 13650 వద్ద ఉంటే నిఫ్టీ ఫిబ్రవరి 14500 CE ఆప్షన్ ధర 95 చొప్పున ఒక లాట్ కొనటానికి 7,125 రుపాయలు (95*75).

నిన్న ఫిబ్రవరి 5న మార్కెట్ మూతపడే సమయానికి నిఫ్టీ 14950 అయితే 14500 CE ఆప్షన్ ధర 580. చాంచల్యం ఎక్కువై కేవలం 5 రోజుల్లో నిఫ్టీ 1300 పాయింట్లు (దాదాపు 9%) పెరిగింది.

14500 CE ఆప్షన్ కొన్నవారి లాభం (580-95)*75 = 36,375 రుపాయలు. ఒకవేళ మార్కెట్ ఇంతగా పెరగకపోయుంటే గరిష్టంగా ఆ 7,125 రుపాయలే నష్టం. పరిమిత నష్టం, అపరిమిత లాభం.

ఇందుకే ఆప్షన్స్ కొనేవారికి కొదవ లేదు. 7,125 రుపాయలతో 36,375 రుపాయల లాభం ఎవరికి చేదు?

అదే నిఫ్టీ 14500 CE ఆప్షన్ 95 వద్ద షార్ట్ చేసి ఉంటే (అలా షార్ట్ చెయ్యటానికి అవసరమైన మూలధనం సుమారు 1,65,000 రుపాయలు) ఒక లాట్‌పై ఇప్పటికి 36,375 రుపాయల నష్టం.

అయినా సరే ధైర్యంగా నెలాఖరు వరకు అట్టిపెట్టుకుని, అప్పటికి నిఫ్టీ 14500కు కిందే ఉంటే 95*75 = 7,125 రుపాయల లాభం, ఎందుకంటే మార్కెట్ల స్థిరత్వం, చాంచల్య లేమి వల్ల 14500 CE విలువ 0 అవుతుంది. అపరిమిత నష్టం, పరిమిత లాభం.

మరి ఇటువంటి ఆప్షన్స్ ట్రేడింగ్ ఎవరు చెయ్యాలి?

ఇక్కడ షిప్ మెకానిక్ కథ తెలిసినదే అయినా మరొకసారి చెప్పుకుందాం.

ఒకానొక రోజు ఒక నౌకకు ఏదో సమస్య వచ్చి ఇంజను మొరాయించింది. నౌకా సిబ్బంది ఎన్నివిధాల ప్రయత్నించినా సమస్య ఏమిటో తెలియలేదు. అప్పుడు నౌక యజమాని ఒక ప్రసిద్ధ మెకానిక్‌ను పిలిపించారు.

ఆయన వచ్చి రెండు గంటలపాటు ఇంజనును పరిశీలించి, దానిపై ఒక చోట చిన్న సుత్తితో తట్టాడు. అంతే, ఇంజను పనిచెయ్యసాగింది.

మరుసటి రోజు మెకానిక్ 10,000 రుపాయలకు బిల్లు పంపాడు. చిన్న సుత్తితో తట్టినందుకు అంత బిల్లా అని కోపంతో వివరాలు రాసి పంపమని బిల్లు తిప్పి పంపాడు యజమాని. అప్పుడు మెకానిక్ రాసి పంపిన వివరం:

సుత్తితో తట్టినందుకు: 100 రుపాయలు

ఎక్కడ తట్టాలో తెలిసినందుకు: 9,900 రుపాయలు

ఆప్షన్స్ ట్రేడింగ్ సరళమే కానీ ఎప్పుడు, ఎక్కడ, ఏది ట్రేడ్ చెయ్యాలో తెలుసుకోవటం ముఖ్యం. అది తెలుసుకోకుండా ట్రేడ్ చేసేవారు చివరకు డబ్బు పోగొట్టుకుని, ట్రేడింగ్ అంటే జూదమే అని టముకేస్తూ నేర్చుకోవాలన్న కుతూహలం ఉన్నవారినీ హడలగొడతారు.

ఏ విద్య అయినా అభ్యసించనిదే ఆచరించకూడదన్నది ఇంగితజ్ఞానం.

ఆప్షన్స్ ని సాధారణంగా రిటైల్ ఇన్వెస్టర్లు/ట్రేడర్స్ కొనుగోలు చేస్తారు.

ఎక్కువ మంది నష్టపోతున్నా ఎందుకు కొంటారు? అనేది మీ ప్రశ్న…

ఫ్యూచర్స్ లో రిలయన్స్ ఒక కాంట్రాక్ట్ తీసుకోవాలని అనుకొంటే,సుమారుగా 2,60,000 రూపాయలు కావాలి.

అదే కాంట్రాక్ట్ 2000 కాల్ ఆప్షన్ కి 32000, పుట్ ఆప్షన్స్ కి 30000,నిన్నటి ధరల ప్రకారం, అవసరం అవుతాయి.

అందరూ అంత మొత్తం పెట్టి ఫ్యూచర్స్ పొజిషన్ తీసుకోలేరు కాబట్టి ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ తీసుకొంటారు.

ఇంకో ప్రయోజనం ఆప్షన్స్ లో ఏంటంటే, మనం చెల్లించిన ప్రీమియం కంటే 1 రూపాయ కూడా ఎక్కువ నష్టపోము.

అదే ఫ్యూచర్స్ లో అయితే ట్రెండ్ మనకు వ్యతిరేకంగా ఉన్నంత కాలం మనం మార్జిన్ మొత్తం maintain చేయడానికి మళ్ళీ డబ్బులు పెడుతూ ఉండాలి!

ఆప్షన్స్ ఖరీదు చేసే వారికి పైన ఉదహరించిన ప్రీమియం ఒక్కటే అడ్వాంటేజ్,మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ వారికి వ్యతిరేకంగా పని చేస్తాయి…ఉదాహరణకు గ్రీక్స్ అంటే వొలాటిలిటీ, theta లాంటివి.

గ్రీక్స్ వల్ల మనం అనుకొన్న దిశ లో మన షేర్ వెళ్లినా మనం నష్ట పోయే అవకాశాలు ఎక్కువ.

కానీ మనం అనుకొన్న దిశలో మూవ్మెంట్ త్వరగా వస్తే మాత్రం theta వల్ల జరిగిన నష్టం పోగా మనకి ఎన్నో రెట్లు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

లాటరి లానే ప్రాబబిలిటీ తక్కువే కానీ తక్కువ పెట్టుబడి పైన చాలా ఎక్కువ రిటర్న్స్ ,అదీ కొద్దీ సమయంలోనే అవకాశం చాలా మందిని ఆకర్శిస్తుంది.

admin:
All Rights ReservedView Non-AMP Version