Home

మ్యూచువల్ ఫండ్స్

mutual funds

మ్యూచువల్ ఫండ్స్ అంటే మార్కెట్ విషయంలో వృత్తిపరంగా నైపుణ్యం సాధించిన మదుపరులతో కూడిన సం స్థ నిర్వహించే పెట్టుబడుల శాఖ. మ్యూచువల్ ఫండ్స్ లో స్టాక్స్ ,బాండ్లు, సంస్థ స్వంతంగా నిర్వహించే సంయుక్త పెట్టుబడులు (అనేకమదుపరులతో కూడినవి). ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు షేర్స్ కొనుగోలు చేస్తే మీరు పెట్టుబడి పెట్టిన మూలధనాన్ని వారు మరే ఇతర సంస్థల్లోనై నా అధిక లాభాలు వచ్చే విధంగా స్టాక్స్ లో బాండ్ల లో మరేదైనా విధంగా కొనుగోలు రూపంలో పెట్టుబడి పెడతారు. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన పెట్టుబడికి వారు తమ షేర్ హోల్డర్ లకు నెలవారీ, త్రైమాసికంగా, ఆరు మాసాలకోమారు ప్రకారం డివిడెండ్ల రూపంలో లాభాలను పంపిణీ చేస్తారు
ఒక పరిశ్రమ గాని మార్కెట్ గాని మీరు ఊహించి న విధంగా లాభాలను ఆర్జించలేకపోవచ్చు. నష్టాల్లో కూరుకు పోవచ్చు. కాని చిన్నచిన్న మొత్తాలలో మూలధనాన్ని పెట్టుబడి పెట్టే చిన్న మదుపరులు తాము తమ నష్టాలను సాధ్యమైన రీతిలో తగ్గించుకునేందుకు మార్కెట్ లో అనుభవం గడించిన విశ్లేషకులు, వృత్తి నిపుణుల సలహాలు, సూచనల మేరకు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ విశ్లేషకులు తమ మదుపరులు పెట్టే పెట్టుబడిని ఒక పరిశ్రమ, ఒక మార్కెట్ లో కాక వివిధ రకాల కంపెనీలు, సెక్యూరిటీలలో చిన్న చిన్నమొత్తాల్లో పెట్టు బడి పెట్టే సలహాలిచ్చి మదుపరుల నష్టాలను తగ్గిస్తారు. అదే ఈ మ్యూచువల్ ఫండ్స్ వల్ల జరిగే వెసులుబాటుగా గుర్తించాలి. అయితే ఈవిధానంలో కూడ ప్రమాదముందని మదుపరులు గుర్తించాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిపుణుల సలహాలు ఆచరించినా, స్టాక్సు ధరతగ్గే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ప్రమాదమున్నప్పటికినీ భవిష్యత్ అవసరాలకు డబ్బును స్టాక్స్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం శ్రేయోదాయకం. మీరు స్టాక్స్ లో, మ్యూచువల్ ఫండ్ లో డబ్బును పెట్టుబడి పెట్టడంలో ఉన్న ప్రాధాన్యతను ముందే గమనించండి.

సంయుక్త పెట్టుబడులు ( మూలధనం లేదా నిధులు)

పరిచయం

మదుపరులకు (investors) వివిధ రకాలుగా పెట్టుబడులు పెట్టుకునేందుకు అనువైన పద్ధతులు లేదా మార్గాలు (avenues) అందుబాటులోకి వచ్చాయి లేదా ఉన్నాయి. మదుపరులకు సంయుక్త పెట్టుబడులు ( Mutual Funds) పద్ధతిలో తమ యొక్క పెట్టుబడులు పెట్టుకునేందుకు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. మదుపరులు తాము పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకొనే సమయంలో వివిధ రకాల పత్రాలలో (instruments)తాము చెల్లించవలసిన పన్నులను సర్దుబాటు చేసేందుకు ఆ పెట్టుబడులలో ఉన్న నష్టాలు( risks) మరియు వాటిలో వచ్చే లాభాలను బేరీజు వేసుకోవాలి. పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకునే సమయంలో మదుపరులు, నిపుణులు మరియు సలహాదారుల సలహాలను తీసుకోవాలి. వీటితో బాటు మ్యూచువల్ ఫండ్స్ పథకాల యొక్క ఏజెంట్లు మరియు పంపిణీదారుల సలహాలు కూడ తీసుకోవాలి.

సంయుక్త పెట్టుబడులు ఏ విధంగా పనిచేస్తాయో మదుపరులకు అవగాహన కల్పించే నిమిత్తం ఈ పత్రంలో ప్రశ్నలు – సమాధానాల రూపంలో సమాచారాన్ని అందించే ప్రయత్నం జరిగింది. మదుపరులు తమ పెట్టుబడులు లేదా మదుపు నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారం తోడ్పడుతుంది.

సంయుక్త పెట్టుబడులు (మ్యూచువల్ ఫండ్స్) అంటే ఏమిటి ?

మదుపరులకు వాటాలు (యూనిట్లు) జారీ చేసి తద్వారా ఆర్ధిక వనరులను (resources) సమీకరించుకునే ప్రక్రియనే మ్యూచువల్ ఫండ్ అని అంటారు. అలా సమీకరించిన ఫండ్స్ ను తాము ప్రకటించిన పత్రంలో చెప్పిన విధంగా తమ లక్ష్యసాధనగా సెక్యూరిటీస్ లో మదుపు చేస్తారు.

సెక్యూరిటీస్ లో మదుపు చేయడం అనగా ఈ పెట్టుబడులను వివిధ రంగాలలోని విస్తరించిన పరిశ్రమల్లో వేరువేరుగా పెట్టుబడి పెట్టి నష్టాల స్థాయిని తగ్గించడమే అని పేర్కొనాలి. ఒకే సమయంలో, ఒకే విధంగా (నిష్పత్తిలో) ఒకే దిశలో అన్ని స్టాకుల పనితీరు ఉండదు, కనుక నష్టాల తగ్గుదలలో చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అన్ని రంగాల్లోని అన్ని పరిశ్రమలు ఒకే విధంగా ఉండవు కాబట్టి (Diversification) మ్యూచువల్ ఫండ్స్ తమయొక్క మదుపు చేసిన సొమ్ము విలువకు తగిన వాటాలు (యూనిట్లను) జారీ చేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ లోని మదుపరులను యూనిట్ హోల్డర్స్(వాటా దారులు) అంటారు.

మదుపరులు తాము మదుపు చేసిన సొమ్ముకు దామాషా (proportion) పద్ధతిలో లాభాలు లేదా నష్టాలు పొందుతారు. కాలానుగుణంగా (time to time) మ్యూచువల్ ఫండ్స్ వివిధ రకాల లక్ష్యాలతో వివిధ పరిధుల్లో తమ పెట్టుబడులు పెడుతున్నట్టు సాధారణంగా ప్రకటిస్తూ ప్రారంభిస్తాయి. ప్రతి మ్యూచువల్ ఫండ్ భారత సెక్యూరిటీస్ మరియు మారక సంస్థ (securities and exchange board of India)లో తప్పక నమోదు చేసుకుని ఉండాలి. ప్రజల నుంచి సేకరించిన సొమ్మును మ్యూచువల్ ఫండ్స్ సెక్యూరిటీస్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే ముందు ఆ సెక్యూరిటీస్ మార్కెట్ ను నియంత్రించే ఈ సంస్థ తన పేరు నమోదుచేసుకోవడానికి కారణం అదే.

భారత దేశంలోని మ్యూచువల్ ఫండ్స్ చరిత్ర ఏమిటి ? మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో సెబి(SEBI) పాత్ర ఏమిటి ?

1963 వ సంవత్సరంలో భారత దేశంలో మొట్టమొదటగా యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సంస్థ మ్యూచువల్ ఫండ్ ను ఏర్పాటు చేసింది. 1990వ సంవత్సర ప్రారంభంలో, భారత ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలయిన బ్యాంకులు, తదితర సంస్థలు (LIC) వంటివి మ్యూచువల్ ఫండ్స్ ను ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది.

1992 వ సంవత్సరంలో భారత సెక్యూరిటీస్ మరియు మారక సంస్థ (securities and exchange board of India) చట్టం అమలులోకి వచ్చింది. సెబి(SEBI- securities and exchange board of India) ఉద్దేశం యేమిటంటే – సెక్యూరిటీస్ లో పెట్టుబడి పెట్టే మదుపరుల ఆర్ధిక శ్రేయస్సు అలాగే సెక్యూరిటీస్ మార్కెట్ ను అభివృద్ధి పరచడం మరియు నియంత్రించడమూ, మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించినంతవరకు – మదుపరుల డబ్బుకు భద్రత కల్పిస్తూ వారి శ్రేయస్సుకు పాటుపడడం, మ్యూచువల్ ఫండ్స్ ను నియంత్రించే విధివిధానాలను రూపొందించడం సెబి (SEBI) కర్తవ్యం లేదా విధి. 1993 వ సంవత్సరములో సెబి (SEBI) నియమ నిబంధనలను ప్రకటించింది. ఆ తర్వాత ప్రైవేటు రంగ సంస్ధలు కూడా మ్యూచువల్ ఫండ్స్ ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఆ విధంగా క్యేపిటల్ మార్కెట్ లో ప్రైవేటు భాగస్వామ్యము కూడా ప్రారంభమైంది. 1996 వ సంవత్సరములో నియమ నిబంధనలన్నీ పూర్తిగా సవరించబడ్డాయి. క్రమేపీ (Time to time) ఆ నియమ నిబంధనలు సవరింపబడుతూ ఉన్నాయి. మదుపరుల శ్రేయస్సును దృష్టిలో వుంచుకొని సెబి క్రమేపీ మ్యూచువల్ ఫండ్స్ కు మార్గదర్శక సూత్రాలను కూడా జారీ చేస్తోంది.

ప్రభుత్వ రంగ లేదా ప్రైవేటు రంగ సంస్ధలు ప్రారంభించిన మ్యూచువల్ ఫండ్స్ గాని లేదా విదేశీ సంస్ధలచే అభివృద్ది చేయబడుతున్న మ్యూచువల్ ఫండ్స్ గాని అవే నియమ నిబంధనలకు లోబడి నియంత్రించబడతాయి. వీటిలో వేటికీ భేదభావం చూపకుండా సెబి ఈ నియమ నిబంధనలను మ్యూచువల్ ఫండ్స్ కు వర్తింపచేస్తూ, పర్యవేక్షిస్తుంది. ఈ సంస్ధలు అందిస్తున్న మ్యూచువల్ ఫండ్స్ పధకాలన్నింటికి సంబంధిం చిన నష్టాలు ఒకే రీతిలో వుంటాయి.

మ్యూచువల్ ఫండ్స్ ఏ విధంగా ఏర్పాటు చేస్తారు?

మ్యూచువల్ ఫండ్స్ ను ఒక ట్రస్ట్ రూపంలో ఏర్పాటు చేస్తారు. ఈ ట్రస్ట్ లో హామీదారు లేదా పూచీపడువారు లేదా ఏర్పరచువారు (sponsor), ట్రస్టీలు, ఆస్తులు నిర్వహించే కంపెనీ (Asset Management Company –AMC) మరియు సంరక్షకుడు (Custodian) వుంటారు. ఈ ట్రస్ట్ ను ఒక పూచీదారు కాని అంతకంటే ఎక్కువ పూచీదారులు కాని ఏర్పాటు చేస్తారు. వారినే సంస్థ ప్రవర్ధకులు (promoter)అని అంటారు. మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఆస్తులకు జవాబుదారులుగా ధర్మకర్త (ట్రస్టీ)లు ఉంటారు. వీరు యూనిట్ హోల్డర్ల యొక్క శ్రేయస్సు కోసం నియమింపబడతారు. సెబి చే అనుమతి పొందిన ఆస్తులు నిర్వహించే కంపెనీ (Asset Management Company –AMC) మ్యూచువల్ ఫండ్స్ ను ఏ ఏ రకాల సెక్యూరిటీస్ లో మదుపు చేయాలో నిర్ణయించి అమలు చేస్తుంది. సెబితో నమోదు చేసుకున్న సంరక్షకుడు (custodian) , వివిధ రకాల పథకాలలో వున్న ఫండ్ సెక్యూరిటీలను తన అధీనంలో ఉంచి కాపాడుతుంటాడు. ఎఎమ్ సి పై ధర్మకర్త (ట్రస్టీ)లకు పర్యవేక్షణ చేసే అధికారం ఉంటుంది. ఆదేశాలిచ్చే అధికారం కూడా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ సెబి యొక్క నియమనిబంధనలను పాటిస్తున్నదీ లేనిదీ అలాగే ఆ ఫండ్ పనితీరునూ పర్యవేక్షిస్తుంది.

ట్రస్ట్ యొక్క డైరెక్టర్ లలో మూడవ వంతు లేదా ట్రస్ట్ బోర్డ్ లో మూడవ వంతు ధర్మకర్త లు (ట్రస్టీలు) స్వతంత్రులై ఉండాలనే నియమనిబంధన ఉంది. ఆ నియమ నిబంధనలకనుగుణంగా ఈ మూడవ వంతు ట్రస్టీలు పూచీదారులతో (స్పాన్సర్స్) ఎటువంటి సంబంధము లేనివారై ఉండాలి. అలాగే ఎ ఎమ్ సి లోని సగం మంది డైరెక్టర్ లు కూడ స్వతంత్రులై ఉండాలి. ఏ పథకమైనను ప్రారంభించేముందు (అమలులోకి తెచ్చే ముందు) అన్ని మ్యూచువల్ ఫండ్స్ సెబితో నమోదు చేసుకుని ఉండాలి.

ఒక పథకం యొక్క నికర ఆస్తుల విలువ అంటే అర్ధం ఏమిటి?

ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క ప్రత్యేక లేదా నిర్ధిష్ట పథకం పనితీరు ఆ నికర ఆస్తుల విలువ (NAV) ద్వారా కనుగొంటారు.

మదుపరుల నుండి సేకరించిన సొమ్మును సెక్యూరిటీస్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ మదుపు చేస్తాయి. అర్ధమయ్యేరీతిలో చెప్పాలంటే, ఒక పథకం యొక్క సెక్యూరిటీస్ మార్కెట్ విలువే ఆ పథకం యొక్క నికర ఆస్తి విలువ(NAV). సెక్యూరిటీస్ మార్కెట్ విలువ ప్రతీరోజు మార్పు చెందడం వల్ల పథకం యొక్క NAVకూడా రోజువారీగా మారుతుంటుంది. పేర్కొన్న రోజుకు ఒక యూనిట్ యొక్క ఎన్ఎవి ఎంత అంటే ఆ యూనిట్ కలిగిన పథకం యొక్క సెక్యూరిటీస్ మార్కెట్ విలువను ఆ పథకంలో గల మొత్తం యూనిట్ల సంఖ్యలో భాగించగా వచ్చిన ఫలితమేనని చెప్పాలి. ఉదాహరణకు ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలోగల సెక్యూరిటీస్ మార్కెట్ విలువ 200 లక్షల రూపాయలు అనుకుంటే ఆ మ్యూచువల్ ఫండ్ 10 లక్షల యూనిట్లను మదుపరులకు యూనిట్ 10 రూపాయల చొప్పున జారీ చేసి ఉంటే ఆ ఫండ్ యొక్క ఒక యూనిట్ ఎన్ఎవి 20 రూపాయలుఅని చెప్పాలి. మ్యూచువల్ ఫండ్స్ తమ యొక్క పథకం ఎన్ఎవిని రోజువారీగాగాని, వారానికొకసారి గాని పథకం యొక్క లక్షణాన్ని బట్టి ప్రకటించవలసి ఉంటుంది.

వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ పథకాలేమిటి?

పరిపక్వత సమయాన్ని అనుసరించి పధకాలు

ఒక మ్యూచువల్ ఫండ్ పధకం కాల పరిమితి లేనిది లేక కాల పరిమితికి లోబడినది అని విభజించాలంటే దాని పరిణితి ద్వారా నిర్ధారించాలి.

కాల పరిమితి లేని ఫండ్ / పధకం

ఒక కాల పరిమితి లేని ఫండ్ / పధకం అని చెప్పాలంటే ఆ పధకం ఎల్లప్పుడూ సొమ్ము సేకరిస్తూ, చెల్లిస్తూ తిరిగి చెల్లించిన వాటాలను కొనుగోలు చేస్తూ నిరంతర ప్రక్రియగా సాగిస్తూ ఉంటే దానిని కాల పరిమితి లేని ఫండ్ / పధకం అంటారు. ఈ పధకాలకు స్ధిరమైన పరిపక్వత సమయం అంటూ ఏమీ వుండదు. మదుపరులు తమ అనుకూలత ప్రకారం వాటాల కొనుగోలు మరియు అమ్మకాలు రోజువారీ ఎన్ఎవి (N A V) ఆధారంగా చేసుకోవచ్చు. ఈ పధకం ముఖ్యలక్షణం మదుపరుల వాటాలకు ద్రవ్యత్వం (liquidity) అనగా నగదు పొందడం లేదా ఇవ్వడం సులభం.

కాల పరిమితి గల ఫండ్ / పధకం

ఒక కాల పరిమితి గల ఫండ్/ పధకానికి పరిపక్వత సమయం నిర్ణయించబడి వుంటుంది. ఉదా:5– 7 సంవత్సరములు. ఈ పధకం ప్రారంభంలో కొంత కాలం గడువు ఇస్తారు. ఈ సమయంలో దీనిలో మదుపరులు పెట్టుబడులు పెట్టడానికి / వాటాలు కొనుగోలు చేయడానికి తెరిచి వుంటుంది. మదుపుదారులు ఈ పధకం తెరిచి వుంచిన కాలంలో కాని లేదా పట్టావినిమయం (Stock Exchange) లో పొందుపరచిన పట్టిక నుండి కాని వాటాలను కొనుగోలు చేయవచ్చు. మదుపరులు ఈ పధకం నుండి తప్పుకొనుటకు వీలుగా కొన్ని కాల పరిమితి గల ఫండ్ / పధకంలో వాటాలను ఎన్ ఎ వి (N A V) ధరల ఆధారంగా తిరిగి అమ్ముకునే వీలుకల్పిస్తూ మ్యూచువల్ ఫండ్ లు తిరిగి కొనుగోలు చేస్తాయి. సాధారణంగా ఈ మ్యూచువల్ ఫండ్ లు ఎన్ ఎ వి (N A V) ధరలను వారం వారం ప్రకటిస్తారు.

పెట్టుబడి ఉద్దేశంతో ఏర్పాటు చేసే పధకాలు

ఒక పథకం అభివృద్ధి పథకంగా కూడా విభజించవచ్చు. ఆదాయ పథకం లేదా మదుపు చేసే ఉద్దేశం కల్గిన సమతౌల్య పథకంగా కూడా విభజించవచ్చు. ఈ పథకం కాల పరిమితి లేని ఫండ్ / పథకం లేదా కాల పరిమితి గల ఫండ్ పథకాలుగా ఇదివరకే వివరించడం జరిగింది. ఈ పథకాలన్నింటిని ఈ కింద పేర్కొన్న విధంగా విభజించవచ్చు.

అభివృద్ధి / ఈక్విటీ ఆధారిత పథకం

అభివృద్ధి పథకం ముఖ్య లక్షణం యేమిటంటే పెట్టిన మూలధనం విలువ పెరగడం. మధ్య తరహా నుంచి దీర్ఘకాలం సమయంలో దీని విలువ పెరుగుతుంది. ఈ పథకాల్లో మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా తమ మూలనిధిలోని ఎక్కువ భాగం ఈక్విటీలుగా మదుపు(పెట్టుబడిగా పెడతారు) చేస్తారు. ఈ ఫండ్స్ లో నష్టాలను పోల్చి చూస్తే అధికంగా ఉంటాయి. ఈ పథకాలు మదుపరులకు వివిధ రకాల ఐచ్చికాలను కల్పిస్తాయి. డివిడెండ్ ఆప్షన్ , మూలధనం పెరగడం వంటి ఐచ్చికాల వంటివి కల్పిస్తాయి. మదుపరుల ప్రాముఖ్యతను బట్టి తమకనువైన ఐచ్చికాలను పేర్కొనవలసి ఉంటుంరది. తర్వాత కాలంలో మదుపరులు తమ ఐచ్చికాలను మార్చుకునే వీలును మ్యూచువల్ ఫండ్స్ కల్పిస్తాయి లేదా అనుమతినిస్తాయి. అభివృద్ధి పథకాలు మదుపరులకు దీర్ఘకాలిక ప్రయోజనం కల్పిస్తాయి. దీర్ఘకాలంలో మదుపరులకు తాము పెట్టిన పెట్టుబడుల మూలధనం విలువ పెరిగే రీతిలో ఉంటాయి.

ఆదాయం / డెబ్ట్ ఆధారిత పథకం

మదుపరులకు క్రమబద్ధమైన రీతిలో నిర్దిష్టమైన ఆదాయం కల్పించడం ఆదాయం ఫండ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకంలో చేసే మదుపును స్థిరమైన ఆదాయం ఇచ్చే సెక్యూరిటీలు అనగా బాండ్లు, కంపెనీల డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు మరియు మనీ మార్కెట్ పత్రాలలో మదుపుగా చేస్తారు. ఈ ఫండ్స్ లో చేసే మదుపు ఈక్విటీ పథకాల్లో చేసే మదుపుతో వచ్చే నష్టాలలో పోల్చి చూస్తే కొంత తక్కువనే చెప్పాలి. ఈక్విటీ మార్కెట్లలో వచ్చే (హెచ్చుతగ్గుల ) మార్పుల ప్రభావం ఈ ఫండ్స్ పై ఉండదు. ఈ పథకాలలో మూలధనం విలువ పెరుగుదల కూడా పరిమితంగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫండ్స్ లోని ఎన్ఎవిలు దేశంలోని వడ్డీరేట్లలొ వచ్చే మార్పులకనుగుణంగా వుంటాయి. వడ్డీరేట్లు తగ్గిపోయినచో ఈ ఫండ్స్ యొక్క ఎన్ఎవిలు తక్కువ వ్యవధికి పెరగవచ్చు. అలాగే పెరిగినచో ఎన్ఎవిలు తగ్గిపోవచ్చు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే మదుపరులు ఈ హెచ్చుతగ్గుల మార్పుల గురించి ఆందోళన చెందకపోవచ్చు

బ్యాలెన్స్ డ్ ఫండ్

అభివృద్ధి మరియు క్రమబద్ధమైన ఆదాయం మదుపరులకు కల్పించడం బ్యాలెన్స్ డ్ ఫండ్ ల యొక్క ముఖ్యోద్దేశం. ఈ ఫండ్స్ లోని పథకాలలోను ఈక్విటీలలోను మరియు స్థిరమైన ఆదాయం కల్పించే సెక్యూరిటీలలోను తమ ప్రకటన పత్రాలలో పేర్కొన్న రీతిలో దామాషా పద్ధతిలో మదుపును చేస్తారు. తగినంత అభివృద్ది ఉంటే చాలన్న మదుపరులకు ఈ ఫండ్స్ లోని పథకాలు అనువైనవిగా ఉంటాయి. వీరు సాధారణంగా ఈక్విటీ మరియు డెబ్ట్ సాధనాలలో 40-60% వరకు మదుపు చేస్తారు. స్టాకు మార్కెట్లలోని షేర్ల ధరలలో వచ్చే హెచ్చు తగ్గు మార్పులు ఈ ఫండ్స్ పై ప్రభావం కల్గిస్తాయి. పూర్తి ఈక్విటీ ఫండ్స్ తో పోలిస్తే ఈ ఫండ్స్ లో ఎన్ఎవిల తీవ్రత కొంత మేరకు తక్కువ స్థాయిలోనే ఉంటుంది

మనీ మార్కెట్ లేదా ద్రవ్యశీలత ఫండ్స (అతి త్వరగా నగదు రూపంలో మార్చుకునే ఫండ్)

ఈ ఫండ్స్ కూడా ఆదాయం ఇచ్చేవి. వీటి ముఖ్యోద్దేశం ఏమిటంటే మూలధనాన్నిభద్రపరచడం, త్వరగా నగదుగా మార్చుకునే సౌకర్యం మరియు తగినంత (మిత) ఆదాయం కల్పించడం. ఈ పథకాలన్నీ సురక్షితమైన స్వల్ప కాల వ్యవధితో కూడిన ట్రెజరీ బిల్లులు, డిపాజిట్ల సర్టిఫికెట్లు, వ్యాపార లావాదేవీల పత్రాలు (commercial papers), అంతర బ్యాంకుల కాల్ మనీ (inter- bank call money), ప్రభుత్వ సెక్యూరిటీలు మొదలైన వాటిల్లో మాత్రమే మదుపు చేస్తాయి.

గిల్ట్ ఫండ్

ఈ ఫండ్ ప్రభుత్వ సెక్యూరిటీలలో మాత్రమే మదుపు చేస్తాయి. ప్రభుత్వ సెక్యూరిటీలు తిరిగి చెల్లించవన్న అపనమ్మకం ఉండదు. అయితే ఈ పథకాల ఎన్ఎవిలు వడ్డీ రేట్లు మారుతున్నప్పుడల్లా హెచ్చుతగ్గులతో మార్పు చెందుతాయి. అలాగే ఆర్ధిక కారణాల వలన కూడా మారుతాయి. ఎలాగంటే ఆదాయ లేదా డెట్ ఆధారిత పథకాలు ఎలా మారుతాయో ఆ విధంగానే మారుతాయి.

ఇండెక్స్ ఫండ్

ఇండెక్స్ ఫండ్ ఒక ప్రత్యేక సూచిక (పట్టిక) లో పేర్కొన్న రీతిని ప్రతిబింబిస్తాయి. అంటే బిఎస్ ఇ సెన్సిటివ్ ఇండెక్స్ (BSE sensitive index), ఎస్ &పిఎన్ ఎస్ ఇ 50 ఇండెక్స్(S&P NSE50index(Nifty), మొదలైన వాటిలాగానే ఉంటాయి. ఈ పథకాలు ఒక సూచికలో పేర్కొన్న వాటికి గుర్తింపునిస్తూ వాటి సెక్యూరిటీల్లో మదుపు చేస్తాయి. ఈ పథకాల్లో ఎన్ ఎవిలు ఆ సూచికలో పేర్కొన్న సెక్యూరిటీల విలువ మెరుగుదల, తగ్గుదల ఆధారంగా హెచ్చుతగ్గులుగా ఉంటాయి. అయితే ఎప్పుడు ఎన్ ఎవిలు హెచ్చుతగ్గుల శాతం ఆ ఇండెక్స్ లలో ఉండనక్కరలేదు. ఎందుకంటే సాంకేతిక పరిభాషలో ట్రాకింగ్ ఎర్రర్(tracking error)అనే కారణం వల్ల ఆ హెచ్చుతగ్గుల శాతం ఇండెక్స్ ల పెరుగుదల తగ్గుదలలాగ ఉండనక్కరలేదు. ఈ అంశం గురించి అవసరమైన బహిరంగ ప్రకటనలు మ్యూచువల్ ఫండ్స్ పథకాల అమ్మకపు ఆహ్వాన (offer) పత్రంలో పేర్కొనడం జరుగుతుంది.

ఈ ఫండ్స్ మార్పిడి వ్యాపార ఇండెక్స్ ఫండ్స్ కూడాను (exchange traded index funds). ఈ ఫండ్స్ స్టాక్ ఎక్స్ చేంజ్ (stock exchange) ల మీదుగా వ్యాపారం చేసుకునేలాగా మ్యూచువల్ ఫండ్స్ ప్రారంభిస్తాయి.

సెక్టార్ స్పెసిఫిక్ ఫండ్స్/పథకాలు అంటే ఏమిటి?

అమ్మకపు ఆహ్వాన పత్రాలలో పేర్కొన్నట్టు ఆయా రంగాలు లేదా పరిశ్రమల్లో మాత్రమే ఉన్న సెక్యూరిటీలలో మదుపుచేసే నిధులు లేదా పథకాలను సెక్టార్ స్పెసిఫిక్ ఫండ్స్ /పథకాలు అంటారు. ఉదాహరణకు ఫార్మాస్యుటికల్స్ (మందుల తయారీ పరిశ్రమ, సాఫ్ట్ వేర్ , ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (Fast moving consumer goods- FMGG), పెట్రోలియమ్ స్టాక్ లు మొదలైనవి ఈ ఫండ్ల మీద వచ్చే లాభాలు ఆయా రంగాలు/ పరిశ్రమలు పనితనం మీద ఆధారపడి ఉంటాయి. ఈ ఫండ్ల మీద వచ్చే అధిక లాభాలు డైవర్శిఫైడ్ ఫండ్స్(అనేక రకాలుగా ఫండ్స్ ను పెట్టుబడులు పెట్టే ఫండ్స్- diversified funds) తో పోలిస్తే అధిక రీతిలో (సాహసం తో కూడినవి లేదా అపాయకరమైనవి-risky) గా ఉంటాయి. మదుపరులు ఈ ఫండ్స్ పెట్టుబడి పెట్టే రంగాలు/ పరిశ్రమల యొక్క పనితనం (సామర్ధ్యం) పై దృష్టి పెట్టుకోవలసిన అవసరముంది. సమయానుకూలంగా ఈ ఫండ్స్ నుంచి వైదొలగవలసి ఉంటుంది. ఈ విషయంలో వారు నిపుణుల సలహాలు పాటించడం మంచిది. 

టాక్స్ సేవింగ్ (పన్ను ఆదా) పథకాలు అంటే ఏమిటి?

ఈ పథకాలు పన్ను రాయితీలను కల్పిస్తూ మదుపరుల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తాయి. ఈ పన్ను రాయితీలు 1961 వ సంవత్సరంలో అమలులోకి వచ్చిన ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న కొన్ని ప్రత్యేక అధికరణ (provisions) లకు లోబడి ఇవ్వబడతాయి. ఈ పథకాలలో ప్రభుత్వం పన్ను రాయితీలు మదుపరులకు కల్పించడానికి అనుమతినిచ్చింది. ఉదాహరణకు ఈక్విటీ జోడిత సేవింగ్స్ స్కీములు (Equity Linked Savings Schemes-ELSS) వంటివి. పొదుపు పథకాల మ్యూచువల్ ఫండ్స్ కు పన్ను రాయితీలు కల్పిస్తూ ప్రారంభించిన పెన్షన్ పథకాలు కూడా ఇటువంటివే. ఈ పథకాలు అభివృద్ధి సాధన మరియు ఈక్విటిల్లో మదుపుకు ప్రాబల్యం కల్పిస్తూ ఉండేవిగా ఉంటాయి. ఈ పథకాల అభివృద్ధి అవకాశాలు మరియు అపాయకరమైన సాహసాలతో(risky) కూడి ఈక్విటీ ఆధారిత పథకాలలాగానే ఉంటాయి. 

ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకం అంటే ఏమిటి?

ఈ పథకం ప్రాథమికంగా తన మ్యూచువల్ ఫండ్స్ లోని ఇతర పథకాలలోగాని లేదా మరే ఇతర మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో కాని మదుపు చేస్తే దానిని ఎఫ్ఒఎఫ్ (FOF) పథకం అని అంటారు. ఒకే పథకంలో మదుపరులు ఎక్కువ విధాలుగా(diversification)పెట్టుబడులు పెట్టుకునేందుకు ఈ ఎఫ్ఒఎఫ్(FOF) పథకం ఎంతో ఉపకరిస్తుంది. ఈ పథకం విస్తృతంగా రిస్క్( సాహసంతో కూడిన అపాయకరమైన) పరిస్థితులను వివిధరకాలుగా విస్తరిస్తుంది.

లోడ్ లేదా నో లోడ్ ఫండ్స్(Load/ No Load funds)అంటే ఏమిటి?

ఒక పథకంలో నుంచి వెలుపలికి రావడానికి , లేదా అందులో చేరడానికి ఎన్ ఎవిలో కొంత శాతం చార్జీలను వసూలు చేసే పథకాన్ని లోడ్ ఫండ్ అంటారు. అంటే ఈ ఫండ్స్ లో వాటా (యూనిట్లు) కొనుగోలుకు లేదా అమ్మకం చేసే ప్రతి ఒక్కనికి కొంత చార్జీలు చెల్లించవలసి ఉంటుంది. ఈ చార్జీలను మ్యూచువల్ ఫండ్స్ మార్కెటింగ్ మరియు పంపిణీ ఖర్చులుగా ఉపయోగిస్తాయి. ఉదాహరణకు ఒక వాటా ఎన్ఎవి పదిరూపాయలుకాగా ఈ పథకంలో చేరడానికి లేదా వెలుపలికి రావడానికి లోడ్ చార్జీలుగా 1 శాతం వసూలు చేస్తారు. అప్పుడు యూనిట్లు (వాటా) కొనుగోలు చేసే మదుపరులు 10 రూపాయలకు 10 పైసలు లోడ్ చార్జీలు చెల్లించాలి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కు తమ యూనిట్లను తిరిగి కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించే మదుపరులు 9 రూపాయలకు 90 పైసలు ప్రతీ ఒక్క యూనిట్ కు పొందుతారు. కాబట్టి మదుపరులు మదుపు చేసే సమయంలో ఈ లోడ్ చార్జీలను పరిగణనలోనికి తీసుకుని తమకు వచ్చే లాభాలు / ఆదాయం పై వీటి ప్రభావం ఉంటుందన్న అవగాహన కల్పించుకోవాలి. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్స్ అందించే సేవా ప్రమాణాలు ( Service Standards) మరియు పనితనం యొక్క ఫలితాలు (రికార్డు) పరిగణించడం కూడా అతి ముఖ్యం. లోడ్ లు ఉన్నప్పటికీ సమర్ధత కలిగిన ఫండ్స్ ఎక్కువ లాభాలు ఇచ్చేవిగా ఉంటాయి.

నో లోడ్ ఫండ్ (no load fund) అంటే ఆ ఫండ్ లోని పథకాల్లోంచి వెలుపలికి రావడానికి లేదా చేరడానికి ఎటువంటి చార్జీలు వసూలు చేయని ఫండ్ అని అర్ధం . అంటే ఈ ఫండ్ లోని పథకాల్లో చేరడానికి మదుపరులు ఎన్ఎవి ధర మీద చేరవచ్చు. అంటే మదుపరులు కొనుగోలు లేదా అమ్మకం చేసే వాటాలపై (యూనిట్లపై) ఎటువంటి అదనపు చార్జీలు చెల్లించనక్కరలేదు.

అమ్మకపు ఆహ్వాన పత్రాలల్లో పేర్కొన్న స్థాయికి మించి లోడ్ ను హెచ్చించి కాని లేదా సరికొత్త లోడ్ కు కాని మ్యూచువల్ ఫండ్ వసూలు చేయవచ్చా?

అమ్మకపు ఆహ్వాన పత్రంలో పేర్కొన్న స్థాయికి మించి లోడ్ ను మ్యూచువల్ ఫండ్ పెంచకూడదు. ఏమైనా మార్పు చేయదలిస్తే కొత్తగా చేసే పెట్టుబడులకు మాత్రం ఆ మార్పులు వర్తిస్తాయి తప్ప అసలు పెట్టుబడులకు వర్తించవు. కొత్త లోడ్ లు వసూలు చేయడం కాని లేదా ఉన్న(గత) లోడ్ లను పెంచడం కాని చేయదలిస్తే మ్యూచువల్ ఫండ్స్ అమ్మకపు ఆహ్వానపత్రాలలో తగిన సవరణలు చేయాలి. ఈ విధానం వల్ల కొత్త మదుపరులు తాము మదుపు చేసే సమయంలో ఈ లోడ్ లను గురించి అవగాహన కల్గి ఉంటారు.

లాభాల హామీ ఇచ్చే పథకం అంటే ఏమిటి?

లాభాలు హామీ ఇచ్చే పథకాలు అంటే పథకం పనితనంతో సంబంధం లేకుండా వాటాదారుల (యూనిట్ హోల్డర్ల)కు నిర్ధిష్ట లాభాలు హామీ ఇచ్చి ఆ లాభాలను చెల్లించే పథకాలను హామీ లాభాల పథకమని అంటారు.

మదుపరులు ఆహ్వాన పత్రాన్ని క్షుణ్ణంగా చదివి ఈ లాభాలు పథకం వర్తించే పూర్తి సమయం(గడువు)కు ఇవ్వబడతాయి. లేదా కొంత సమయానికి (కొన్నాళ్ళకు) ఇవ్వబడతాయా అని తెలుసుకోవాలి. కొన్ని పథకాలు ఒక సంవత్సరానికి ఒక దఫా మాత్రమే లాభాలు ఇస్తామని హామీ ఇస్తాయి. ఈ పథకాలు పునః సమీక్షించి మరుసటి సంవత్సరం ప్రారంభంలో మార్పులు చేస్తాయి.

మదుపరుల నిధులను (సొమ్మును) పెట్టుబడి పెట్టి విస్తరించే సమయంలో మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల కేటాయింపును మార్చుకోవచ్చా?

మార్కెట్ పంధాను పరిగణించి, దూరదృష్టి కల్గిన నిర్వాహకులు ఆస్తుల కేటాయింపును మార్చుకోవచ్చు. అమ్మకపు ఆహ్వాన పత్రంలో బహిరంగపరచిన రీతికి భిన్నంగా వివేకంగల ఫండ్ మేనేజర్ (ఫండ్ నిర్వాహకుడు) ఈక్విటీ లేదా డెట్ పత్రాల్లో ఎక్కువ లేదా తక్కువ తరహా ఫండ్ ను మదుపు చేయవచ్చును. భద్రతను పరిగణించి అతడు స్వల్ప కాల వ్యవధి ఆధారంగా ఈ చర్యలు చేపట్టవచ్చు. అంటే ఎన్ఎవి ని రక్షించేందుకు ఈ చర్యలు చేపట్టవచ్చు. మదుపరుల శ్రేయస్సును పరిగణనలోనికి తీసుకుని అతని అస్సెట్ కేటాయింపులలో మార్పులు చేయుటకు కొంత మేరకు సడలింపు కోసం ఫండ్ మేనేజర్లకు అనుమతి ఇవ్వబడింది. అయితే మ్యూచువల్ ఫండ్స్ అస్సెట్ కేటాయింపులను శాశ్వత స్థాయిలో మార్పు చేయుటకు యూనిట్ హోల్డర్ల (వాటాదారుల) కు ముందుగా తెలియపరచవలసిన అవసరముంది. అంతేగాక మదుపరులకు ఈ పథకం నుంచి వెలుపలికి పోవడానికి ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్ఎవి లపై ఎటువంటి లోడ్ వసూలు చేయకుండా వారి ఐచ్చికతకు అవకాశం కల్పించాలి.

ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క పథకంలో ఎలా మదుపు చేయాలి?

కొత్త పథకాలను ఫలానా తేదీ నుంచి ప్రారంభించుచున్నట్లు మ్యూచువల్ ఫండ్ లు సాధారణంగా వార్తా పత్రికలలో ప్రకటనల ద్వారా తెలియజేస్తాయి. దరఖాస్తు ఫారాలు మరియు తమకు అవసరమైన సమాచారం పొందేందుకు మదుపరులు మ్యూచువల్ ఫండ్ యొక్క పంపిణీ దారులు మరియు ఫండ్స్ ప్రతినిధులను సంప్రదించవచ్చు. పంపిణీదారులు, ఏజెంట్లు దేశవ్యాప్తంగా ఉంటారు. ఫండ్స్ యొక్క ప్రతినిధులు పంపిణీదారులు దరఖాస్తు ఫారాలనందించే సేవలు చేస్తారు. వారి వద్ద మదుపరులు దరఖాస్తు ఫారాల ద్వారా సొమ్ము జమ (డిపాజిట్) చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ యొక్క యూనిట్లను ప్రస్తుతం తపాలా కార్యాలయాలు, బ్యాంకులు కూడా పంపిణీ చేస్తున్నాయి. అయితే తపాలా కార్యాలయాలు, బ్యాంకులు అందించే ఈ సేవలను మదుపరులు బ్యాంకులు, తపాలా కార్యాలయాల యొక్క స్వంత పథకాలుగా భావించరాదు. అందుచేత ఈ పథకాలపై వచ్చే లాభాలు (returns) బ్యాంకులు, తపాలా కార్యాలయాలు ఇస్తాయన్న హామీ ఆ సంస్థల నుంచి పొందుతాయనుకోరాదు. మదుపరులకు మ్యూచువల్ ఫండ్స్ యొక్క పథకాలను పంపిణీ చేసేందుకు బ్యాంకులు, తపాలా కార్యాలయాలు సహాయం చేయడం వరకే వారి పని అని గ్రహించాలి.

ఒక ప్రత్యేక పథకంలో మదుపు చేసేందు కోసం పంపిణీ దారులు / ప్రతినిధులు ఇచ్చే బహుమతులు, కమీషన్లను మదుపరులు తీసుకొనరాదు. మ్యూచువల్ ఫండ్స్ యొక్క పనితీరును పరిగణనలోకి తీసుకుని వాటి నిర్ణయాత్మక ఉద్దేశాలను మాత్రమే మదుపరులు గమనించాలి.

మ్యూచువల్ ఫండ్స్ లో ప్రవాస భారతీయులు (NRI) మదుపు చేయవచ్చా?

అవును. ఎన్ఆర్ఐ ((ప్రవాస భారతీయులు) లు కూడా మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయవచ్చు. ఇందుకు సంబంధించిన అవసరమైన వివరాలను పథకాల యొక్క అమ్మకపు ఆహ్వాన పత్రాలలో ఇవ్వబడతాయి. 

డెట్ లేదా ఈక్విటీ ఆధారిత పథకాల్లో ఒకరు ఎంత సొమ్ము మదుపు చేయవచ్చు?

ఒక మదుపరి తన యొక్క సాహసంతో కూడిన (risk taking capacity) అపాయాన్ని ఎదుర్కొనే సామర్ధ్యం , వయస్సు, ఆర్ధికస్తోమతలు మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకుని మదుపు చేయవచ్చు. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ పథకాలు వివిధ రకాల సెక్యూరిటీలలో మదుపు చేస్తాయి. ఈ విషయాలను అమ్మకపు ఆహ్వాన పత్రాలలో పేర్కొంటారు. అందుచేత వివిధ రకాల సెక్యూరిటీలలో వివిధ రకాల లాభాలు మరియు ప్రమాదాలు ఉంటాయి. మదుపరులు తాము నిర్ణయాలు తీసుకునే ముందుగా ఆర్ధిక నిపుణులతో కూడా సంప్రదించవచ్చును. ఈ అంశం పై ప్రతినిధులు, పంపిణీదారులు కూడా తమ వంతు సహాయం అందిస్తారు. 

మ్యూచువల్ ఫండ్ యొక్క పథకాల్లో దరఖాస్తు ఫారం నింపడం ఎలా?

దరఖాస్తు ఫారంలో పేర్కొన్నటు వంటి అవసరమైన సమాచారంతోబాటు, దరఖాస్తుదారు పేరు, చిరునామా, ఎన్ని యూనిట్ల కోసం దరఖాస్తు చేస్తున్నారో తదితర వివరాలను దరఖాస్తుదారు స్పష్టంగా తెలియజేయాలి. దరఖాస్తుదారు తన యొక్క బ్యాంకు ఖాతా నెంబరు కూడా వ్రాయాలి.ఎందుకంటే భవిష్యత్ లో మ్యూచువల్ ఫండ్ వారు డివిడెండ్(లాభాల వాటా) ఇచ్చి నప్పుడు కాని లేదా యూనిట్లను తిరిగి కొనుగోలు చేసేటప్పుడు కాని జారీ చేసే చెక్కు/ డ్రాఫ్ట్ లు మోసపూర్వకంగా నగదుగా మార్చుకోవడాన్ని అరికట్టేందుకు ఈ బ్యాంకు ఖాతానెంబరు ఇవ్వడం తప్పనిసరిగా భావించాలి. మ్యూచువల్ ఫండ్ ను తర్వాత కాలంలో దరఖాస్తుదారు చిరునామాలో మార్పు, బ్యాంకు ఖాతా నెంబరు మార్పు మొదలైన వాటిని వెంటనే తెలియజేయాలి. 

అమ్మకపు ఆహ్వానపత్రంలో మదుపరి పరిశీలించవలసిన అంశాలు ఏమిటి?

సంక్షిప్త అమ్మకపు ఆహ్వానపత్రంలో పెట్టుబడి పెట్టే రాబోవు మదుపరులకు ఉపయోగపడే అవసరమైన అతి ముఖ్య సమాచారమును మ్యూచువల్ ఫండ్స్ అందించవలసి ఉంటుంది. అమ్మకపు ఆహ్వానపత్రంలో ఒక పథకంలో చేరేందుకు అవసరమైన దరఖాస్తు ఫారం ఒక ముఖ్య భాగమై ఉంటుంది. అమ్మకపు ఆహ్వానపత్రంలో బహిరంగ పరచవలసిన కనీస అంశాలను సెబి నిర్దేశించింది. ఒక పథకంలో మదుపు చేసే ముందుగా మదుపరి అమ్మకపు ఆహ్వాన పత్రాన్ని జాగ్రత్తగా చదవవలసి ఉంటుంది. పథకం యొక్క ముఖ్య లక్షణాలకు సంబంధించిన అంశాలపై అతి జాగ్రత్త వహించాలి. అంటే రిస్క్ అంశాలు, ప్రాథమిక జారీ ఖర్చులు మరియు పథకంలో మరల మరల వసూలు చేసే ఖర్చులు పథకంలో చేరడానికి , తొలగడానికి వసూలు చేసే లోడ్ లు, స్పాన్సర్ ట్రాక్ రికార్డ్ పట్ల జాగ్రత్త వహించాలి. అంతేగాక ఫండ్ లో ముఖ్యమైన వ్యక్తులైన ఫండ్ మేనేజర్ల వంటి వారి విద్యా యోగ్యతలు పనిలో వారి పూర్వానుభవము పట్ల కూడా జాగ్రత్త వహించాలి. అలాగే మ్యూచువల్ ఫండ్ గతంలో నిర్వహించిన ఇతర పథకాల యొక్క పని సామర్ధ్యం, మ్యూచువల్ ఫండ్స్ పై వాయిదాపడిన వ్యాజ్యాలు (litigations) మరియు విధించిన అపరాధరుసుము (పెనాల్టి) మొదలైన వాటి గురించి జాగ్రత్త పడాలి. 

మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేసిన తర్వాత మదుపరి సర్టిఫికేట్ కాని లేదా తన యొక్క అక్కౌంట్ స్టేట్ మెంట్ కాని ఎప్పుడు పొందగలడు?

మ్యూచువల్ ఫండ్స్ ప్రకటించిన పథకం యొక్క ప్రాథమిక పెట్టుబడుల స్వీకరణ గడువు ముగిసిన నాటి నుంచి 6 వారాలలోపు మదుపరులకు సర్టిఫికేట్లు లేదా అక్కౌంట్ స్టేట్ మెంట్లు పంపబడతాయి. కాలపరిమితితో కూడిన పథకం విషయంలో మదుపరులకు డిమాట్ అక్కౌంట్ స్టేట్ మెంట్ (DEMAT account statement) కాని యూనిట్ సర్టిఫికేట్లు కాని పొందుతారు. ఎందుకంటే ఈ పథకాలకు స్టాక్ ఎక్స్ చేంజ్ (stock exchange) లలో వ్యాపారాలు జరుగుతాయి. కాబట్టి కాల పరిమితి లేని పథకం విషయంలో మ్యూచువల్ ఫండ్ పథకం బహిరంగ ప్రకటన ద్వారా ప్రాథమిక పెట్టుబడుల స్వీకరణ గడువు ముగిసిన 30 రోజులలోపు అక్కౌంట్ స్టేట్ మెంట్లు పంపుతుంది. అమ్మకపు ఆహ్వాన పత్రంలో తిరిగి కొనుగోలు చేసే విధానం గురించి వివరింపబడుతుంది.

కాలపరిమితితో కూడిన పథకాలలో స్టాక్ మార్కెట్ల నుండి యూనిట్లు కొనుగోలు చేసిన తర్వాత ఎంత కాలానికి యూనిట్ల్ బదిలీ జరుగుతుంది?

సెబి (SEBI) నియమ నిబంధనల ప్రకారం మ్యూచువల్ ఫండ్ లాడ్జ్ మెంట్ (lodgment) సర్టిఫికేట్లు జారీ అయిన తేదీ నుంచి నెలలోపు (ముప్పై రోజులలోపు) యూనిట్లను బదిలీ చేయవలసి ఉంటుంది.

యూనిట్ హోల్డర్ అయిన పిదప డివిడెండ్లు (లాభాల వాటా) లేదా తిరిగి కొనుగోలు చేసిన యూనిట్ల పై వచ్చే సొమ్ము పొందడానికి ఎంత కాలం పడుతుంది?

డివిడెండ్ ప్రకటించిన ముప్పై రోజులలోపు యూనిట్ హోల్డర్లకు డివిడెండ్ వారెంట్లను మ్యూచువల్ ఫండ్ పంపవలసి ఉంటుంది. అలాగే వాటాదారు కోరిక మేరకు వాటాను తిరిగి కొనుగోలు చేసిన తర్వాత కాని లేదా యూనిట్ల విడుదల (redemption) నిర్వహించిన తేదీ నుంచి కానీ 10 పనిరోజులలోపు తిరిగి కొనుగోలు చేసిన లేదా విడుదల (redemption) సొమ్ము పంపడం జరుగుతుంది.

విడుదల కల్గించిన / లేదా తిరిగి కొనుగోలు చేసిన యూనిట్ల సొమ్మును నిర్ణయించిన గడువు లోపు పంపడంలో విఫలమైన పక్షంలో అస్సెట్ మేనేజ్ మెంట్ కంపెనీ (Asset management company) సెబి (SEBI) తీసుకునే కాలానుగుణమైన వడ్డీ రేట్ల ప్రకారం వడ్డీని (15 శాతం ప్రస్తుతం వడ్డీ రేటు) చెల్లించవలసి ఉంటుంది.

అమ్మకపు ఆహ్వానపత్రంలో పేర్కొన్న ఒక పథకం యొక్క లక్షణాలను మ్యూచువల్ ఫండ్ మార్పు చేయవచ్చా?

చేయవచ్చు. అయితే పథకం యొక్క నియమ నిబంధనల లక్షణాలను మార్చకుండా అంటే పథకం యొక్క మౌలికాంశాలను ఉదాహరణకు రూపం, పెట్టుబడుల తీరు మొదలైన వాటిని మార్చుకోవచ్చు. అయితే ఈ మార్పు విషయాన్ని ప్రతి ఒక్క వాటాదారుకు తెలియపరచాలి లేదా దేశ వ్యాప్తంగా చెలామణి కల్గిన ఆంగ్ల పత్రికలో ప్రకటన ప్రచురణ ద్వారా తెలియపరచాలి. అలాగే మ్యూచువల్ ఫండ్ ప్రధాన కార్యాలయంగల ప్రాంతం నుంచి ప్రచురింపబడుతున్న ప్రాంతీయ భాషా పత్రికలో ప్రకటన ప్రచురణ ద్వారా కూడా తెలియ పరచాలి. ఈ పథకంలో ఉండడానికి ఇష్టం లేని వాటాదారు ఎటువంటి ఎక్జిట్ లోడ్ లేకుండా ప్రస్తుతం అమలులో ఎన్ఎవి వద్ద తొలగడానికి (వెళ్లి పోవడానికి) యూనిట్ హోల్డర్లకు హక్కు కలదు. స్పా న్సర్ మార్పు చెందిన సందర్భంలో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇదే విధానాన్ని అనుసరించవలసిన అవసరముంది. అలాగే పథకం యొక్క రూపాన్ని కాల పరిమితితో కూడిన పథకం నుంచి కాల పరిమితిలేని పథకంగా మార్చినప్పుడు కూడా ఇదే విధానాన్ని అనుసరించవలసి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్ లో వస్తున్న మార్పులను గురించి మదుపరులు ఎలా తెలుసుకోగలరు?

మ్యూచువల్ ఫండ్ లో కాలానుగుణంగా మార్పులు వస్తూ ఉంటాయి. తమ ఫండ్ లో ఏవైనా ద్రవ్యంకు సంబంధించిన (material) మార్పులు కనుక అవసరమైతే ఆ సమాచారాన్ని యూనిట్ హోల్డర్లకు మ్యూచువల్ ఫండ్ తెలియజేయాలి. ఇదేకాక ఎన్నో మ్యూచువల్ ఫండ్స్ తమ యొక్క మదుపరులకు త్రై మాసిక వార్తా సమాచారాలను లేఖల ద్వారా తెలియజేస్తాయి. ప్రతి రెండేళ్ళకు కనీసం ఒక్కసారైనా అమ్మకపు ఆహ్వాన పత్రాల్లోని అంశాలను సవరించి ఆ రోజు నాటికి ఉన్న అంశాలను తెలియపరచవలసిన అవసరం ప్రస్తుతం అమలులో ఉంది. ఇది ఇలా ఉండగా, మ్యూచువల్ ఫండ్ పథకంలో ద్రవ్యానికి సంబంధించి చేసిన మార్పులు గురించి అమ్మకపు ఆహ్వాన పత్రం సవరించి తిరిగి ప్రచురించే సమయం వరకు ఈ మార్పుల అంశంతో కూడిన సమాచారం కలిగిన అదనపు(అనుబంధ) పత్రాన్ని(addendum) ప్రస్తుత అమ్మకపు ఆహ్వాన పత్రంకు జత చేసి కొత్త మదుపరులకు అందించాలి.

admin:
All Rights ReservedView Non-AMP Version