క్రిప్టోకరెన్సీ అంటే బ్లాక్‌చెయిన్‌పై పనిచేసే డిజిటల్ కరెన్సీ.
కృష్ణాష్టమి అంటే కృష్ణుని బర్త్‌డే అనేసినట్టున్నా అంత సులువుగా అర్థం కాని విషయమిది.
ముందుగా మనకు అలవాటైన డబ్బు అంటే అసలేమిటి?
RBI ముద్రించే నోట్లపై RBI గవర్నర్ సంతకం చేసినందున ఆ నోట్లకు విలువ వస్తుంది. అంటే ప్రతి నోటు ఒక నిర్ణీత విలువకు కోశాగారం అనుకోవచ్చు. వాటిని చట్టపర లావాదేవీలకు వాడుకోవచ్చు. దీన్ని ఆర్థిక మాండలికంలో ఫియట్ కరెన్సీ అంటారు. మన రుపాయి కూడా ఫియట్ కరెన్సీయే.
ఇది డిజిటల్ రూపంలోనూ వాడవచ్చు – క్రెడిట్ కార్డులు, UPI, వగైరా. అయితే డిజిటల్ లావాదేవీల వెనుక కూడా కరెన్సీ బదలాయింపు ఉంటుంది. ఫియట్ కరెన్సీ లావాదేవీల మూలం, ఆనవాలు, జాడలను కనిపెట్టటం RBI వంటి సంస్థలకు సాధ్యం. ఉగ్రవాదం, కుంభకోణాలు వంటివాటిని అరికట్టేందుంకు ప్రపంచవ్యాప్తంగా ఫియట్ కరెన్సీ జాడలను కనిపెట్టటం సాధారణంగా జరిగేదే.
ఫియట్ కరెన్సీ చెలామణీ, విలువ, దానికి తగిన విదేశీ మారకద్రవ్యం వంటి అంశాలన్నీ RBI ఆధీనంలో ఉంటాయి. ఈ డబ్బు భద్రతకు, లావాదేవీలకు ఒక మధ్యవర్తి ఉండాలి. ఉదాహరణ బ్యాంకులు.
ఫియట్ కరెన్సీ యొక్క ముఖ్యలక్షణం అపరిమిత సరఫరా. ఎంత ముద్రించాలి అన్న పరిమితులున్నా సెంట్రల్ బ్యాంకు ముద్రిస్తూనే ఉంటుంది.
క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి?
క్రిప్టో కరెన్సీ కూడా డిజిటల్ కరెన్సీనే. ఇది వర్చువల్ కరెన్సీ. అయితే డిజిటల్ కరెన్సీపై కేంద్రం లేదా ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల నియత్రణ ఉంటుంది. డిజిటల్ కరెన్సీ నిర్వహణ బాధ్యతను ఇవి చూసుకుంటాయి. అయితే ఇక్కడ క్రిప్టోకరెన్సీల విషయానికి వస్తే.. వీటిపై ఎవరి నియంత్రణ ఉండదు. డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి. క్రిప్టోకరెన్సీల విలువ డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది. బ్లాక్‌యెయిన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టోకరెన్సీలు పనిచేస్తాయి.
సరళంగా చెప్పాలంటే క్రిప్టోకరెన్సీ ఒక వ్యక్తిగత డిజిటల్ ఖాతాను అందించే కంప్యూటర్ ప్రోగ్రామ్. పైన చెప్పుకున్న అంశాలన్నిటికి అతీతంగా ఉండే కరెన్సీ క్రిప్టోకరెన్సీ.
- నియంత్రణా వ్యవస్థ లేదు, ఉండదు.
- తగిన పరికరాలు ఉన్నవారెవరైనా ముద్రించవచ్చు.
- ఎవరైనా ప్రపంచంలో ఎవరితోనైనా లావాదేవీలు అనామకంగా జరపవచ్చు.
- మధ్యవర్తులు అవసరం లేదు.
- లావాదేవీలన్నీ డిజిటల్‌గా నమోదై ఉన్నా వేరెవరూ వాటిని చూడలేరు.
- పరిమిత ముద్రణ (అదీ డిజిటల్‌గానే).
దానిలో పెట్టుబడి పెట్టడం ఎంతవరకూ సరైన చర్య?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై రకరకాల ఆంక్షలు, అపోహలు ఉన్నాయి. అసలిలాంటి అనియంత్రిత కరెన్సీని చట్టపరం చెయ్యటం అనర్థదాయకం అని వాదించే ప్రభుత్వాలూ ఉన్నాయి. మన దేశంలోనే క్రిప్టోకరెన్సీ చట్టవిరుద్ధమని, కాదు అలా నిషేధించటం తప్పనీ ఊగిసలాట ధోరణి కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే క్రిప్టోకరెన్సీని లావాదేవీలకు స్వీకరించే సంస్థలు పెరుగుతూనే ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీపై విధివిధానాలు ఏర్పడటానికి సమయం పట్టవచ్చు. ఎందుకంటే వాటిపై విధివిధానాలు ఎలా రూపొందించాలో స్పష్టమైన జ్ఞానం, అనుభవం చాలా అరుదు. అందువల్ల వాటిలో పెట్టుబడి ఎంతో రిస్క్‌తో కూడుకున్నదన్న విషయం విదితం.
ఇదిలా నడుస్తూనే ఉన్నా, క్రిప్టోకరెన్సీల విలువ వాటి నైసర్గిక లక్షణాల వల్ల పెరుగుతూనే ఉంటుంది (కుదుపులు సహజమే). మరే పెట్టుబడి మార్గంలాగానే ఇందులోనూ వ్యక్తిగత రిస్క్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి.
అన్ని సాంప్రదాయక పెట్టుబడి మార్గాల్లోనూ అత్యుత్తమ రాబడులను ఇచ్చేది స్టాక్ మార్కెట్ అన్నది చరిత్ర చూపిన వాస్తవమే అయినా మన దేశంలో కేవలం 14% జనాభా మాత్రమే వాటిలో పెట్టుబడి పెడుతున్నారు. ఎవరి వ్యక్తిగత లక్ష్యాలను అనుసరించి వారు పెట్టుబడి మార్గాలు ఎంచుకుంటారు సాధారణంగా. అలాగే ఇటువంటి రిస్క్ ఎక్కువైన పెట్టుబడి మార్గానికి వ్యక్తిగత ప్రణాళికలో ఎడం ఉంటే మొత్తం కోల్పోయే పరిస్థితి సాధ్యం అని సన్నద్ధమై మొదలుపెట్టవచ్చు.