కార్పొరేట్ కంపెనీలు పేలవమైన ఫలితాలు ప్రకటించడం, వృద్ధిరేటు క్షీణించడం, పెరుగుతున్న ద్రవ్యలోటు, అధిక ద్రవ్యోల్బణం ,అనూహ్యంగా డాలరుతో రూపాయి మారకం విలువ ,వంటి పరిస్థితుల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు ఉరకలేయడం లేదు.మధ్యలో రిలీఫ్ రాల్యిస్ వచ్చినా విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లో మదుపు చేయడానికి అంత ఆసక్తి చూపడం లేదు.ఆర్థిక వ్యవస్థపై స్పష్టత వచ్చాకే తిరిగి విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున మదుపు చేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.అయితే ఇదే సమయంలో దేశీయ మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లు జరుపుతున్నా వాటి ప్రభావం మార్కెట్ పై తక్కువే. ప్రస్తుతం చాలా షేర్లు తక్కువ రేట్ల వద్ద ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయవచ్చా? అని చాల మంది ఇన్వెస్టర్లకు సందేహం కలగవచ్చు.ఆల్‌టైమ్ కనిష్టస్థాయికి చేరిన షేర్లు మరింత క్షీణించే అవకాశముంది. కాబట్టి షేరు ధరను చూసి కొనడమనేది చాలా ప్రమాదకరం. అలా చేస్తే చేతులు కాలడం ఖాయం. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తక్కువ పీఈ ఉన్న కన్సూమర్ డ్యూరబుల్ రంగానికి చెందిన షేర్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే పీఎస్‌యూ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ రంగాలకు అంతగా ప్రమాదమేమీ లేదు. రుణభారం అధికంగా ఉన్న కంపెనీల షేర్లకు దూరంగా ఉండటం మంచిది అని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుత మార్కెట్ పరిస్తితులను బట్టి ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక వ్యూహాలను అనుసరించక తప్పదు . లేదంటే మార్కెట్కి దూరం గా ఉండటమే మంచిది. సెన్సెక్స్ పెద్ద ఎత్తున పెరిగే అవకాశాలు లేవు.విశ్లేషకులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. ఈ క్రమం లో స్వల్పకాలిక వ్యూహాలు చిన్న ఇన్వెస్టర్లకు అనువైనవి కాదు. కొంత ధైర్యం చేసి దీర్ఘ కాలిక వ్యూహం తో మంచి షేర్లలో మదుపు చేస్తే భవిష్యత్ లో లాభాలు అందుకునే అవకాశాలు పుష్కలం గా వున్నాయి. అయితే ఇక్కడ కూడా కొంత రిస్క్ తప్పదు.కాగా పోర్ట్ ఫోలియో లో మార్పులకు కూడా ఇదే అదను. బ్లూ చిప్ షేర్లు కూడా ఎన్నో అందుబాటులో వున్నాయి.వీటిలో మదుపు చేస్తే లాభాలు ఖాయమని చెప్పుకోవచ్చు.
పోర్ట్ ఫోలియో లో 5నించి 10షేర్లు వుండాలి .10 కన్నా ఎక్కువ షేర్లు ఉండటం మంచిది కాదు .భిన్న రంగాలకు చెందిన షేర్లు పోర్ట్ ఫోలియో లో ఉండేలా చూసుకోవాలి . మనం కొనుగోలు చేసిన షేర్ల ధరలను క్రమం తప్పక సమీక్షించుకోవాలి .ఇక ప్రస్తుత మార్కెట్ లో స్వల్ప కాలిక వ్యూహాలను పాటించే ఇన్వెస్టర్లు అధిక రిస్క్ తీసుకోవాలి .రోజు వారీ కొనుగోళ్ళ లో రిస్క్ ఇంకా ఎక్కువ గా వుంటుంది .ఒక్కో సారి లాభాలు రావచ్చు .అదే రీతిలో నష్టాలు రావచ్చు.వీటిని నివారించడం కష్టమే . ఇన్వెస్టర్లు తీసుకునే నిర్ణయాలు ఒక నిమిషం ఆలస్యమైనా నష్టాలు తప్పవు.రిస్క్ ని పూర్తిగా భరించే శక్తి గల వారు మాత్రమే ఈ తరహా ట్రేడింగ్ లో పాల్గొనాలి . ముందే చెప్పుకున్నట్టు దీర్ఘ కాలిక వ్యూహం తో మదుపు చేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలి.