Uncategorized

ప్ర‌ణాళిక ఉంటేనే..గృహ రుణం

ప్రతి ఒక్కరికీ సొంతింటి కల అనేది ఉంటుంది. బ్యాంకింగ్‌ రంగాల్లో రుణవ్యవస్థ క్రమేణా విస్తరిస్తున్న ఈరోజుల్లో ఆ కల నెరవేర్చుకోవడమూ సులభమే. అయితే అందుకు సరైన ఆర్థిక ప్రణాళిక గురించి తెలుసుండాలి. గృహరుణాలు పొందే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా సిద్ధపడాలి? ఏయే నిబంధనలు పాటించాలి? అనే వివరాలు ఈవారం ‘రూపాయి’ కథనంలో

ఇంట్లో ఓ ఆడబిడ్డకు పెళ్లి చేయడం కంటే ఇల్లు కట్టడమే ఎంతో బరువైన విషయంగా చెప్తుంటారు పెద్దలు. ఇల్లు కట్టుకునే విషయంలో అన్ని బరువూ బాధ్యతలూ ఉంటాయనే దీని సారాంశం. ముఖ్యంగా రోజు రోజుకీ భూమికి విలువ పెరుగుతున్న ఈ రోజుల్లో ‘సొంత ఇల్లు’ అనేది ఎంతో వ్యయప్రయాసలతో కూడిన విషయం. ఇల్లు కొనే విషయంలోగానీ, కట్టే విషయంలోగానీ సరైన ఆర్థిక ప్రణాళిక ఉండకపోతే తర్వాత రోజుల్లో ‘ఇల్లు’ గుల్లయ్యే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే, బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఇల్లు కొనాలనుకునే వారికి సరైన ఆర్థిక ప్రణాళిక ఉండాలనేది నిఫుణుల మాట.

గృహరుణాల్లో ముందంజ
దాదాపు అన్ని జాతీయ బ్యాంకులు, ప్రయివేట్‌ బ్యాంకులు ఇంటి రుణాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. దీనికి కారణం ఒక్కటే. లోన్‌ తీరే వరకూ ఆయా స్థిరాస్తులు బ్యాంకు పరిధిలో ఉండటంతోపాటు వినియోగదారుల నుంచి దీర్ఘకాలపు ఆదాయ ప్రయోజనం దక్కుతుంది. అయితే బ్యాంకుల నుంచి గృహ రుణాలు (హౌసింగ్‌ లోన్స్‌) పొందేందుకు కొన్ని నియమాలు, షరతులు కచ్చితంగా పాటించాలి. అంటే ఆదాయ వనరుల ఆధారంగా ఏ తరహా రుణం వస్తుందన్నది ముందుగా తెలుసుకుని, బ్యాంకుల్ని సంప్రదిస్తే, ఇంటి రుణాలు పొందడం సులభతరం.
ఇంటి రుణం విషయంలో కస్టమర్‌ అర్హత, రీ పేమెంట్‌ ఈ రెండు అంశాలను బ్యాంకులు ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటాయి. అందుకే గృహ రుణం తీసుకోవాలనే ఆలోచన రాగానే లోన్‌ తీసుకోవడానికి మీకున్న ఆదాయ వనరులు, తిరిగి చెల్లించే అవకాశాలను ముందుగా పరిశీలించుకోవాలి. అందుకు సంబంధించిన పత్రాలతో బ్యాంకులను సంప్రదిస్తే, ఇంటి రుణం పొందేందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. 

గృహ రుణాలు-రకాలు
ప్రస్తుతం మార్కెట్లో అనేకరకాల గృహ రుణాలు అందుబాటులో ఉన్నాయి. రెగ్యులర్‌ గృహ రుణాలు, హోం ఎక్స్‌టెన్షన్‌ రుణాలు (గృహ విస్తరణ రుణం), హోం ఇంప్రూవ్‌మెంట్‌ రుణాలు (గృహ ఆధునీకరణ రుణం), హోం మార్ట్‌గేజ్‌ రుణాలు (ఇంటి తనఖా), నాన్‌ రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ రుణాలు (గృహేతర ఆస్తులపై రుణాలు) ఇలా రకరకాల పేర్లతో గృహ రుణాలు ఉంటాయి. అయితే ఎలాంటి రుణం తీసుకోవాలి అనే విషయంలో పూర్తి అవగాహన ఉండాలి. ఇందుకు సంబంధిత నిపుణుల సూచనలూ అవసరం. 

అర్హతలేంటి? రుణం ఎంత?
ఇంటి రుణం కోసం ప్రయత్నం చేసేవారిలో చాలామందికి అసలు ఇంటి రుణం ఎవరికి ఇస్తారు? ఎంత మొత్తంగా ఇస్తారు? అనే అనుమానం కలుగుతూ ఉంటుంది. వేతన జీవులు అంటే ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలు చేసేవారు, అలాగే స్వయం ఉపాధి పొందుతున్నవారు, బృంద సభ్యులతో కూడిన సహకార గహ నిర్మాణ సంఘాలు, కార్పొరేట్‌ సంస్థలకు బ్యాంకులు గృహ రుణాలు అందిస్తాయి. కస్టమర్‌ కొను గోలు చేస్తున్న లేదా నిర్మిస్తున్న ఇంటి వ్యయంలో గరిష్టంగా 80 శాతం విలువకు మాత్రమే రుణం పొందే అవకాశం ఉంది. 
రీ పేమెంట్‌ సామర్థ్యం, వయసు, విద్యార్హతలు, స్థిరమైన, క్రమమైన రాబడులు, లోను తీసుకుంటున్న వ్యక్తిపై ఆధారపడిన కుటుంబసభ్యులు, ఆస్తులు, రుణాలు, డబ్బు ఆదా చేసే అలవాట్లను పరిగణనలోకి తీసుకుని, ఎంత రుణం మంజూరు చేయాలో బ్యాంకులు నిర్ణయిస్తాయి. వ్యక్తిగత ఆదాయ వనరులతో జీవిత భాగస్వామి ఆదాయాన్ని కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. భార్యాభర్తల ఇద్దరి ఆదాయాన్ని కలిపి చూపించగలిగితే రుణం పొందే అవకాశాలు మెరుగవుతాయి. 

కాలపరిమితి 
గృహ రుణాల కాలపరిమితి కనీసంగా ఏడాది నుంచి 20 ఏళ్ల వరకూ ఉంటుంది. కొన్ని సంస్థలైతే 25 ఏళ్ల కాలపరిమితి వరకూ రుణాలు మంజూరు చేస్తుంటాయి. కానీ, రుణ కాలపరిమితి ఆ వ్యక్తి రిటైర్‌ అయ్యే నాటికి ముగిసే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఉద్యోగస్తుల విషయంలో అయితే రుణం తీసుకున్న వ్యక్తి 60 ఏళ్లకు రిటైర్‌ అయితే అదే ఏడాదిగానీ, అంతకంటే ముందేగానీ రుణ కాలపరిమితిలోపు రుణం మొత్తం పూర్తయ్యేలా వాయిదాలను లెక్కగడతారు. ఉద్యోగులు కాకుండా స్వయం ఉపాధి పొందిన వారైతే రిటైర్‌మెంట్‌ వయసును 65 సంవత్సరాలుగా పరిగణిస్తారు. రీపేమెంట్‌ కాలపరిమితిని నిర్ణయించుకునేటప్పుడు రిటైర్‌మెంట్‌ వయసునూ పరిగణనలోకి తీసుకోవాలి. రిటైర్‌మెంట్‌ను బట్టి, అలాగే భవిష్యత్తులో సమకూరే అదనపు ఆదాయ వనరులను బట్టి రుణ కాలపరిమితిని నిర్ణయించుకోవాలి. 

ఉండా ల్సిన డాక్యుమెంట్లు
వినియోగదారుడి వివరాలు అంటే సొంత చిరునామా రుజువులు, వృత్తి, ఉపాధి రుజువుల పత్రాలు. ఇళ్లు కొనుగోలు చేస్తున్న లేదా నిర్మిస్తున్న ప్రదేశ వివరాలు. సాధారణంగా ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఐడి ప్రూఫ్‌ పత్రాలు, ఉద్యోగస్తులైతే శాలరీ స్లిప్‌, ఫాం-16, ఐడి కావాలి. వ్యాపారవేత్తలైతే బ్యాలెన్స్‌ షీట్‌, పి అండ్‌ ఎల్‌ ఖాతా, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఏ ప్రాపర్టీ కొనుగోలు చేయాలో ముందే నిర్ణయించుకున్నట్లయితే దానికి సంబంధించిన పత్రాల ఫొటో కాపీ కూడా అవసరం అవుతుంది. 

అంతా బాగుంటేనే
రిస్క్‌ను తగ్గించుకునే కోణంలో దాదాపు అన్ని హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు గృహ రుణాల దరఖాస్తులను చాలా నిశితంగా ఒకటికి పదిసార్లు పరిశీలిస్తాయి. రుణం ఇవ్వడానికి అన్ని అర్హతలూ సరిగ్గా ఉన్నాయా లేదా అనే అంశాన్ని మొదటి వడపోతలో తేలుస్తాయి. అంటే మీరు సమర్పించిన పత్రాల ఆధారంగా దీన్ని అంచనా వేస్తాయి. కనీస అర్హతలు లేనట్టయితే లోన్‌ ఇవ్వడానికి నిరాకరిస్తాయి. అన్ని కోణాల్లో వెరిఫికేషన్‌ (పరిశీలన) పూర్తయ్యి, గుడ్‌ క్రెడిట్‌ అని భావిస్తే, గృహ రుణాన్ని మంజూరు చేస్తాయి. 
నచ్చిన ఇల్లు చూసి, కొనడానికి సిద్ధపడిన వెంటనే రుణం కోసం ప్రయత్నం చేస్తే వెంటనే ఇంటి రుణం వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే లోన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వెరిఫికేషన్‌ పీరియడ్‌ అనేది ఉంటుంది. వెంటనే లోన్‌ వచ్చేదీ, రానిదీ తేలకపోవొచ్చు. అందుకే అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే ఇంటి గురించి ఒక ఆలోచన రాగానే కనీసం ఐదారు నెలల ముందు నుంచే గృహ రుణం సమకూర్చుకోవడం కోసం ఎలాంటి ఆర్థికపరమైన అర్హతల్ని పెంచుకోవాలి? అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వాటిపై దృష్టి సారిస్తే.. లోన్‌ కావాల్సిన సమయానికి ఎలాంటి సమస్యలూ తలెత్తవు. గృహరుణాల విషయంలో ఇలాంటి ప్రాథమిక అంశాలపై ముందుగానే అవగాహనకు రావడం శ్రేయస్కరం.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *